Home తాజా వార్తలు ఐదే రోజులు

ఐదే రోజులు

State government plans to prepare life insurance of farmer

5 రోజుల్లోనే రైతుబీమా పరిహారం 

మినానీ ఖాతాలో వేయడానికి ఏర్పాట్లు
ఎల్‌ఐసి పది రోజుల వ్యవధి సగానికి కుదింపు
ఇప్పటికే 52 మంది కుటుంబాలకు పరిహారం
త్వరలో మరి 26 మందికి చెల్లింపు
అధికారులు రైతులకు అండగా ఉండాలి – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

మన తెలంగాణ/ హైదరాబాద్: రైతుబంధు జీవిత బీమా పరిహారాన్ని సత్వరమే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసింది. బీమా చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు వెంటనే ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఐదు రోజుల లోపే పరిహారాన్ని నామినీ ఖాతాకు పంపేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రోజుల్లోనే పరిహారం అందిస్తామని గతంలో ఎల్‌ఐసి ప్రకటించింది. ఇప్ప టి వరకు బీమా చేసుకున్న రైతులలో దురదృష్టవశాత్తు 78 మంది రైతులు మరణించగా, అందులో 52 మంది రైతులు బీమా పత్రంలో సూచించిన నామినీలకు రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. మరో 26 మంది రైతుల కుటుంబాలకు త్వరలోనే ఎల్‌ఐసి పరిహారం జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచే రైతుబీమా అమల్లోకి వచ్చిన విష యం విదితమే. ఎల్‌ఐసితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది పాటు అంటే వచ్చే సంవత్సరం ఆగస్టు 13వ తేదీ వరకు బీమా కొనసాగనుంది.

వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుబంధు చెక్కులు పొందిన 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు రైతుల నుంచి బీమా దరఖాస్తులు, నామినీ పత్రాలు సేకరించారు. మొత్తం 27.10 లక్షల మంది రైతుల నుంచి వివరాలు తీసుకోగా ఇందులో 26.3 లక్షల మంది రైతులకు ఎల్‌ఐసి ఐడి నెంబర్‌లు వచ్చినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వీళ్లందరికి ఎస్‌ఎంఎస్ రూపంలో వారి మొబైల్ ఫోన్‌లకు సమాచారాన్ని కూడా పంపారు. మిగతా వారిని కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఎల్‌ఐసి నెంబర్‌లు ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ వరకు ఎల్‌ఐసి గడువు ఇచ్చింది. ఆర్‌ఒఎఫ్‌ఆర్ రైతులకూ బీమా వర్తింపజేసినందున వారి వివరాలను కూడా తీసుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం 27.99 లక్షల మంది రైతులకు సరిపోయే బీమా ప్రీమియాన్ని ఎల్‌ఐసికి ముందుగానే చెల్లించింది. ఇదిలా ఉండగా కేవలం ఐదు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 78 మంది రైతులు చనిపోవడం ఆందోళనకరమని రైతుసంఘాలు అంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో రోజుకు సగటున 16 మంది రైతులు మృతి చెందుతున్నారు. అందులోనూ వీరంతా 60 ఏళ్లలోపు వారే కావడం, సహజ మరణాలా లేక ఆత్మహత్యలా ఏదైనా వ్యాధితో మరణిస్తున్నారా అనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

అధికారులు రైతులు అండగా ఉండాలి: పోచారం
దురదృష్టవశాత్తు రైతు మరణించి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి వ్యవసాయ శాఖ అధికారులే అండగా ఉండి, బీమా పరిహారం సత్వరమే అం దేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో సమీక్షించిన మంత్రి వెంట వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్న అధికారులను అభినందించారు. ఇదిలా ఉండగా బీమా సెటిల్‌మెంట్‌లో సాంకేతిక ఇబ్బందులను అధిగమించాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి అన్నారు. ఎన్‌ఐసి, ఎల్‌ఐసి అధికారులు ఈ విషయంలో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎల్‌ఐసి జోనల్ కార్యాలయంలో శనివారం ఆయన రైతుబీమాపై సమీక్షించారు. ఎపిజివిబి బ్యాంకుకు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ నూతనంగా ఏర్పాటు చేసుకుంటున్నందున ఆ బ్యాంకుల్లో ఏ నామినీకైనా ఖాతా ఉంటే, వెంటనే ఇతర బ్యాంకులలో తెరిపించాలన్నారు. ప్రాంతీయ కార్యాలయంలోనే కొన్ని సమస్యలు పరిష్కరించుకునేలా ఎల్‌ఐసి అధికారులు సహకరించాలని కోరారు.