Home తాజా వార్తలు తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ

తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ

  • చద్దుల బతుకమ్మపై ప్రత్యేక కథనం

Batukammaరంగురంగుల పూలతో అందాల్ని తెచ్చే తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ. పల్లెల ప్రకృతి అందాలకు అద్దంపట్టే పండుగ బతుకమ్మ. గౌరీదేవికి ప్రతీకగా పూజిస్తూ ఆట పాటలతో ముచ్చటైన తరతరాల సంస్కృతిని చాటిచెప్పే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఆడపడుచుల హంగు, ఆర్భాటాలతో ప్రారంభం కానున్న తెలంగాణ బతుకమ్మ పెద్ద పండుగపై ప్రత్యేక కథనం..
హైదరాబాద్ :
బతుకమ్మ అలంకారమే ఓ అద్భుత కళ
బతుకమ్మను రంగురంగుల పూలతో అలంకారం చేయడమే ఓ అద్భుత కళ, సాక్షాత్తూ గౌరీదేవి కళ్ళముందు ప్రత్యక్షమయ్యేలా బతుకమ్మను పేరుస్తారు. మొదటి వరుసలో తంగేడుపూలు పేరుస్తారు. రెండో వరుసలో గునుగు పూలు పేరుస్తారు. సాధారణంలో గునుగుపూలు గులాబి, తెలుపు రంగుల్లో జుట్టు రూపంలో ఉంటాయి. వీటిని రంగుల మయంతో నాలుగు వరుసల్లో గోపురాకారంలో పూలను పేరుస్తారు. వరుసల్లో చామంతి, బంతి, గన్నేరు, నందివర్ధనం, మందారం, గోరింట, గుమ్మడి పూలను పేరుస్తారు. మధ్యలో ఓ తమలపాకుపై పసుపుముద్దను గోపురం ఆకారంలో తయారుచేసి గౌరమ్మగా ఉంచుతారు. దానికి కుంకుమబొట్లుపెట్టి, అగరవత్తులు వెలిగించి గుభాళించే వాసనలతో బతుమ్మను వైభవంగా అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ పక్కన తల్లిబతుకమ్మతో పాటుగా పిల్లబతుకమ్మను కూడా చిన్నదిగా పేరుస్తారు.
తొమ్మిదిరోజుల ఆడబిడ్డల పండుగ
మెట్టినింటినుంచి పుట్టింటికి వచ్చే ఆడపడుచులు తొమ్మిదిరోజులు జరుపుకునే ఆడబిడ్డల పండుగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రభుత్వం కూడా ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం మరో విశేషం. తొమ్మిది రోజులపాటు నిత్యం రంగురంగులతో పేర్చిన బతుకమ్మలతో దగ్గరలోని ఆలయాల్లో ఉంచి భక్తి శ్రద్దలతో బతుకమ్మ ఆట,పాటలతో తమ కుంటుంబం పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆడపడుచులు గౌరమ్మను వేడుకుంటూ రకరకాల పిండివంటకాలను చేసి నైవేద్యం పెడుతూ వేడుకగా పండుగను జరుపుకుంటారు. చద్దుల బతుకమ్మ పెద్దపండుగ రోజైన చివరిరోజున ఊరంతా ఒకేచోట కలిసి బతుకమ్మ జాతరలో ఆటలు ఆడి, పాటలు పాడి మళ్ళీ రావమ్మ బతుకమ్మ అంటూ చెరువుల్లో బతుకమ్మలను భక్తి శ్రద్దలతో సాగనంపడం బతుకమ్మ పండుగ విశిష్టత.
………………………………………………
ఏమిపువ్వులు కావాలి గౌరమ్మ అంటూ వివరించే ప్రాచీన కాలంనాటి బతుకమ్మ పాట మహిళలకు ఎంతో ఇష్టమైన పాట……….
ఏమేమి పూవ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
తంగేడు పూవ్వొప్పునే గౌరమ్మ
తంగేడు కాయప్పునే
తంగేడు పువ్వులో తండేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (ఏమేమి..)

ఏమేమి పొవ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పుడే
తెలుగంటి పొవ్వొప్పునే గౌరమ్మ
తెలుగంటి కాయప్పునే
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (ఏమేమి..)

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పొవొప్పునే గౌరమ్మ
ఉమ్మెత్త కాయప్పునే
ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు (ఏమేమి..)

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
మందార పువ్వొప్పునే గౌరమ్మ
మందార కాయప్పునే
మందార పువ్వులో మందార కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (ఏమేమి..)

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
గుమ్మడి పొవ్వొప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (ఏమేమి..)

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
గన్నేరు పొవ్వొప్పునే గౌరమ్మ
గన్నేరు కాయప్పునే
గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (ఏమేమి..)

చేలల్లో పూలు
తల్లితోపాటుగా పిల్ల బతుకమ్మ
పరమేశ్వరుడికి తంగేడు పూలు
గౌరమ్మకు గుమ్మడి పూలు
గోపురాకారంలో బతుకమ్మ (ఏమేమి..)
…………………………………..
తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మను పేర్చడం ఓ అద్భుత కళ. పేర్చడంలో స్త్రీల సౌందర్య ఆరాధన ఉట్టిపడుతుంది. తండేడు, గునుగు, తామర, గన్నేరు, బంతి, చామంతి, గోరింట, గుమ్మడి తదితర పూలను సేకరించి అలంకారంతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పేర్చిన బతుకమ్మలో పూలు జారిపోకుండా దారం ఆధారంతో కట్టుకుంటూ ఒక్కొక్క రంగుపూలతో పేరుస్తూ ఉంటారు.
రోజొక్క ఫలహారం ..
మొదటి రోజు
తమలపాకు, వక్కలు, తులసీదళం, దానిమ్మ గింజలు, శనగపప్పు, పెసరప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజలు, సత్తుపిండిని తయారుచేసుకుని తీసుకువెళతారు. సత్తుపిండిని తయారు చేసేమందు మొక్కజొన్న గింజలను వేయించాలి అనంతరం ఇసుర్రాయితో దాన్ని పిండిచేసి బెల్లం నీటితో కలిపి సత్తుపిండిని పోసి ముద్దలుగా చేసి ప్రసాదంగా చేయాలి.
రెండవరోజు
రెండవరోజు గౌరమ్మకు పప్పుబెల్లం, మిరియాలతో తయారు చేసిన వంటకం నైవేద్యమగా సమర్పిస్తారు. ఇది తయారు చేసేందుకు ఆ రోజు ఉదయమే శనగపప్పు లేదా పెసరపప్పు నీళ్ళలో నానబెట్టాలి, తర్వాత పప్పులో నీళ్ళు తీసి బెల్లం కలిపి ప్రసాదంగా చేస్తారు.
మూడవరోజు
మూడవరోజు పూర్ణాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. దీన్ని చేయడానికి శనగపప్పు బాగా ఉడికించి గ్రైండర్‌కానీ, రోటిలోకాని మెత్తగా రుబ్బాలి. తర్వాత బెల్లం నీటిలో నానబెట్టి లేతపాకంగా ఉడికించిన తర్వాత అందులో గ్రైండింగ్ చేసిన శనగపప్పు ముద్దను వేసి బాగా కలపాలి. అనంతరం బియ్యం, మినపప్పు మిశ్రమంగా నానబెట్టి నీటిలో నానిన అనంతరం మెత్తగా గ్రైండింగ్ చేయాలని తర్వాత శనిగపప్పు, బెల్లం కలిపిన పూర్ణాన్ని ముద్దలుగా తీసుకుని మినపపిండిలో ముంచి కడాయిలో వేడి నూనెలో వేసి వేయించి నైవేద్యంగా పెట్టి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు.
నాలుగవ రోజు
నాలుగవరోజు బెల్లం,బియ్యం కలిపిన చలివిడిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ముందుగా పాలల్లో బియ్యం నానబెట్టాలి. తర్వాత నానిన బియ్యాన్ని పొడిచేసి దానికి బెల్లం ముక్కలు కలుపుపారు. బెల్లం బియ్యం ప్రసాదంగా పిలుస్తారు.
ఐదవ రోజు
ఐదవరోజు గౌరమ్మకు అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది తయారు చేసేముందు తొలుత బియ్యం పిండిలో తగినంత పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర కలిపి కాలుతున్న పెనంపై అట్లువేసి కాలుస్తారు. ఈ వంటకాన్ని అట్లుగా పిలుస్తారు
ఆరవ రోజు
చద్దుల బతుకమ్మలో ఆరవరోజు పండుగను అర్రెం అని పిలుస్తారు. ఆరోరోజు బతుకమ్మ అలిగిందని ఆరోజు మంచిది కాదని మహిళలు బతుకమ్మాట ఆడరు. ఆరోజు ఇంట్లో అరిసెలు చేసుకుంటారు. అరిసెలు చేసేందుకు ముందుగా బియ్యం నానబెట్టి రోటిలో పొడిగా చేసి ఆ పిండిని ఓ ప్రక్కన ఉంచాలి. తదుపరి బెల్లం తీసుకుని దాన్ని ముదురు పాకంగా చేసి వేడి పాకంలో ఆ బియ్యం పొడి వేసి కలపాలి. రుచికోసం అందులో తెల్ల నువ్వులు, కొచెం ఇలాచిపొడి కలపి తర్వాత ఒక్కక్క ముద్దను ఓ అరిటాకు, తామరాకులో, లేదా పీటపై ఉంచి గుండ్రంగా చేసి నూనెలో కాల్చాలి. వాటిని ఆరోరోజు స్వీకరిస్తారు.
ఏడవ రోజు
ఏడవరోజున శనగ, పెసర బజ్జీలను, పప్పు బెల్లం గౌరమ్మకు నైవేద్యంగా తయారు చేస్తారు. శనగపిండిలో తగినంత ఉప్పు, నీళ్ళుపోసి కలిపి ముద్దగా చేసి కమ్మగా ఉండేలా బజ్జీలను తయారు చేస్తారు. అలాగే దాంట్లో తగినంత బెల్లం వేసి తీపి బజ్జీలు కూడా వేసి నైవేద్యం పెడతారు
8వ రోజు
ఎనిమిదవరోజు బెల్లం, నువ్వులు కలిపిన చిమ్మిలిని తయారు చేస్తారు. ఇది తయారు చేయడానికి తెల్లని నువ్వులు తీసుకుని వాటిని రోటిలో దంచి పొడిగా చేయాలి. తర్వాత ఆపొడిని బెల్లం కలిపి మళ్ళీ మెత్తగా దంచి దాన్ని ఉండలుగా గానీ, పొడిపొడిగా గాని ఉంచి గౌరమ్మకు నైవేద్యంగా పెడుతూ ఉంటారు.
9వ రోజు
చివరిరోజైన తొమ్మిదవరోజున చద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆరోజు అందరూ పులిహోర సద్ది, చిత్రాన్నం సద్ది, పల్లీల పొడి సద్ది, నువ్వుల పొడి సద్ది, పెసర సద్ది, కొబ్బరికోరు సద్ది, పుట్నాల పొడుల సద్ది, తదితర వంటకాలను తయారు చేసుకుని గ్రామ ప్రాంతాల్లో ఉన్న చెరువుల దగ్గర కోలాహలంగా బతుకమ్మ ఆటలు ఆడి ముత్తయిదువలు పసుపు, కుంకుమ తీసుకుని, నిద్రపో గౌరమ్మ నిద్రపో పోవమ్మ నిద్రకు నూరేళ్ళు, నీకు వెయ్యేళ్ళు మళ్ళ ఎప్పుడొస్తావు గౌవర్మ మమ్ము చల్లంగ చూడమ్మ గౌరమ్మ అంటూ పాటలు పాడుతూ తయారు చేసిన ప్రసాదాల వితరణ చేస్తూ చద్దుల పండుగనాడు గౌరమ్మను నదులు, చెరువుల్లో వేసి సాగనంపుతారు.
బతుకమ్మకు ప్రత్యేక నైవేద్యం మలీద ముద్దలు…
మలీద ముద్దలు బతుకమ్మకు తప్పకుండా పెట్టే ప్రత్యేక నైవేద్యం. దీన్ని బియ్యం పిండి లేదా గోధుమ పిండి, బెల్లంతో తయారు చేస్తారు. దీనికోసం ముందుగా పిండిలో వేడినీళ్ళు కలిపి చిన్నచిన్న ముద్దలు చేస్తారు. తర్వాల మందంగా రొట్టెలు చేసి వాటిని పెనంపై కాల్చి దాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేయాలి అనంతరం వాటిని బెల్లం ముక్కలతో కలిపి రోటిలో దంచి తయారైన ముద్దను బతుకమ్మకు ప్రత్యేమైన నైవేద్యంగా తప్పకుండా పెడుతూ ఉంటారు.