Home తాజా వార్తలు ముంచుకొస్తున్న ‘చక్కెర’ ప్రమాదం

ముంచుకొస్తున్న ‘చక్కెర’ ప్రమాదం

diabetes25 ఏళ్లలో రెట్టింపు
చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: రాష్ట్రంలో డయాబెటిక్ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ప్రతీ పది మందిలో ఒకరికి షుగర్ వ్యాధి ఉన్నట్లు గత నెలలో ప్రపంచ డయాబెటిక్ దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వేలోఆసక్తికర విషయాలు వెళ్ళడయ్యాయి. 1990లో తెలంగాణ ప్రాంత జనాభాలో ఐదు శాతం మందికి డయాబెటిక్ ఉంటే, 2016 నాటికి ఏకంగా పది శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. 1990 నాటితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో షుగర్ వ్యాధిగ్రస్తులైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పాతిక సంవత్సరాల్లో రెట్టింపు స్థాయిలో డయాబెటిక్ రోగులు ఉండటంపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పరిమితికి మించి పెరిగిపోవడాన్నే మధుమేహంగా పేర్కొంటారు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడానికి కారణం క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే. రక్తంలో చక్కెర శాతాలను పరీక్షించడం ద్వారా ప్రాథమికంగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా అందులో 25 శాతానికిపైగా అంటే 4.5 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. దేశంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది. దేశంలో 1990లో 5.5 శాతం మందికి షుగర్ వ్యాధిగ్రస్తులుంటే, 2016 నాటికి 7.7 శాతానికి చేరుకుంది. మనదేశంలో విస్తరిస్తున్న దానికంటే వేగంగా రాష్ట్రంలో షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుంది.
స్థూలకాయుల్లో అధికం

మారుతున్న జీవన శైలి, కొవ్వు పదార్దాలు అధికంగా ఉన్న ఆహార పదార్దాలు తీసుకోవటం, పెద్దగా శ్రమించవలసిన అవసరం లేకుండా పోవడం.. భోజనం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లోపించడం వంటివాటితో స్తూలకాయం పెరిగి పోతోంది. ప్రపంచంలో ప్రతీ వంద మంది స్థూలకాయుల్లో 19 మంది డయాబెటిక్‌కు గురవుతుంటే, ఆ సంఖ్య మన దేశంలో వందకు 38 మంది ఉండటం గమనార్హం. ఎక్కువ మందిలో స్థూలకాయంతోనే షుగర్ వ్యాధి దరి చేరుతుంది. 1990లో దేశంలో 9 శాతం మంది స్థూలకాయులుంటే, 2016 నాటికి 20.4 శాతానికి చేరుకుంది. ఆ ప్రకారం 1990లో దేశంలో 2.60 లక్షల మంది డయాబెటిక్ రోగులుంటే, ఆ సంఖ్య 2016 నాటికి 7 కోట్లకు చేరుకుంది. అదే తెలంగాణలో 1990లో స్థూలకాయులు 15 శాతం ఉంటే, 25 ఏళ్లలో అంటే 2016 నాటికి 30 శాతానికి చేరుకోవడం గమనార్హం. రాష్ట్ర జనాభాలో ప్రతీ వంద మందిలో 30 మంది, ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయులున్నరమాట. 25 ఏళ్లలో స్థూలకాయులు రెట్టింపు కాగా, అదే స్థాయిలో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అధిక బరువు, స్థూలకాయమే షుగర్ ప్రధాన కారణంగా కేంద్రం ప్రకటించింది. దేశంలో 2040 నాటికి 12.3 కోట్ల మంది డయాబెటిక్ రోగులవుతారని వెల్లడించింది. దేశంలో డయాబెటిక్, గుండె, క్యాన్సర్ల తదితర వ్యాధుల కారణంగానే 50 శాతం వరకు మరణా లు సంభవిస్తున్నాయి. అది 2030 నాటికి 75 శాతానికి చేరుకునే ప్రమాదముందని కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

ముంచుకొస్తున్న ప్రమాదాన్నిపసికట్టిన తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు పూనుకొంది. గ్రామీణ ప్రాంతాల్లో షుగర్ వ్యాధిపై అవగాహన కల్పించటం, పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ ఆరోగ్య పథకం (ఎన్ హెచ్ ఎం) కింద సాదారణ షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తపరీక్ష, మూత్రపరీక్షల ద్వారా డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేసి, పరిస్థితిని బట్టి తగిన చికిత్స చేస్తున్నారు.

Telangana Government Action on Diabetes Prevention