Home తాజా వార్తలు అమోఘంగా ఆర్‌ఆర్‌ఆర్

అమోఘంగా ఆర్‌ఆర్‌ఆర్

Telangana government planning

 

125 గ్రామాలు, 12 పట్టణాలకు ప్రగతి

ఔటర్ రింగ్‌రోడ్డుకు దీటుగా ఆర్‌ఆర్‌ఆర్
కంది, షాద్‌నగర్‌లో నాలుగు వరసల రహదారి నిర్మాణం
రీజినల్ రింగ్‌రోడ్డుకు 70 కి.మీలు రాష్ట్ర ప్రభుత్వం.. 268కి.మీలు కేంద్ర ప్రభుత్వ నిధులు
అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: మహానగరాన్ని ఆనుకొని ఉన్న 12 పట్టణాలే లక్షంగా ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు, 338 కిలోమీటర్ల మేర ) రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ సహా సమీపంలో ఉన్న పట్టణాల అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ దూర పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధే లక్షంగా ఈ ప్రణాళిక రూపుదిద్దుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎన్నికల కారణంగా కొంతమేర నెమ్మదించినా ప్రస్తుతం భూ సేకరణతో మళ్లీ వేగం పుంజుకుంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పట్టణాలను కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్న ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారని, అందులో భాగంగానే ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీనివలన రియల్ జోరు పెరగడంతో పాటు స్థానికంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను అప్పట్లో ఓకే చెప్పినట్టు తెలిసింది. కెసిఆర్ సిఎం కాగానే రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆర్థిక వికేంద్రీకరణ జరగాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.

హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ రేడియేషన్ పరిధిలోని…
హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ వ్యాసం పరిధిలోని ద్వితీయ శ్రేణి పట్టణాలు, జాతీయ రహదారులను కలుపుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ రింగ్‌రోడ్డును తలదన్నేలా ఈ నిర్మాణం ఉండాలని, దీంతోపాటు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఆ దిశగానే ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది. మొత్తంగా మూడేళ్ల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలన్న లక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణానికి అంచనా వ్యయం కింద మొత్తం రూ.12 వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.

అందులో 70 కిలోమీటర్ల దూరానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్రం ప్రభుత్వం భరించనుండగా 268 కిలోమీటర్లకు అయ్యే వ్యయాన్ని కేంద్రం భరించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించడంతో వాహనదారుల నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్డును మాత్రం జాతీయ రహదారుల సంస్థ నిర్మించనుండడంతో వాహనదారులకు టోల్ ఫీజు భారం ఉండదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కంది, షాద్‌నగర్‌లో నాలుగు వరసల రహదారి నిర్మాణం జరుగుతుంది. ఈ పరిధి కూడా ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలోకి రానున్నట్టు అధికారులు తెలిపారు.

17 చోట్ల రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుతూ…
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి 11 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 17 చోట్ల రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్మాణం వలన 12 పట్టణాలు, 125కు పైగా గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. వరంగల్, ముంబై, విజయవాడ, నాగపూర్, బెంగళూరు హైవేలను కలుపుతూ ఈ నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివలన వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లకుండా తమ గమ్యస్థానాలకు వెళ్లేలా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రారంభం అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్లపై ప్రభావం పడనుంది. 12 ఏళ్ల నిర్మాణ అనంతరం 158. కి.మీల ఔటర్ రింగ్‌రోడ్డు పూర్తి స్థాయిలో ఐదు నెలల క్రితం అందుబాటులోకి వచ్చింది. రానున్న మూడేళ్లలో 338 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్‌రోడ్డు పూర్తి చేసి వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం అందించాలన్న ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Telangana government planning to develop townships

Telangana News