Home తాజా వార్తలు డిమాండ్ తో కల్తీ

డిమాండ్ తో కల్తీ

 

సేంద్రియ సాగు ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్
కల్తీ కూడా పెరిగే ప్రమాదముంది
సంబంధిత శాఖల ద్వారా ఆర్గానిక్ ఆహార సరకులను తనిఖీ చేయించి మార్కెట్‌లో ప్రవేశపెట్టాలి
ఆర్గానిక్ ఫెస్టివల్‌లో ఎంపి కవిత

మన తెలంగాణ/హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆర్గానికి ఫుడ్ ఉత్పత్తులను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించిన అనంతరమే మార్కెట్‌లోకి తీసుకురావాలని ఎంపి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సేంద్రీయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ మేరకు కల్తీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని తెలంగాణ ప్ర భుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. శిల్పరామంలోని సంప్రదాయ వేదికపై గత ఐదురోజులుగా జరుగుతున్న ‘ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ ముగింపు సమావేశంలో ఆదివారం సాయంత్రం ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్లో అనేక రకాల కల్తీ ప్రజల ఆరోగ్యానికి సవాలుగా మారిందని, చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోందన్నారు. కల్తీ వ్యాపారులను అణచివేయాలని పేర్కొన్న కవిత, తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా పి.డి. చట్టం కింద కేసులను కూడా నమోదు చే స్తోందని, ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోందన్నారు. పా లు, పచ్చడి, టీ పొడి, చక్కెర, బెల్లం ఇలా సమస్త నిత్యావసర వస్తువులు కల్తీకు గురవుతున్నాయని, ఏటేటా దేశవ్యాప్తంగా వేలాది కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. కల్తీని ప్రోత్సహించేవారిని, చేసేవారిని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తుందని స్పష్టం చేశారు.
సేంద్రియ పంటలతో ఆరోగ్యం
నాలుగైదు తరాల ముందు మన జీవన విధానంలో రసాయనిక ఎరువుల వినియోగం లేదని, పూర్తిగా సేంద్రియ విధానంలోనే పంటలు సాగయ్యేవ ని, మన ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉండేదని, కానీ ఇటీవలి కాలంలో కొత్తకొత్త వ్యాధులు వస్తున్నాయని, మారిన జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా ఒక కారణమని కవిత వ్యాఖ్యానించారు. అందువల్లనే మళ్ళీ సేంద్రియ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, సాగు విస్తీర్ణం కూడా మెరుగైందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం సేంద్రియ విధానంలో పండిస్తున్న పంటలకు ప్రపంచవ్యాప్తంగానే డిమాండ్ ఉందని, సర్టిఫికెట్ పొంది విక్రయిస్తే ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ మరింత పెరుగుతుందని సూచించారు. సేంద్రియ ఉత్పత్తులను తయారుచేస్తున్న, విక్రయిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను, పండిస్తున్న మహిళా రైతులను కవిత అభినందించారు. సేంద్రీయ వ్యవసాయం మార్గాన్ని ఎంచుకోవడా న్ని ప్రోత్సహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి స్టాళ్ళను ఏర్పాటు చేసిన మహిళలను ప్రశంసించడంతో పాటు ఆ ఉత్పత్తుల వివరాలను, మానవ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాన్ని, పోషక విలువల గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 150స్టాళ్ళలో ప్రదర్శించిన పలురకాల సంప్రదాయ ఆహార ఉత్పత్తులను ఆమె స్వయంగా పరిశీలించారు.
కడుపునిండా తినాలి… కష్టపడి పనిచేయాలి
ఆరోగ్య సూత్రం ప్రజల దగ్గరే ఉందని గుర్తుచేసిన కవిత కడుపునిండా తిని కష్టపడి పనిచేస్తే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందన్నారు. తాను ఇదే సూత్రం పాటిస్తానని, కష్టపడి పనిచేస్తానని చెప్పారు. అపోహలకంటే నిర్ధారణ ముఖ్యమని అన్నారు. తాత ముత్తాతలు ఏ గ్రీన్ టీ తాగి ఆరోగ్యంగా జీవించారని ఆమె ప్రశ్నించారు. ఆనాడు సేంద్రియ ఎరువులతో పండిన పంటలను కడుపు నిండా తిని కష్టపడి పనిచేయడంతోనే ఏ రోగమూ వారివైపుకు రాలేదన్నారు.

 

Telangana Govt encouraging Organic farming: kavitha