Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

క్రీడల్లో తెలంగాణ గురుకుల ఆణిముత్యాలు

Telangana Gurukula students in Sports

మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజికంగా, ఆర్థికంగా పేదవారు, అణగారినవారే అయినా చదువుతో పాటు క్రీడల్లో మాత్రం ఆణిముత్యాలు. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తరగతి గదుల్లో మాత్రమే కాక క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. మేము సైతం అంటూ అనేక దేశాలతో పోటీ పడి స్వర్ణ, రజత పతకాలను సాధించారు. రాష్ట్ర స్థాయిలో 578, జాతీయ స్థాయిలో 113 బంగారు పతకాలను సాధించగా అంతర్జాతీయ స్థాయిలో ఏడు బంగారు, ఆరు రజత, రెండు కాంస్య పతకాలను సాధించారు. మూడు స్థాయిల్లో పతకాలు సాధించినవారిలో బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు గురుకుల పాఠశాలలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా రంగంలోనూ శిక్షణ నిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 268 ఎస్‌సి గురుకులాల్లో లక్షా 28 వేల 328 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా 89 వేల 676 మంది అమ్మాయిలు కావడం గమనార్హం. కాగా గిరిజనులకు సంబంధించి రాష్ట్రంలో 169 గురుకుల విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. గురుకుల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే గాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడమే గాకుండా అనేక మెడల్స్ సాధించి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేశారు. పర్వతారోహణ, వివిధ రకాల క్రీడల్లో గురుకుల విద్యార్థులు అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటి చెప్పారు.

క్రీడా పతకాల్లోనూ మెరికలే..
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ క్రీడల్లో ఎస్‌సి, ఎస్‌టి గురుకుల విద్యార్థులు ఆకర్షణీయ స్థాయిలో మెడల్స్ సాధించారు. ఎస్‌సి గురుకుల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 578 బంగారు పతకాలు సాధించగా అందులో 332 పతకాలు బాలికలవే. 461 వెండి పతకాలు ( 276 బాలికలు), 294 కాంస్య (148 బాలికలు) పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో 113 బంగారు పతకాలు (81 బాలికలు), 128 వెండి (79 బాలికలు), 241 కాంస్య (160 బాలికలు) పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎస్‌సి గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణించారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో ముగ్గురు బాలికలు బంగారు పతకాలు సాధించగా సెయిలింగ్, యోగాలలో 5 వెండి పతకాలు సాధించారు.

కరాటే, యోగాలలో రెండు కాంస్య పతకాలు సాధించారు. 2018లో ఇటలీలో జరిగిన ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌షిప్‌లో లయ అనే గురుకుల విద్యార్థిని పాల్గొనగా ఫిలిప్పీన్స్‌లో జరిగిన సాఫ్ట్‌బాల్ కాంపిటీషన్‌లో అర్చన అనే అమ్మాయి పాల్గొంది. అండర్ 17 నేషనల్ క్రికెట్ టీమ్ 2016 కు జనగామ గురుకుల పాఠశాల విద్యార్థి బి పౌల్సన్ ఎంపికయ్యారు. 201718 మూడో వార్షిక స్పోర్ట్ మీట్‌లో 5 గురుకుల విద్యాసంస్థల సొసైటీలు పాల్గొనగా ఎస్‌టి గురుకుల సొసైటీ విద్యార్థుల టీమ్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. సింగపూర్‌లో 2017లో జరిగిన అంతర్జాతీయ ‘పెన్‌కాక్‌సిలట్’ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు, ఒక వెండి పతకం గిరిజన గురుకుల విద్యార్థులు సాధించారు.

పర్వతారోహణలో ..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి 2018 వరకు ఎస్‌సి, ఎస్‌టి గురుకుల విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటారు. ప్రపంచ దేశాల్లో పలు పర్వతాలను అధిరోహించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్ఠలను ఇనుమడింప చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు 2014లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. 2015లో 47 మంది విద్యార్థులు రినాక్ పర్వతారోహణ చేశారు.

2016లో మలావత్ పూర్ణ నేత్వత్వంలో ఐదుగురు విద్యార్థులు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. 2017లో పూర్ణ, శ్రీ విద్య అనే ఇద్దరు విద్యార్థినులు యూరోప్‌లోని ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. 2017లో గిరిజన గురుకులాలకు చెందిన 22 మంది విద్యార్థులు, ఇద్దరు డైరెక్టర్లు కులుమనాలి లో పర్వతారోహణ చేశారు. అదే సంవత్సరం ఇద్దరు విద్యార్థులు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. 16 మంది గిరిజన గురుకుల విద్యార్థులకు హెచ్‌ఎంఐ, డార్జిలింగ్‌లలో 201516 సంవత్సరంలో పర్వతారోహణలో శిక్షణ నిచ్చారు.

Comments

comments