Home తాజా వార్తలు మరణాలపై ఆరా

మరణాలపై ఆరా

నమోదుతో పాటు కారణాలపైనా అధ్యయనం
అకాల మరణానికి దారితీస్తున్న
వ్యాధుల నివారణకు చర్యలు
ఆయుష్షు పెంచడం ద్వారా సంపద సృష్టిలో భాగస్వాములను చేసే వ్యూహం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వినూత్న కార్యక్రమం
మన తెలంగాణ/ హైదరాబాద్‌ః తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ త్వరలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో ప్రతీరోజు జరుగుతున్న మరణాలను కేవలం నమోదు చేయడంతో సరిపెట్టకుండా ఎందుకు చనిపోతున్నారో లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా వారి వివరాలను, మరణానికి గల కారణాలను కూడా నమోదు చేయాలన్నది ఈ వినూత్న కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మృతికి దారితీసిన కారణాలను విశ్లేషించడం ద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో ఆ వ్యాధులను నివారించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఏ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి, ఏ వయస్సులో మృతి చెందుతున్నారు, అనే అంశాలపై స్పష్టత వస్తే దానికనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని అటువంటి మరణాలను నివారించవచ్చని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. దీనివల్ల ప్రజలకే కాక ప్రభుత్వానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడానికి ముందు ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో సమాచారాన్ని సేకరించటంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమానికి పేరు పెట్టలేదని, ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే దేశ వ్యాప్తంగా మన రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
నివారణకు వీలు కలుగుతుంది :
వృద్ధాప్యానికి కూడా చేరుకోకుండా చాలా మంది మధ్యలోనే తనువు చాలిస్తున్నారని, ఈ వివరాలు లభ్యమైతే వాటి నివారణకు చర్యలు, అవసరమైన నిధుల మంజూరుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు జనన మరణ లెక్కలను సేకరించేవారని, ఎంతమంది పుట్టారు, ఎంత మంది చనిపోయారు వంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకునేవారని, మరణానికి దారితీసిన కారణాలను మాత్రం పట్టించుకొనేవారు కాదని పేర్కొన్నారు. అయితే త్వరలో కారణాలను విశ్లేషించేందుకు అధ్యయనం చేయడం ద్వారా అనేక అంశాలు తెలుస్తాయని, ఫలితంగా ఆ మరణాలను నివారించడం మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడానికి వీలు కలుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా ఈ రకమైన గణన జరగటంలేదని, మొదటిసారి తెలంగాణలోనే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తెలిపారు. వైద్యారోగ్య సిబ్బంది ప్రస్తుతం 500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
కారణాలు ఏంటి?
తెలంగాణను గుండె జబ్బులు పట్టి పీడిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ గత నెల కొన్నిచోట్ల చేపట్టిన ప్రత్యేక సర్వే ప్రకారం మరణించిన వారిలో అత్యధికులు గుండె జబ్బు బాధితులేనని ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్న చికిత్సల్లోనూ గుండె సంబంధిత వ్యాధులకే అత్యధికంగా ఖర్చు చేస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు చేసిన చికిత్సల ఖర్చు రూ. 748 కోట్లు కాగా, అందులో అత్యధికంగా రూ. 182 కోట్లు గుండె సంబంధిత ఆపరేషన్లు, చికిత్సలకే ఖర్చయింది. అయితే గుండె చికిత్సలు విజయవంతంగా జరుగుతుండటంతో దాని ద్వారా మరణాలు అంత స్థాయిలో ఉండవన్న భావన వైద్యాధికారుల్లో ఉంది. కానీ గుండె జబ్బులకు చికిత్సతోపాటు మరణాలు కూడా అదే స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన కొత్త కార్యక్రమం కోసం చేసిన సర్వేలో ఈ చేదు నిజాలు బయట పడ్డాయి. మరణాల సంఖ్యతోపాటు ఏ జబ్బుల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్న లెక్కలు తీయాలని అధికారులు ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఏఎన్‌ఎంల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం 500 గ్రామాల్లో జరిగిన మరణాలపై అధ్యయనం చేశారు. ఆయా గ్రామాల్లో ఈ కాలంలో చనిపోయిన వారిలో అత్యధికులు గుండె జబ్బులతోనేనని తేలినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ :
మరణ గణన కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. గ్రామాల్లో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయటానికి దీనిని ఉపయోగిచనున్నారు. మరణాలకు కారణమైన జబ్బులను గుర్తించడం కోసం ఏఎన్‌ఎంలను ఉపయోగించుకుంటున్నారు. వారికి శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమానికి సిద్ధం చేశారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ మరణాల వెనుక కారణాలపై సర్వే కార్యక్రమం చేపటడతారు. ఏఎన్‌ఎంలు అన్నిగ్రామాల్లో ఉంటారు కాబట్టి ఇది నిత్యం జరిగే కార్యక్రమమని అధికారులు తెలిపారు. ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే అతనింటికి వెళ్లి వయస్సు, ఆర్థిక, సామాజిక స్థాయి, వృత్తి, ఏ జబ్బుతో చనిపోయారు, ఆ జబ్బుతో ఎన్నాళ్లు బాధపడ్డారు, అందుకు చేసిన ఖర్చు వంటి వివరాలను సేకరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఏ జబ్బులతో అత్యధికంగా చనిపోతున్నారో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. సేకరించిన వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో ఈ కార్యక్రమానికి ఒక పేరు పెట్టి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆ అధికారి తెలిపారు. ఈ రికార్డు ఆధారంగా వైద్య ఆరోగ్యశాఖ ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్న దానిపై నిర్దారణకు రావచ్చు. పైగా ప్రజలను ఆయా రోగాలపట్ల అప్రమత్తం చేసే అవకాశముందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

Telangana Health Department Inquire on deaths