Home తాజా వార్తలు యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం: కెసిఆర్

యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం: కెసిఆర్

KCR

హైదరాబాద్: తెలంగాణ సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్‌పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు కెసిఆర్ నివాళులర్పించారు. సిఎం కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అవతరించి  నాలుగు సంవత్సరాలైన సందర్భంగా మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా అడుగులు వేయగలిగామని వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని,  దేశంలో ఏ రాష్ట్రాలు అమలుచేయని కార్యక్రమాలు చేస్తున్నామని ప్రశంసించారు.

తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సకలజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవం గ్రహించామని, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లు, వాటి కారణాలు పరిష్కారాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగామన్నారు. ఆ ఆలోచన పునాదుల మీదనే మేనిఫెస్టోను రూపొందించామని, ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోలోని అంశాలను వెంటవెంటనే అమలు చేస్తున్నామని, విస్తృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలు ఎన్నింటినో ప్రవేశపెట్టామని, ఒకవైపు ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ మందుకెళ్తున్నామని చెప్పారు.