Home తాజా వార్తలు సౌర తెలంగాణ

సౌర తెలంగాణ

Telangana in solar power field

సౌర విద్యుత్ రంగంలో తెలంగాణ
లీడర్, విధానాలు భేష్
సిఐఐ ఇండియా – 75 విద్యుత్
సదస్సులో నిపుణుల ప్రశంసలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ లు సకాలంలో తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించదని భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) దక్షిణ భారత దేశ సదస్సులో పలువురు అభిప్రాయపడ్డారు. నగరం లో ‘ఇండియా75’ పేరుతో శుక్రవారం జరిగిన విద్యుత్ సదస్సులో సాంప్రదాయేతర ఇంధన రం గంలో గడిచిన 75 సంవత్సరాలలో సాధించిన అభివృద్ధిపై సమీక్ష జరిగింది. సదస్సులో సిఐఐ దక్షిణ భారత విద్యుత్, సాంప్రదాయ విద్యుత్, మౌలిక వసతుల కల్పన సబ్ కమిటీ చైర్మన్ రమేష్ కైమల్ తన స్వాగతోపన్యాసంలో, సాంప్రదాయేతర ఇంధనరంగంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఔత్సాహికులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు బాగున్నాయని అభినందించారు.

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ‘నాయకుడి’ పాత్ర పోషిస్తోందని, దేశంలోనే అత్యధికంగా సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా గు ర్తింపు పొందిందన్నారు. విద్యుత్ కొనుగోలు చెల్లింపుల్లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇతర రాష్ట్రాల కంటె చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. సౌరవిద్యుత్ పార్కులకు ట్రాన్సిమిషన్ ఏర్పాటు వ్యవస్థ కూడా బాగుందన్నారు. భారత్ విద్యుత్  అవసరాలకు, ప్రస్తుత ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ గణంకాలలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రత్యేకించి సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ రంగాలకు విస్తృతావకాశాలు ఉన్నా వివిధ కారణాల చేత ఇంకా బారారిష్టాలు ఎదుర్కుంటున్నామని అన్నారు.

సౌర విద్యుత్ పార్కులకు భూసేకరణ సమస్య, బ్యాంకు రుణాలు, గ్రిడ్ అనుసంధానికి కనెక్టివిటీ తదితర అంశాలు అత్యంత కీలకమన్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పటికీ వాటి నుంచి పూర్తిగా ఈ రంగం కోలుకోలేదని గుర్తుచేశారు. వైస్ ఛైర్మన్ ఎస్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ వాతావరణ మార్పిడి, కాలుష్య కారక కర్బన ఉద్గారాల తగ్గింపుకు తన వంతు బాధ్యతగా భారత్ వంటి దేశాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తగ్గించి సౌరవిద్యుత్, పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సి అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరా చేయడం డిమాండ్ మేరకు సరఫరా చేయడం వేర్వేరు అంశాలని, దీని మూలాలను విశ్లేషించకుండా అందరికీ విద్యుత్ ఇస్తున్నామని అనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వాలు బయటికి చెప్పే గణంకాలకు,వాస్తవ సంఖ్యలకు పొంతన ఉండదన్నారు.దేశీయ బిడ్లలో పాల్గొని కొనుగోలు చేసే విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేసి నష్టాలను మూటగట్టుకోవాలని ఎవరు కోరుకోరని అన్నారు.

సిఐఐ తెలంగాణ చాప్టర్ చైర్మెన్ సంజయ్‌ఘోష్ మాట్లాడుతు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో చిన్న యూనిట్లకు అవకాశాలు ఇంకా పెరగాల్సి ఉందన్నారు. భవిష్యత్ విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితే దానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కోరారు.రాష్ట్ర విభజన సమయంలో అత్యంత ఎక్కువగా నలిగిపోయిన రంగం ఏదైనా ఉందంటే అది పవన విద్యుత్తేనని అన్నారు. ఏపిలో ఉత్పిత్తి చేసి యుపిలో అమ్ముకుంటున్నట్లు తెలిపారు. ‘గ్రీన్ కో’ సంస్థ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో అద్భుతాలు చేసి చూపించిందని అన్నారు. లోటు విద్యుత్ నుంచి మిగులు వరకు సాగిన విద్యుత్ సంస్థల ప్రస్థానం, 3,500 మెగావాట్ల   ఉత్పత్తి సాధించి అన్ని రాష్ట్రాలనూ వెనక్కి నెట్టిందన్నారు.  అయితే విద్యుత్ కొనుగోలులో స్థిర ఛార్జీల భారం, రద్దీ సమయంలో ధరల స్థిరీకరణ, కనిష్ట ధరల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలైతే బాగుంటుందన్నారు.

సీజన్లవారీగా, పీక్ టైం, దీర్ఘకాలిక విద్యుత్ విధానాలపై బహుముఖంగా చర్చలు జరగాల్సి ఉందన్నారు. తెలంగాణ నూతన పునరుద్ధరణీయ ఇంధన సంస్థ జిఎం ప్రసాద్ మాట్లాడుతు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని తెలిపారు.2015లో ప్రకటించిన సౌరవిద్యుత్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుందన్నారు. సౌరవిద్యుత్ ఉత్పత్తికి ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు,అనుమతులలో జాప్యం,తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సౌరవిద్యుత్‌లో 3400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించిందని త్వరంలో మరో 400 మెగావాట్లు అదనంగా తోడవుతుందన్నారు.

రూఫ్‌టాప్ విధానంలో కేంద్రం 40 మెగావాట్ల ఉత్పత్తికి అనుమతించిందని తెలిపారు. ఇంధన రంగ నిపుణుడు, సలహాదారు విజయ్ జైస్వాల్ మాట్లాడుతు భారత్ వంటి వృద్ది చెందుతున్న దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు భవిష్యత్ ఉంటుందన్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాలు వెదజల్లే కాలుష్యం నుంచి విముక్తి కలగడమే కాకుండా పర్యావరణ హితంగా ఈ వాహనాలు ఉంటాయన్నారు.  ఐదు విడతలుగా జరిగిన సదస్సులో సౌర, పవన విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎదుర్కుంటున్న సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మెన్ ఇస్మాయల్ అలీఖాన్ ప్రాంతీయ విద్యుత్ సరఫరా, ధరల నిర్ణయంపై అవలంభించే విధానాలపై మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు.