Home రాష్ట్ర వార్తలు ఫార్మాలో మనమే ఫస్ట్

ఫార్మాలో మనమే ఫస్ట్

ktr

కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఔషధ ఉత్పత్తిలో తెలంగాణదే అగ్రస్థానం : మంత్రి కెటిఆర్
ఔషధ తయారీ రంగంలో భారత్ త్వరలోనే ప్రపంచంలో నెంబర్‌వన్ అవుతుంది: కేంద్రమంత్రి సురేష్ ప్రభు

మన తెలంగాణ/ హైదరాబాద్ : కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఔషధ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కెటి. రామారావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషి యా సదస్సు ముగింపు రోజున కేంద్రమంత్రి సురేష్ ప్రభుతో కలిసి మంత్రి కెటిఆర్ ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఇప్పటికే బల్క్ డ్రగ్ హబ్ గా ప్రసిద్ధి గాంచిందని, వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఫార్మా రంగంతో పాటు సౌందర్య ఉత్పత్తులకు కూడా భారీ డిమాండ్ ఉంటోందన్నారు. పెరుగుతున్న అవసరాలకనుగుణంగా కాస్మో ప్రొడక్ట్‌కు కూడా మంచి మార్కెట్ ఉంటోందన్నారు. ప్రజల అవసరాలను తీరుస్తున్న ఫార్మా రంగాన్ని కేంద్ర, రాష్ట్రాలు తప్పని సరిగా ఆదుకోవాలని చెప్పారు. పేదలకు మందులు అందుబాటు ధరల్లో లభించే విధంగా మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నా రీసెర్చ్ డెవలప్‌మెంట్ కోసం ఈ రంగానికి కేంద్రం ఇవ్వాల్సిన బడ్జెట్‌ను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. అనేక ఫార్మా విభాగాల్లో పెట్టుబడుల కోసం కేంద్రం ఎందుకు చొరవ చూపకూడదని వ్యాఖ్యానించారు. ఇతర విభాగాల నుండి పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి సూచించారు. ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి , ఎక్స్‌పోర్ట్‌కు కేంద్రం సహకారం అందించాలని కోరారు. స్టార్టప్‌లకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్థానిక ఫార్మా తయారీదారులపై అధిక భారం వేస్తున్నారని, దీనిపై కేంద్రానికి తెలంగాణ ఒక రిపోర్టును కూడా అందజేయాలని అనుకుంటోందని తెలిపారు. ఆర్ అండ్ డి కేంద్రాలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని సురేష్ ప్రభు బదులిచ్చారు. కొంత ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని, ఫార్మా ఇండస్ట్రి కోసం కాక పోయినా ప్రజల కోసం చేస్తామన్నారు.
మనమే నెంబర్ వన్ : కేంద్ర మంత్రి సురేష్ ప్రభు
ఫార్మా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో సమీప భవిష్యత్తులో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలతో కలిసి ఫార్మా రంగం అభివృద్ది కోసం కేంద్రం తగిన చేయూతనిస్తోందన్నారు. ఈ రంగంలో మందుల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగితే కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరిగి ధరలు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందని, ఇప్పటికే కంపెనీల మధ్య పోటీ కారణంగా పలు మందుల ధరలు తగ్గాయని మంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం మనం తయారు చేసిన మెడిసిన్లను పెద్ద ఎత్తున వినియోగించడం నిజంగా గర్వకారణమని వ్యాఖ్యానించారు. గత ఇరవై ఏళ్లలో భారతదేశంలో పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఫార్మా పరిశ్రమలు, రాష్ట్రంలోని ఫార్మా రంగ పరిశ్రమలు మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో వ్యాధులు అదే స్థాయిలో చుట్టుముడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటున్నారని, జీవించినంత కాలం కూడా సంతోషంగా ఆనందగానే ఉండాలని భావిస్తున్నారన్నారు. వయస్సు మీదపడుతున్నా ఇంకా యువకులుగానే కనిపించాలని కోరుకునేవారు కూడా ఉన్నారన్నారు. ఆహార ధాన్యాల సాగులో ఇటివలి కాలంలో రసాయన మందుల వినియోగం పెరుగుతుండడంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వృద్ధాప్య దశలో వైద్యుల అవసరాలు, ఔషధాల వాడకం కూడా పెరుగుతోందన్నారు. ఫార్మా రంగంలో బల్క్ డ్రగ్ మేనిఫ్యాక్టరింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోందన్నారు. వైద్యరంగంతో పాటు మౌళిక సదుపాయాల కల్పనలోనూ కేంద్ర ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తోందన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం ఫార్మారంగంలో అభివృద్ధి చెందుతుండడంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం మనం తయారు చేసిన మెడిసిన్, టాబ్లెట్లు, ఇతర ఔషధాలను వినియోగించేందుకు ఆసక్తిని చూపుతున్నాయన్నారు. తెలంగాణలోనూ పెరుగాంచిన కంపెనీలు ఔషధ రంగంలో ఉన్నాయని, చిన్నచిన్న ఔషధ కంపెనీలు సైతం టీకాలు, పోలియో చుక్కల మందులను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నాయని గుర్తుచేశారు. అమెరికా లాంటి దేశాలు సైతం ఫార్మా ఇండస్ట్రీపై దృష్టిని పెడుతున్నాయన్నారు.