Home రాష్ట్ర వార్తలు ఆదర్శ రాష్ట్రం

ఆదర్శ రాష్ట్రం

gvrrnr

మూడున్నర ఏళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వివిధ రంగాల్లో ఘనమైన ప్రగతి సాధించాం
కొత్త రాష్ట్రమే అయినా మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచింది
క్లిష్టతరమైన లోటును పూడ్చుకొని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం
కాళేశ్వరం సహా భారీ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి : బడ్జెట్ సభ సంయుక్త సమావేశంలో గవర్నర్

మన తెలంగాణ / హైదరాబాద్: మూడున్నరేళ్లలో ప్రభు త్వం అనేక సవాళ్లను అధిగమిస్తూ వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కొత్త రాష్ట్రమే అయినా యావత్తు దేశానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యాఖ్యానించారు.రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభ య సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ,దశాబ్ధాలుగా క్లిష్టతరమైన ఆర్థిక లోటును పూడ్చడమే కాకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోందని చెప్పారు. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామని, రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రగతి వైపు ప్రయాణిస్తోందని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలు, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మీ, రైతులకు రుణమాఫీ తదితర పథకాలను విజయవంతంగా అమలుచేస్తోందని గవర్నర్ వివరించారు.ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేడంలో గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు పొందాయయని గవర్నర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తున్నామని, ప్రతి ఏడాది ఆర్ధికాభివృద్ధిరేటు పెరుగుతూనే ఉన్నదని, గడిచిన మూడేళ్లలో సరాసరి వార్షిక వృద్ధి రేటు (జిఎస్‌డిపిలో) 8.6% నమోదైందని, జాతీయ సరాసరి సగటు 7.5%తో పోల్చుకుంటే ఇది 1.1% అధికమని పేర్కొన్నారు. 2016-17లో జాతీ య తలసరి ఆదాయం రూ.1.03 లక్షల కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.54 లక్షలుగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సాగునీరు అందించేందుకు అనేక భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ కృష్ణా, గోదావరి జలాలను పొలాలకు మళ్లిస్తోందని వివరించారు. మొత్తం 23భారీ,13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టామని, కాళేశ్వరంప్రాజెక్టుకు ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు 16.64 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి సదుపాయాన్ని కల్పించగా, 8.97 లక్షల ఎకరాల ఆయుకట్టును స్థిరీకరించినట్లు వివరించారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల సంక్షేమానికి చేపట్టిన చర్యల్లో భాగంగా 35.3 లక్షల మంది రైతులకు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేశామన్నారు. మరోవైపు నాయణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు సరఫరా చేస్తూ సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ గ్రీన్ హౌస్, పాలీహౌస్‌ల దిశగా రైతులను మళ్ళి స్తూ వారి ఆదాయాన్ని పెంచడంతో పాటు గత ఏడాది ఆహార ఉత్పత్తిని 101.29 లక్షల టన్నులకు పెంచామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి గోడౌన్ల సామర్థం కేవలం 4.17 లక్షల టన్నులు మాత్రమేనని, ఇప్పుడు 356 శాస్త్రీయ గోడౌన్లను నిర్మించి 18.30 లక్షల టన్నులకు పెంచామని తెలిపారు.

kcr
అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, ప్రభు త్వం రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే 10,823 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేశామని, త్వరలోనే రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పధకం ప్రగతిదాయకంగా ఉందని, గొల్ల కురుమలకు 75 శాతం సబ్సీడీతో ఇప్పటికే 50.10 లక్షల గొర్రెలను అందించామన్నారు.మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదుగుతోందన్నారు. వంద సంచార పశు వైద్యశాలల ద్వారా సుమారు1.62 లక్షల పశువులకు వైద్యం అందించినట్లు తెలిపారు.మిషన్ భగీరథ పనులు 95% పూర్తి అయ్యాయని,5,500 గ్రామీణ ప్రాంతాలకు, 13 పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాను అందజేయగా రెండున్నర వేల గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, పలు రాష్ట్రాల అధికారులు వచ్చి అధ్యయనం చేశారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించామని, పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలిడేను ఎత్తివేసి నిరంతరం విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ ఉత్పత్తి 7,778 మెగావాట్లు ఉంటే ఇప్పుడుఅది 15,344 మెగావాట్లకు పెరిగిందని, మరో 12,931 మెగావాట్లను జోడించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని, కొన్ని విద్యుత్ ఉత్పత్తిప్లాంట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా 3,283 మెగావాట్లతో దేశంలోనే ముందున్నామన్నారు. పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 517 ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని వివరించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కెసిఆర్ కిట్’కు మంచి స్పందన లభిస్తోందని, దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం రవాణా రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గతేడాది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమైందని, పిపిపి పద్ధతిలో చేపట్టిన అతిపెద్దదైన ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగం లో 30 కిలో మీటర్ల మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. జాతీయ రహదారులను జిల్లా, మండల రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు. నేతన్నకు ‘చేయూత’ పథకం ద్వారా చేనేతలకు ఆసరాగా నిలుస్తోందన్నారు. వరంగల్‌లో ఏర్పాటు కానున్న మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం 23 సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గవర్నర్ వెల్లడించారు. శాసనసభ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని, సభలో చర్చలు ప్రజాస్వామ్య వ్యవస్థ ప ట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆశిస్తున్నాన్నారు. తొలుత తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన గవర్న ర్ చివరలో ప్రపంచ తెలుగు మహసభలపై తెలుగులోనే మాట్లాడి ప్రసంగాన్ని ముగించారు.

ఐటికి హైదరాబాద్ కేంద్రం

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా, ఐటి పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. త్వరలోనే టిహబ్–2ను ప్రారంభించనున్నామని, బుద్వేల్‌లో ఐటి క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ‘టిఎస్ ఐపాస్’ పాలసీని రూపొందించామని, దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల వ్యవధిలోనే అనుమతులను మంజూరు చేస్తున్నామని, 6,206 పారిశ్రామిక యూనిట్లు ఏర్పడ్డాయని,ఇందులో 3,703 యూనిట్లు కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించాయని, సుమారు 4.47 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు నెలకొన్నాయని, ఇప్పటివరకుమొత్తం రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సమకూరాయని తెలిపారు.హైదరాబాద్ నగరం 1500 ఐటి పరిశ్రమలకు కేంద్రంగా మారిందని, సుమారు 4.30 లక్షల మంది పనిచేస్తున్నారని,గత ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 85,470 కోట్లకు చేరుకుందని గవర్నర్ పేర్కొన్నారు. ఐటి రంగంలో ‘స్టార్టప్’లను ఆకర్షించేందుకు ‘టిహబ్’ను ప్రారంభించామని, బుద్వే ల్ కేంద్రంగా మరో ఐటి కారిడార్‌ను నిర్మించే లక్షంతో పనిచేస్తున్నామని తెలిపారు. ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం,నిజామాబాద్‌లకు కూడా ఐటి రంగాన్ని విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు.