Home తాజా వార్తలు కాంగ్రెస్ ద్రోహ చరిత్ర

కాంగ్రెస్ ద్రోహ చరిత్ర

Telangana is the first villain Congress

ఆది నుంచీ తెలంగాణకు ద్రోహమే చేసింది
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు, తెచ్చుకున్నాం
పలువురు టిఆర్‌ఎస్ నేతల మనోగతం

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘తెలంగాణ ఇచ్చిందీ మేమే. తెచ్చిందీ మేమే’ అంటూ కాంగ్రెస్ నాయకులు పదేపదే గొప్ప లు చెప్పుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో 1956లో తెలంగాణ విలీనమైంది మొదలు ఇప్పటి వరకూ ఆ పార్టీ చరిత్రంతా తెలంగాణకు ద్రోహం చేయడమేనని టిఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగానే ‘తెలంగాణకు మొదటి శత్రువు (విలన్) కాంగ్రెస్సే’ అని వ్యాఖ్యానించారని, ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నారని టిఆర్‌ఎస్ నాయకులు సోదాహరణంగా వివరించా రు. కెసిఆర్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా 2001 మొదలు ఇప్పటిదాకా అదే మాటకు కట్టుబడి ఉన్నార ని, అయితే 2004లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని గుర్తుచేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను విలీనం చేయడం మొదలు తాజాగా పార్లమెంటులో మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానంపై చర్చ వరకూ తెలంగాణకు అడు గడుగునా ద్రోహం చేయడమే ఆ పార్టీ చరిత్ర అని టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్‌లు వ్యాఖ్యానించారు.

రాజకీయ స్వార్థం కోసమే తెలంగాణపై నిర్ణయం: వి. ప్రకాశ్
“తెలంగాణకు కాంగ్రెస్ మొదటి విలన్ అని సిఎం కెసిఆర్ 2001లోనే చెప్పారు. టిడిపికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించే సందర్భంలోనే ఏప్రిల్ 27న జలదృశ్యంలో ‘తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్సే’ అని వ్యాఖ్యానించారు. చివరి వరకూ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక ఎత్తుగడగానే 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఆ పార్టీ నుంచే తెలంగాణను సాధించాలనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆ పార్టీతో ఎన్నికల సందర్భంగా పొత్తుకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్‌ను విలన్‌గానే చూశారు.

కాంగ్రెస్‌ను ఒత్తిడికి గురిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పని పరిస్థితిని సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అంతే తప్ప రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సే అని భావించలేం. ఇది ఇవ్వడం కాదు, తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నది. తెలంగాణ ఇవ్వకపోతే రాజకీయంగా పుట్టగతులు ఉండవని కాంగ్రెస్ భావించి రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ఇస్తే అన్ని సీట్లనూ గెలిపించుకుంటామని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారు. మామా అల్లుళ్ళు మాత్రమే టిఆర్‌ఎస్‌లో మిగులుతారని, అంతకు మించి ఆ పార్టీ ఉనికిలోనే ఉండదని, ఇక అంతా ‘మనదే’ అంటూ కాంగ్రెస్ ఎంపిగా ఉన్న వి.హనుమంతరావు కూడా వ్యాఖ్యానించారు. పార్టీని బతికించుకోడానికి, ఉనికిలో ఉండడానికి మాత్రమే తెలంగాణను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది.

పార్టీ కోణం నుంచి మాత్రమే నిర్ణయం తీసుకుంది తప్ప ప్రజల కోణం నుంచి కాదు. నిజానికి తెలంగాణ పట్ల నిజాయితీ ఉన్నట్లయితే యాదిరెడ్డి ఆత్మహత్య రోజే ఆ నిర్ణయం ప్రకటించి ఉండేది. వాయిదా వేసేది కాదు. కానీ నిర్ణయానికి ముందే శ్రీకాంతాచారి, కిష్టయ్య లాంటి వందలాది మంది తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1956లో తెలంగాణ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా అప్పటి కాంగ్రెస్ నాయకుల మెడలు వంచి తెలంగాణను ఆంధ్రలో కలిపింది. బూర్గుల రామకృష్ణారావు లాంటివారిని మనోవేదనకు గురిచేసి విలీనం కోసం ఒప్పించారు. అంతే తప్ప ఆయన ఐచ్ఛికంగా ఒప్పుకున్నది కాదు. కెవి రంగారెడ్డి, చెన్నారెడ్డిలను సైతం ఆ పార్టీ పెద్దలు చాలా వత్తిడికి గురిచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విలీనం నిర్ణయం తీసుకునే సమయానికి ఇందిరాగాంధీ కూడా రాజకీయంగా ఒక మేరకు యాక్టివ్‌గానే ఉన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది వీధుల్లో కాల్చినా తెలంగాణను ఇవ్వాలనే నిర్ణయం తీసుకోలేదు. కనీసం పోలీసు కాల్పులపైనా న్యాయ విచారణ జరిపించలేదు. పెద్ద మనుషుల (జెంటిల్‌మెన్ ఒప్పందం) ఒప్పందాన్ని ఉల్లంఘించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. కెసిఆర్ రాజకీయ ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది తప్ప తనంతట తానుగా నిజాయితీగా తీసుకున్న నిర్ణయం కాదు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కాంగ్రెస్సే తెలంగాణకు మొదటి విలన్‌” అని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ వ్యాఖ్యానించారు.

‘ప్రత్యేక హోదా’ తో మరోసారి మోసం : ఎంపి వినోద్ కుమార్
“ఇప్పటికే తెలంగాణలో ఒక తరాన్ని కాంగ్రెస్ మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తు తరాలకు నష్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడమేకాక కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్‌గాంధీ స్వయంగా ప్రకటించారు. ఈ తీర్మానం చర్చ సందర్భంగా నేను రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు అన్ని రకాల అనుమతులనూ మంజూరు చేసేలా, పూర్తిస్థాయి ఖర్చులు ఇచ్చేలా ఆ రాష్ట్రానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సాగునీటి వనరులు లేని, ప్రాజెక్టులు లేని తెలంగాణకు మాత్రం జాతీయ ప్రాజెక్టు గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు.

ఫలితంగా తెలంగాణ రాష్ట్రం తన స్వంత ఆర్థిక వనరులతోనే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సి వస్తోంది. తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న అంశాన్ని కాంగ్రెస్ విస్మరించింది. ఆ రకంగా తెలంగాణకు అన్యాయం చేసింది. ఇటీవల కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇకపైన ‘జాతీయ ప్రాజెక్టు’ అనే విధాన నిర్ణయాలే ఉండవని ప్రకటించారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల ఖర్చును తెలంగాణ ప్రజలే భరించాల్సి వస్తోంది. ఇక రెండవ విషయం… ‘ప్రత్యేక హోదా’. ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించాల్సి వస్తుంది. దీన్ని ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వివిధ రకాల పన్ను రాయితీలు లభిస్తాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. విభజన చట్టంలో ‘ప్రత్యేక హోదా’ అంశం లేనప్పటికీ ఆ రాష్ట్రం నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 2014లోనే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వ్యతిరేకించాయి.

ఈ నిర్ణయం ఫలితంగా ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఆంధ్రకు వెళ్ళిపోతాయనేదే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆందోళన. సహజంగా ఇదే ఆందోళన తెలంగాణకూ ఉంది. తాజాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నొక్కిచెప్పింది. దీంతో తెలంగాణకు చాలా ఇబ్బందులు, నష్టం తప్పదు. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చినా అభ్యంతరంలేదుగానీ పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడంవల్ల తెలంగాణకు పారిశ్రామికంగా చాలా నష్టం జరుగుతుంది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం ద్వారా తెలంగాణకు మళ్ళీ నష్టం చేయనుంది. ఇప్పటికే ఒక తరాన్ని మోసం చేసిన కాంగ్రెస్ తాజా నిర్ణయంతో తెలంగాణలోని భవిష్యత్తు తరాలకు మళ్ళీ నష్టం చేయబోతోంది. ఇదే విషయాన్ని లోక్‌సభలోనే నేను రాహుల్‌గాంధీని ప్రశ్నించాను. సాగునీటి రంగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరిగినా పట్టించుకోని కాంగ్రెస్ జాతీయ ప్రాజెక్టు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి తెలంగాణను విస్మరించింది. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో మరోసారి అన్యాయానికి గురిచేయనుంది” అని కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు.