Home కరీంనగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

 

kmnr

సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్

మనతెలంగాణ/జగిత్యాల : సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని, సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలోని పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, పార్టీ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోద్‌కుమార్, చొప్పదండి ఎంఎల్‌ఏ బొడిగె శోభతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచాయన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు – నిధుల కోసమేనని తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. 40 ఏళ్లు కాంగ్రెస్‌పార్టీ, 17 ఏళ్ల టిడిపి పాలనలో తెలంగాణ ప్రాంతం ఏ మాత్రం అభివృద్దికి నోచుకోలేదన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శించే ముందు ఎందుకు అప్పులు చేస్తున్నామో ఆలోచించాలన్నారు.

          సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ది కోసం అప్పులు చేయడం ప్రతిపక్షాలకు గిట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, రానున్న కాలంలో వ్యవసాయానికి 365 రోజులు సాగు నీరందిస్తామన్నారు. చట్టం ఉన్న వారికి చుట్టంగా కేంద్రం ప్రభుత్వం మోసగాళ్లకు రుణాలిచ్చి బ్యాంక్‌లపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తోందని విమర్శించారు. ఒక పేద రైతు, మహిళా సంఘం సభ్యురాలు రుణం అడిగితే బ్యాంకర్లు అనేక పత్రాలు అడుగుతారని, లగడపాటి, నీరవ్‌మోడీ, విజయ్‌మాల్యాలకు రుణాలు ఇచ్చే ముందుకు బ్యాంకు వారు చూపే అశ్రద్దపై అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. పోతారం చెరువు మత్తడిని నాలుగున్నర మీటర్ల ఎత్తు పెంచి సూరంపేట శ్యామల చెరువుకు నీరందించే ఏర్పాటు చేశామని, మత్తడి ఎత్తు పెంపుతో కోనాపూర్ గ్రామానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ప్రణాళికలు తయారు చేసిన తర్వాతే మత్తడి ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒక వేళ మత్తడి పెంపుతో కోనాపూర్ గ్రామంలో ముంపుకు గురైతే దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ శోభ పేర్కొన్నారు. కోనాపూర్ గ్రామస్థులు సహకరించాలన్నారు.

            ప్రతి మహిళ తాగు నీటి కోసం బోర్లు, బావుల వద్దకు వెళ్లే పరిస్థితి రావద్దని, రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని రానున్న రెండు నెలల్లో ప్రతి ఇంటికి నళ్లాల ద్వారా నీరందిస్తామని ఎంపి వినోద్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నురుగు శ్రీనివాస్, ఎంపిపి స్వర్ణలత, జెడ్పీటీసీ ప్రశాంతి, వైస్ ఎంపిపి రాజేశం, విండో చైర్మన్లు కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు , రైతు సమన్వయ సమితి సభ్యులున్నారు.