Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

సంస్కరణల్లో తెలంగాణ నం. 1

tg

సులభతర వాణిజ్య విధానాల్లో రాష్ట్రానికి రెండవ స్థానం 

మన తెలంగాణ / హైదరాబాద్ : సులభతర వాణిజ్య విధానంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) 2017 సంవత్సరానికి దేశం మొత్తం మీద తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో హర్యానా నిలిచాయి. జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నాల్గవ, ఐదవ స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదు రాష్ట్రాలూ 95% కంటే ఎక్కువ స్కోరు సాధించడంతో ‘టాప్ అచ్చీవర్స్’గా నిలిచాయి. వ్యాపార సంస్కరణల అమలులో 100% ఫలితాలు సాధించి తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచినప్పటికీ మొదటిసారిగా ఈ సంవత్సరం వినియోగదారులైన పరిశ్రమల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నందున 98.33% స్కోరుతో రెండవ స్థానంలో నిలిచింది. 98.42% స్కోరుతో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. అయితే సంస్కరణల అమలులో మాత్రం ఆ రాష్ట్రం 99.73% మార్కులను మాత్రమే సా ధించింది. కానీ పరిశ్రమల అభిప్రాయాల్లో మాత్రం తెలంగాణ 83.95% మార్కులు సాధిస్తే ఆంధ్రప్రదేశ్ 86.50% మార్కులు సాధించింది. ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకుని ఓవరాల్ ర్యాంకు ఇవ్వడంతో తెలంగాణ 98.33% సాధించగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం 98.42% సాధించింది. దీంతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవగా తెలంగాణకు రెండవ స్థానం లభించింది. 2015 సంవత్సరం నుంచి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలనే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సులభతర వాణిజ్య విధానంలో వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టి ర్యాంకింగ్‌లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచినప్పటికీ ఆ తర్వాతి ఏడాదికి (2016లో) ఏకంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా సంస్కరణల అమలులో తొలి స్థానాన్నే సాధించినప్పటికీ పరిశ్రమల అభిప్రాయాల స్కోరును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో రెండవ స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ వివిధ రాష్ట్రాల ర్యాంకులను ఢిల్లీలో మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.
ఈ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయి : అభిషేక్
కేంద్ర వాణజ్య మంత్రిత్వశాఖలోని పారిశ్రామిక ప్రోత్సాహక, విధాన విభా గం, ప్రపంచబ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్య విధానం పోటీలు వివిధ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రావడానికి దోహదపడుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు 2017 సంవత్సరానికి సాధించిన ర్యాంకులను ప్రకటించిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గతేడాది 285 వాణిజ్య సంస్కరణలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని, ఈసారి ఆ సంఖ్యను 372కు పెంచామని తెలిపారు. రాష్ట్రాలు సాధించిన స్కోరును నిర్ణయించడంలో ఆ సంస్కరణలు అమలవుతున్న తీరుతో పాటు అంతిమంగా వాటి ద్వారా ఫలాలు అందుకుంటున్న పరిశ్రమల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, ఈ రెండింటికి వచ్చిన స్కోరు ఆధారంగా అంతిమంగా ఆ రాష్ట్రానికి ర్యాంకులను ఇచ్చామని తెలిపారు. దాదాపు 50 వేల పరిశ్రమల్లో ఐదువేల ప్రైవేటు రంగ సంస్థలను, 4300 మంది వాణిజ్యవేత్తలను, 800 మంది ఆర్కిటెక్టులను, లాయర్లు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు… ఇలా వివిధ విభాగాలకు చెందినవారి అభిప్రాయాలను తెలుసుకున్నామని, ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సంస్కరణల తీరుతెన్నులపై వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విధానాన్ని తొలిసారిగా అవలంబించామని స్పష్టం చేశారు. మొత్తం 372 సంస్కరణల్లో 78 సంస్కరణలు పరిశ్రమలు నేరుగా సంబంధం కలిగి ఉన్నాయని వివరించారు. ఈ అభిప్రాయాలను తెలుసుకోడానికి వర్క్‌షాపులను నిర్వహించామని, నేరుగా వారితో సమావేశాలు జరిపామని, కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్సులు కూడా నిర్వహించామన్నారు. గతంలో తక్కువ పనితీరు కనబర్చిన రాష్ట్రాలు ఈసారి బాగా రాణించేలా త్రిపురకు తెలంగాణ, నాగాలాండ్‌కు పశ్చిమబెంగాల్‌లు సహకారం అందించాయని తెలిపారు. మొత్తం స్కోరు 95% కంటే ఎక్కువ సాధించిన రాష్ట్రాలను ‘టాప్ అచ్చీవర్స్’గా, 90% కంటే ఎక్కువ సాధించిన రాష్ట్రాలను ‘అచ్చీవర్స్’గా, 80%కంటే ఎక్కువ సాధించిన రాష్ట్రాలను ‘ఫాస్ట్ మూవర్స్’గా, 80%కంటే తక్కువ సాధించిన రాష్ట్రాలను ‘ఆస్పైరర్స్’గా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఏడాదికి అమలుచేస్తున్న సంస్కరణలకు వచ్చే ఏడాది ర్యాంకులను ప్రకటిస్తామని, ఇందుకు సంబంధించి ప్రాథమికంగా చేయాల్సిన కార్యాచరణను రాష్ట్రాలతో పంచుకున్నట్లు తెలిపారు.

Comments

comments