Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సౌర విద్యుత్‌లో నెంబర్ 1

lf

మన తెలంగాణ/హైదరాబాద్ :సౌరవిద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తిచేసి మొదటి స్థానంలో నిలిచింది. దేశం మొత్తంమీద 21 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే గరిష్టంగా తెలంగాణ రాష్ట్రం 3,342 మెగావాట్లను ఉత్పత్తి చేసి తొలి స్థానంలో నిలవడమే కాకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంత ఘన విజయాన్ని సాధించి ఆదర్శంగా నిలిచింది. వెయ్యి మెగావాట్లకు పైగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాలు ఉన్నాయి. డిమాండ్ ఉన్న చోటనే సోలార్ ప్లాంటు పెట్టే కొత్త పంథాను తెలంగాణ డిస్కంలు ఎంచుకుని అద్భుత ఫలితాలు సాధించాయి. తొలుత జెన్‌కో ఆధ్వర్యంలో జూరాల జలవిద్యుత్ కేంద్రం సమీపంలో ఉన్న స్థలంలో 1 మెగావాట్ సోలార్ ప్లాంటును నిర్మిచడంతో రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తొలుత 500 మెగావాట్లకు టెండర్లు పిలిచి, అప్పటి డిమాండ్ మేరకు యూనిట్‌కు రూ.6.49 చొప్పున ఇవ్వడానికి అంగీకరించి ఆ తర్వాత 2000 మెగావాట్ల సామర్థంతో కేవలం 10 నెలల కాలంలో టెండర్లు పిలిచి, కేటాయింపులు జరిపారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ పద్దతిని పాటించారు. అంటే 33 కెవి, 132 కెవి, 220 కెవి సబ్‌స్టేషన్ల పరిధుల్లో ఉండే డిమాండ్, ఆయా ప్రాంతాల్లో సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉన్న సామర్ధాన్ని అంచనా వేసి మరీ టెండర్లు పిలిచారు. దీంతో ఒక్కో సబ్‌స్టేషన్ పరిధిలో ఈ సామర్థమంతా సబ్‌స్టేషన్ల వారీగా విడిపోయింది. ఎక్కడ ఉత్పత్తి అయిన కరెంటు ఆ ప్రాంతంలోనే వినియోగమవుతుంది. ఫలితంగా విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు కూడా తగ్గుతాయి. 2015లో ముందస్తుగా చేసిన యోచనతో ఇప్పుడు సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గాయి. వ్యక్తులుగానీ సంస్థలుగానీ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెట్టుకున్నట్లయితే దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలి వేసవికాలంలో గరిష్టంగా పన్నెండువేల మెగావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైనా సౌర విద్యుత్ చాలా మేరకు అవసరాలను తీర్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి అనేక రాష్ట్రాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ పకడ్బందీ వ్యూహంతో తెలంగాణ డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ పద్ధతిని అనుసరించడంతో ఫలితాలు ఆశాజనకంగా రావడంతోపాటు అవసరాలు కూడా తీరాయి. ఫలితంగా సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎప్పటి నుంచో ఉన్నరాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది.

Comments

comments