Home తాజా వార్తలు ఎప్పటికీ కెసిఆరే

ఎప్పటికీ కెసిఆరే

 Telangana people feel under the leadership of KCR

తెలంగాణలో కెసిఆర్‌ను మించిన నాయకుడు లేడు
 నాకు సిఎం అవ్వాలన్న ఆలోచన లేదు
 టిడిపితో పొత్తు కలిసిరాదు
 కాంగ్రెస్‌కు చంద్రబాబు దత్తపుత్రుడు
 దీపావళి తరువాత టిఆర్‌ఎస్ మేనిఫెస్టో
మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తరువాత కెసిఆర్ మలివిడత ప్రచారం షురూ
 విలేకరుల ఇష్టాగోష్టిలో మంత్రి కెటిఆర్

మరో పదిహేను సంవత్సరాల వరకూ కెసిఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని, తనకు ఆ పదవిపై ఎలాంటి ఆశ లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్, బ్రాండ్ అంబాసిడర్ కెసిఆరేనని అన్నారు. టిడిపితో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీకి లాభించిందేమీ లేదని, ప్రజల్లో వ్యతిరేకతే మిగిలిందని, 2009 సంవత్సరంలో తమకు ఈ అనుభవం ఎదురయ్యిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో ఉత్తములు లేనందున చంద్రబాబును ఆ పార్టీ దత్తత తీసుకుందని ఆరోపించారు. కెసిఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనలేక చంద్రబాబు ధనబలంతో కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందన్నారు. గతంలో టిడిపితో పొత్తు తమకు నెగిటివ్ అయ్యిందని, ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని, దాదాపు అన్ని పార్టీలతో పొత్తులు అయిపోయాయని, ఇక మిగిలింది వైఎస్‌ఆర్‌సిపి అని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారంతో టిఆర్‌ఎస్‌కు ఏ మాత్రం నష్టం లేదన్నారు. సెటిలర్లపై తాను చేసిన వ్యాఖ్యలకు లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసలు కురిపించారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రచారంతో సెటిలర్లు మనసు మారదని, ఆ పార్టీకి ఓట్లు వేయరని, జిహెచ్‌ఎంసీలో

ఎన్నికల్లోనే అది రుజువయ్యిందన్నారు. చంద్రబాబు సోనియాను చాలాసార్లు తిట్టినా ఇప్పుడు నెత్తిన పెట్టుకుందని ఆరోపించారు. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తరువాతే టిఆర్‌ఎస్ తుది జాబితాఒకేసారి105 మంది అభ్యర్థులను ప్రకటించిన టిఆర్‌ఎస్‌కు మరో పన్నెండు సీట్లను ప్రకటించడానికి తొందర పడాల్సిందేమీ లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తరువాతే ప్రకటిస్తామని పేర్కొన్నారు. మహాకూటమి పుంజుకోవడానికి సిగపట్లు పడుతుందన్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ రెండు విడతలు ప్రచారాన్ని పూర్తి చేస్తారని తెలిపారు. రసమయి బాలకిషన్‌ను గ్రామాల్లో అడ్డుకున్నారని వార్తలు వస్తున్నాయని, ఆయనకు సంబంధం లేని విషయంపై ప్రజలు నిలదీశారని అన్నారు. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయని, ఏకపక్షంగా మాత్రం ప్రజలు కెసిఆర్ తరఫున ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తాను 20 నియోజకవర్గాల్లో పర్యటించానని అంతా టిఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు. వంద స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ గూబ గుయ్‌మనడం ఖాయమన్నారు. పరిస్థితులన్నీ టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. మహాకూటమి ప్రచారం చేయడానికి ఢిల్లీ నుంచి రాహుల్, సోనియా రావల్సిందేనని ఆయన ఆరోపించారు. అభ్యర్థి ఎవరైనా కెసిఆర్‌ను చూసి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తాను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానన్నారు. నియోజకవర్గాల్లో ప్రత్యర్థులెవరో తెలియనందునే కెసిఆర్ ప్రచారం చేయడం లేదన్నారు. మహాకూటమి నాయకులు సీట్లు పంచే లోపు తమ అభ్యర్థులు స్వీట్లు పంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు కుల పిచ్చి లేదు..
తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో కులపిచ్చి లేదని, ఏనాడూ కులాన్ని ఒక అంశంగా తీసుకోలేదన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను మారుస్తుందనేది వదంతులు మాత్రమే అన్నారు. అభ్యర్థులను ప్రకటించకముందే మహాకూటమిలో అసమ్మతి భగ్గుమంటోందని, ఇంకా సద్దుమణగలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఒక్కోక్కరికి ఒక్కో మ్యానిఫెస్టో ఉందన్నారు. కోదండరాం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసినా ఓటమి తప్పదన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచే కాంగ్రెస్‌తో ఆయన లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాల్లో నలుగురు చొప్పున 40 మంది సిఎం స్థాయి అభ్యర్థులు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆరోపించారు. ఎంఐఎం మతతత్వ పార్టీ కాదని, చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో తమను అప్రమత్తం చేసిందన్నారు. ఆ పార్టీ సమాచారం మేరకే చంద్రబాబు కుట్రలను అడ్డుకున్నామన్నారు.
హరీష్‌రావుపై కావాలనే దుష్ఫ్రచారం చేస్తున్నారు..
తెలంగాణలో కెసిఆర్‌ను మించిన నాయకుడు లేడని, మరో 15 సంవత్సరాలు ఆయనే సిఎం అని కెటిఆర్ అన్నారు. హరీష్, తాను కూడా అదే కోరుకుంటున్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. హరీష్‌రావుపై ఉద్దేశపూర్వకంగానే వంటేరు ప్రతాప్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీష్ తాను ఒకే కుటుంబానికి చెందిన వారమని, తాము ఎన్నో ఆటుపోట్ల తర్వాత ఈ స్థాయికి వచ్చామన్నారు. కెసిఆర్ గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేస్తారని, రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనేవి వదంతులు మాత్రమేనని, మీడియా సృష్టి అని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని, ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరుగుతున్నాయని, ప్రాంతీయ పార్టీలన్నీ అందులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ఉన్న సీట్లను కూడా బిజెపి కోల్పోతుంది..
అతిపెద్ద సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం ఆవిష్కరించిన బిజెపి ప్రభుత్వం వేరే పార్టీలకు ఎందుకు ఆహ్వానించలేదని కెటిఆర్ ప్రశ్నించారు. అమిత్‌షా అహంకారంతో మాట్లాడుతున్నారని, అహంకారి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఐటి దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. గతంలో వైఎస్ జగన్‌పై దాడి జరిగినప్పుడు తాను ఖండిస్తే చంద్రబాబు తట్టుకోలేక పోయారని, మానసికంగా భయాందోళనకు గురవుతున్నారన్నారు. మోడీని ఎదుర్కొంటానంటూ చంద్రబాబు ఊహాలోకంలో విహరిస్తున్నారని విమర్శించారు. గతంలో 5 సీట్లు గెలిచిన బిజెపి ఈసారి చేదు అనుభవం తప్పదని, ఆ పార్టీకి 70 అభ్యర్థులు కూడా దొరకడం లేదని, ఇక 70 స్థానాల్లో విజయం ఎలా సాధ్యమని ఎద్దేవాచేశారు.
నిరుద్యోగ భృతిని కచ్చితంగా చెల్లిస్తాం..
టిఆర్‌ఎస్‌లో కొన్నిచోట్ల నెలకొన్న అసంతృప్తి జ్వాలలను తగ్గించడానికి మంత్రులు కృషి చేశారని, తాను కూడా జోక్యం చేసుకున్నానని, కెసిఆర్ అవసరం లేనందునే రంగంలోకి దిగలేదని కెటిఆర్ వివరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి ప్రజలకు తెలుసని, మళ్లీ అధికారంలోకి రాగానే వాటిని అనుకున్న విధంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. నిరుద్యోగ భృతిని మ్యానిఫెస్టోలో చేర్చామని, కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధి లబ్ధిదారులు అని మూడు రకాలుగా నిర్వచించుకున్నామని తెలిపారు. కెసిఆర్ ఏది చేసినా ప్రణాళిక ప్రకారం చేస్తారన్నారు. కోదండరాం సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు అంటూ ప్రకటిస్తున్నారుగానీ ఉద్యోగాలు ఎన్నో తెలుసుకోవాలని హితవు పలికారు. నాలుగున్నర ఏళ్లలో 1,12,000వేల ఉద్యోగాలను గుర్తించామని అందులో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 40 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చామని, మరికొన్ని ఉద్యోగాలు కోర్టు కేసుల వలన పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడో జరగాల్సిన హైకోర్టు విభజన ఇప్పుడు జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఎన్‌టిఆర్ ట్రస్టు మ్యూజియంగా మారనుందని, అందులో కాంగ్రెస్ పార్టీ ఫొటో కూడా ఉండనుందన్నారు. పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను దీపావళి తరువాత విడుదల చేస్తామన్నారు.

Telangana people feel under the leadership of KCR

Telangana News