Home తాజా వార్తలు మరోసారి భూముల సర్వేకు అధికారులు సన్నద్ధం

మరోసారి భూముల సర్వేకు అధికారులు సన్నద్ధం

Land Surveyఅసలు యజమానులకు టైటిల్ హక్కులు దక్కేలా చర్యలు,  ఈనెలలోనే రికార్డుల డిజిటలైజేషన్, నిజాం కాలం నాటి రికార్డులకు చరమగీతం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని లెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్‌లో కొత్త చట్టం రానున్న నేపథ్యంలో, దేశానికే తలమానికంగా ఉండేలా భూ సంస్కరణ ఉండాలని కెసిఆర్ అధికారులకు సూచించినట్టు తెలిసింది. భూముల వివరాలతో పాటు వాటి అసలు యజమానులు ఎవరన్నది నిర్ధారించి వారికి హక్కులు కల్పించాలని సిఎం ఆలోచనగా తెలుస్తోంది. దీనికోసం మరోసారి భూములను సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ కొత్త చట్టంలో భాగంగా కంక్లూజివ్ యాక్ట్‌ను అమలు చేయాలని కెసిఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అధికారులు దీనిపై నివేదిక కూడా తయారు చేసినట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో నివేదికను సిఎం కెసిఆర్‌కు అందచేయాలని అధికారులు భావిస్తున్నారు.

నిపుణులు, న్యాయ నిపుణులతో దీనిపై వర్క్‌షాపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) విధానంలో మార్పులు, పహాణీలో అక్కరలేని, నిబంధనలను తొలగించడంతో పాటు ప్రతి అంగుళం భూమికి అసలు యజమానులు ఎవరో నిర్ధారించి వాటిపై భూ హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యుటేషన్లు, ఆర్‌ఓఆర్, పహాణీల్లో మార్పులు ఆటోమెటిక్‌గా అమలయ్యేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నిజమైన భూ యజమానులకు అన్యాయం జరిగితే పరిహారం

కొత్త చట్టం అమల్లో భాగంగా ముందస్తుగా భూములను రీ సర్వేను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన చట్టం ప్రకారం భూములు, ఆస్తులపై సర్వాధికారాలు టైటిల్ (హక్కులు) యజమానులకే దక్కనున్నాయి. తదనంతరం రిజిస్ట్రేషన్ల క్రయ విక్రయాలు కూడా జూన్ తరువాత ఏజెన్సీ వద్ద చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రస్తుత విధానాన్ని పూర్తిగా మార్చ నున్నారు. రిజిస్ట్రేషన్లకు ముందే సదరు ఆస్తులు, భూములపై ప్రభుత్వం అభ్యంతరాలను కోరుతుంది. ఆయా భూములు ఎవరీ ఆధీనంలో ఉన్నాయో, ఎవరూ పొజిషన్‌లో ఉన్నారో, హక్కుదారులు ఎవరో ముందుగానే పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత ఆయా భూముల ఆక్రమణలకు గురైతే వాటిపై విచారణ చేయడంతో పాటు నిజానిజాలు నిర్ధారణ చేసి అసలైన వ్యక్తులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం వారికి పరిహారం ఇప్పిస్తుంది. జూన్ తరువాత కొత్త చట్టం అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై అధికారం ఉన్న సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల అధికారులకు కోత పడనున్నట్టు తెలుస్తోంది.

వివాదాలు లేని సరిహద్దులను నిర్ధారిస్తారు

దశాబ్ధం కాలం నాటి భూ రికార్డులను ఆధునీకరించాలని అందులో భాగంగానే భూములను సమగ్రంగా రీ సర్వే చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పాత రికార్డులను సంస్కరించడం ద్వారా రాష్ట్రంలోని వివాదాలు లేని సరిహద్దులను నిర్ధారించాల్సి ఉంది. రాష్ట్రంలో 1940 దశకంలో జరిగిన సర్వే వివరాలను అప్‌డేట్ చేసేందుకు రీ సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దేశంలోనే భిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఉన్న తెలంగాణలో ఈ సర్వే ద్వారా తన ప్రత్యేకతను చాటాలని సిఎం యోచిస్తున్నట్టు తెలిసింది.

ఈ నెలలోనే రికార్డులను డిజిటలైజేషన్ వెబ్‌ల్యాండ్ రికార్డులను పూర్తి చేసి సమగ్ర భూ సర్వేకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఎలాంటి వివాదాలు లేని రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. 2008లో కేంద్ర ప్రభుత్వం భూ రికార్డులను అప్‌డేట్ చేసేందుకు సమగ్ర డిజిటల్ కెడస్టరల్ రికార్డుల డేటాబేస్‌ను రూపొందించింది. దేశంలోని గ్రామీణ భూములను సమగ్ర సమాచార వ్యవస్థ జాతీయ భూ రికార్డుల ఆధునీకరణను (ఎస్‌ఎల్‌ఆర్‌ఎంపి)ని ఇ దర్తీ పేరుగా మార్చారు.

హైదరాబాద్, నిజామాబాద్ మినహా

అందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ మినహా మిగతా 8 జిల్లాల్లో పునః సమగ్ర భూ సర్వే చేయాలని కోరింది. నేటికి తెలంగాణలో నిజాం కాలంనాటి రికార్డులే ప్రామాణికంగా మారాయి. ఈ ప్రాంతంలో బ్రిటీష్ కాలంలో జరిగిన భూ సర్వే మినహా సమగ్ర సర్వే జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్వే సంపుటి ప్రకారం ప్రతీ 40 ఏళ్లకు ఒకసారి రీ సర్వే జరగాల్సి ఉంది. దశాబ్ధాల క్రితం నిర్వహించిన సర్వేలో రూపొందించిన రికార్డులు శిథిలావస్థకు చేరడంతో భూ రికార్డుల లభ్యత వాస్తవ స్థితి పరిశీలన అడ్డంకిగా మారింది. దీంతో మరోసారి సమగ్ర భూ సర్వేతో గ్రామ మ్యాపులు, ఎప్‌ఎంబీలు,ఆర్‌ఎస్‌ఆర్‌లు, భూమి రిజిస్ట్రర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Telangana State Land Records Survey