Home రాష్ట్ర వార్తలు మార్చి నుంచి రైతులకు పగటి విద్యుత్

మార్చి నుంచి రైతులకు పగటి విద్యుత్

jagadish-reddyమన తెలంగాణ/పెద్దశంకరంపేట: వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వచ్చే మార్చి నుంచి రైతులకు నిరంతరాయంగా పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని జంభికుంటలో నూతనంగా నిర్మించ నున్న 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆనంతరం పెద్దశంకరంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాత్రి పూట విద్యుత్ సరఫరా జరిగేదని, దానివల్ల అనేకమంది రైతులు పలు ప్రమాదాలతో మృత్యుకౌగిట్లోకి చేరారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకొని పగటి పూట ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు సాగు కోసం కరెంట్ సరఫరా చేస్తామని, దీనివల్ల రైతులు నిర్భయంగా పంటలు సాగు చేసు కోవచ్చని తెలిపారు. నారాయణఖేడ్ నియోజక వర్గంలో నేడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒకే రోజు ఇన్ని వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రజలు ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతోందన్నారు. విద్యుత్ విషయంలో నానా యాగి చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరు మూసుకు న్నాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చింది…వెలుగులు తీసుకువచ్చిందని వివ రించారు. తెలంగాణ వస్తే మనకు చీకటి రోజులు వస్తా యని చెప్పిన ఆంధ్రానాయకులు చివరకు వాళ్లే చీకట్లోకి వెళ్లిపోయారన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టిడిపి నాయకులను నిలదీయాలని చెప్పారు. ఇంకా ఎవరైనా టిడిపి జెండా పట్టుకుంటే వారిని తరిమి తరిమికొట్టాలని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ అభివృద్ధిని ఆపలేరన్నారు. ఈ ఒక్కరోజే నారాయణఖేడ్ నియోజకవర్గంలో రూ.43 కోట్లతో పనులు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి వివరించారు. ఈ సభలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంభాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా దేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రకటించలేదని గుర్తు చేశారు. పెద్ద శంకరంపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంత్రులు కృషి చేయాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటాని చెప్పారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 220 కెవి విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. నారాయణఖేడ్ నుంచి ప్రతి సీజన్‌లో గిరిజనులు వలస వెళుతుంటారని, వారి వలసల నివారణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, నర్సా పూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, సర్పంచులు విజయ రామరాజు, అంజలి, కిషన్‌రావు దేశ్‌పాండే, ఎంపిటిసి సభ్యులు సుశీల, మాణిక్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మెన్ జగన్ మోహన్ రెడ్డి, మెదక్ ఆర్‌డిఓ మెంచు నగేష్, స్థానిక తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఎంపిడిఓ స్వప్న, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులు, విద్యుత్ ఎడిఇ రవీందర్ రెడ్డి, ఏఈ దుర్గయ్య, తదితరులు పాల్గోన్నారు.