Home కలం బిసిల తెలంగాణ కథ

బిసిల తెలంగాణ కథ

image

తెలంగాణ సమాజం భిన్న అస్తిత్వాల సముదాయం. ప్రతీ అస్తిత్వం దేనికదే ప్రత్యేకం. ఒక వ్యక్తి అనేకమైన అస్తిత్వాలు కలిగి ఉంటాడనేదానికి తెలంగాణ రాష్ర్టమే ఒక చక్కని ఉదాహరణ. ఈ బహుళ అస్తిత్వాలే తెలంగాణ రచనల్లో వైవిధ్యం రావడానికి కారణమైనాయి. ఇందుకు తెలంగాణ కథ మినహాయింపేమి కాదు. బండారు అచ్చమాంబ మొదలుకుని నేటి ఆధునిక యువ రచయితల వరకు ఈ వైవిధ్యాలు వారివారి రచనల్లో కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా తెలంగాణానే ఒక వెనుకబడిన ప్రాంతం. అందులోనూ వెనుకబడిన తరగతులైన బహుజనుల పరిస్థితి మరీ దుర్భరం. టచబుల్స్‌గా ఉన్న ఈ సమాజం కేవలం చాకిరీ కులాలుగా మాత్రమే మిగిలారు. అన్‌టచబుల్స్‌గా దళితులు ఊరవతల ఎదుర్కొన్న వివక్ష ఒక విధమైతే ఊరిలో ఉన్న ఈ బహుజన్ టచబుల్స్ ఎదుర్కొన్న వివక్ష మరో విధం. స్పృశ్యులుగా ఉన్న ఈ బహుజనులు చాకిరీలోను,వెట్టి చాకిరీలోనూ,అవమానాల్లోనూ,అత్యాచారాల్లోనూ తీవ్ర హింసకు గురయ్యారు. కేవలం ఊరిలో ఉంటున్న మాటేగాని జంతువుల్లా స్వేచ్ఛ లేకుండా జీవించిన చరిత్ర బహుజనులది. దొరోడి కచ్చరం ముందు పరిగెత్తే దగ్గర నుండి దొర గడీలకు సర్వం అర్పించుకున్నారీ బహుజనులు. దొరోడి పొలానికి నాగళ్ళ తయారీ నుండి దుక్కి దున్ని పంట చేతికొచ్చే వరకు చెమట చిందించింది బీసీ బహుజనులే. ఫలితంగా పంట దొరోడికి చెందగాపరిగె బీసీలకు మిగిలేది. దీనికి తోడు నిజాం దోపిడీ పీడనలు దీనికి అదనం.

ఊరికి ఊరవతలకి వారధిగా ఉన్న ఈ శూద్రులను చూస్తే ఊరవతల ఉన్న దళితులకు కూడా కోపమే. ఎందుకంటే ఇష్టమున్నా లేకున్నా అగ్రవర్ణాల ఆజ్ఞలను అమలు చేయాల్సింది బీసీలే కదా. బీసీలకు సొంత జీవితం ఎక్కడుంది?ఎవరో కొందరు అగ్రవర్ణ బీసీలు దళితుల పట్ల చూస్తున్న చిన్నచూపుకు మొత్తం బీసీ జాతిని దళితులు అనుమానించాల్సిన పరిస్థితి. కాని కొన్ని అగ్రకులాలను అనుసరించే బీసీ కులాలు మినహా మిగతా వారికి స్వేచ్ఛ ఎక్కడిది?శూద్ర బీసీ ఉమ్మి నిషేదంఅడుగులు నిషేదంపాదరక్షలు నిషేదం…కాని వాడి శ్రమ అంగీకారం. ఇవన్నీ ఒక ఎత్తయితే కోపమొచ్చిన దొరోడు కోరికొచ్చిన దొరోడు తమ ప్రతాపాన్ని చూపెట్టేది ఊర్లో ఉన్న బీసీల మీదనే కదా. కనుక ఆధిపత్య కులాల ప్రవర్తనను బట్టి ఊరి బీసీల జీవితం మారుతా ఉండేదని చరిత్ర స్పష్టంగా చెబుతున్నది. చరిత్ర ఎందుకు నిజాం పాలన నుండి నేటి వరకూ తెలంగాణాలో బీసీల జీవితం అలానే ఉంది ఎటువంటి మార్పు లేకుండా తెలంగాణ ప్రాంతం ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలనలో లేకపోవడం..,నిజాం పాలనలో తెలంగాణ బందీ అయ్యి ఉండడం..,ఆ నిజాం దోపిడీ పీడనలకు దొరలు,పటేల్,పట్వారీలు,వతన్‌దారులు వత్తాసు పలికి ఆ ఆజమాయిషీనంత ఊరి బహుజనులపై చూపెట్టేది. ఫలితంగా ఊర్లో ఉన్న సబ్బండ వర్ణాలు తీవ్ర పీడనకు గురయ్యేటివి. ఇవన్నీ ఊర్లో ఉండడం చేత బీసీ బహుజనులు ప్రత్యక్షంగా ఎదుర్కోవలసి వచ్చేది. ఇంకొంత ముందుకు వస్తే…తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది బహుజనులు ఊర్లో ఉన్న ఫలానికి ఊచకోత కోయబడ్డారు.ఈ కాలంలోనే జరిగిన రజాకార్ల,మిలిటరీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిందీ…అత్యాచారాలకు గురైంది బహుజనులే.

ఆ తర్వాత 69లో వచ్చిన తెలంగాణ తొలిదశ పోరాటంలో ప్రాణాలు కోల్పోయింది మెజార్టీ బహుజనులే. ఆ తర్వాత 90ల్లో వచ్చిన ప్రపంచీకరణ బహుజనులను నిండా ముంచి నిలువనీడ లేకుండా చేసింది. ఆ దెబ్బ నుండి నేటికీ కోలుకోకుండా వలసబాట పడుతూనే ఉన్నది బహుజన సమాజం. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో వెయ్యికి పైగా అమరులైంది బహుజనులే. ఇంత గోస,త్యాగం కలగలిసిన బహుజన జీవితాల్లో పత్తి రైతు ఆత్మహత్యలు,ఎన్‌కౌంటర్ మరణాలు, ఆర్థిక మరణాలు, ఆకలి చావులు, నిరుద్యోగితా చావులు, వలస చావులు ఇవన్నీ బహుజనులను అల్లకల్లోలం చేసాయి. మొత్తంగా బతకడమే అనుమానాస్పదమైన బీసీ జీవితాలను తెలంగాణ కథ పైన పేర్కొన్న అన్ని అంశాలను దాదాపుగా అక్షరాలా చిత్రిక పట్టింది. కవిత్వంతో పోలిస్తే తెలంగాణ కథ మిక్కిలి ఎక్కువగా బహుజనుల తరపున నిలబడిందిబహుజనుల గొంతుకై నిలిచింది. అయితే ఈ బహుజనుల జీవితాలు ఇలా ఉండడానికి కారణం రాజ్యం,రాజ్యస్వరూపం అని చెప్పిన తెలంగాణ కథ ఈ రాజ్యం మనదని…అత్యధికులైన బీసీల ఓటు శక్తితోనే ఈ రాజ్యానికి ఒక రూపం వచ్చిందని చెప్పడంలో మాత్రం విఫలమైంది.

ఇంత త్యాగపూరితమైన బహుజన సమాజం…తమ చెమటను ఇంధనంగా సమాజాన్ని నడుపుతున్న బహుజన సమాజం రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం వైపు పయణించాలని చెప్పడంలో తెలంగాణ కథ తడబాటు చెందింది. త్యాగాలు ఎవరివిభోగాలు ఎవరివని ప్రజలను చైతన్యపరచడంలో నిర్లక్ష్యం వహించింది. బీసీ బహుజనులకు ఈ బానిస మనస్తత్వం ఎందుకు ఇంతలా చొరబడిందో?నని చెప్పడంలో బహుజన కథకులు అలసత్వం వహించారు. మరీ ముఖ్యంగా బహుజన కథలను నేరుగా కాకుండా పేదరికం అని..,మధ్యతరగతి అని కథల్లో పొందుపరచడం వలన బహుజన జీవితాల వాస్తవ జీవిత చిత్రణ జరగలేదు. ఫలితంగా బహుజన జీవితాల కుల సంస్కృతులు,కుల చరిత్ర, కుల మనస్తత్వాలు..అన్నింటికంటే ముఖ్యమైన కులచైతన్యాలు బయటికి రాలేదు. బహుజన రచయితలు ఈ కుల చైతన్యాన్ని ప్రస్తావించకుండా చాలా మట్టుకు వారి స్థితిని మాత్రమే ఏకరువు పెట్టారు. బీసీ కులాల్లో బీసీఏ సేవా కులం,బీసీబి శ్రామిక కులం,బీసీడి ఉత్పత్తి కులం…ఇందులో ప్రతీ కులం ఒకొక్క తరహాలో ఒక్కో కుల అస్తిత్వాన్ని,కుల చైతన్యాన్ని కలిగి ఉన్నాయి.బహుజన కథ ఈ అంశాన్ని అంత ప్రాముఖ్యమైన అంశంగా తీసుకోలేదు ఎందుకనో? దీనికి ఈ రచయితలకు బహుజన దృక్పధం లేకపోవడమే అని అర్థం చేసుకోవచ్చు.

చాలామట్టుకు బహుజన రచయితలు బహుజన జీవితాలను ఆర్థిక కోణం నుండే చూసి వారి పేదరికాన్ని,వారి బాధలను ఏకరువు పెట్టడం వలన వారి ఆర్థిక స్థితిగతులు ఆ విధంగా ఉండడానికి ఆర్థిక అంశాలే కారణమన్నట్టుగా ఈ రచయితల రచనలు కొనసాగాయి.సరే ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని అధిగమించడానికి మళ్ళీ ఉద్యమాలు,విప్లవాలనే సూచించారు తప్ప బహుజనులు పోరాటం చేయాల్సింది రాజ్యాధికారం కోసమని చెప్పిన రచయితలు తక్కువ.

తెలంగాణ బహుజన కథలను పరిశీలిస్తేకాలువ మల్లయ్య, బి.ఎస్ రాములులాంటి కొందరు మినహాయిస్తే చాలా మంది రచయితలు బహుజన కథలను బహుజన ఐడియాలజీ నుండి రచించినవి తక్కువ.“తెలుగు కథలో రచయితలు ఎక్కువ మంది రచయితలు అగ్రకులాల వారు కావడం చేత వాళ్ళ జీవితాలే అందులో ప్రతిఫలించాయని,బహుజన రచయితలు సైతం వాళ్ళ మార్గంలోనే ప్రయాణిస్తూ తమ స్వీయ జీవిత చిత్రణను మరిచిపోయారని విమర్శకు పెట్టారు బహుజన తత్వవేత్త బి.ఎస్ రాములు. వామపక్ష ఉద్యమ స్ఫూర్తితో కథలు రాసిన బహుజన కథకులు అనేకులు తమ తమ కులమూలాలను విస్మరించి కథలు రాశారని,వాళ్ళకు బహుజన రక్త సంబంధాలు,వాళ్ళ సంస్కృతివంటివి కనిపించకుండా పోయాయని అభిప్రాయపడ్డారాయన. ఈ అభిప్రాయం తెలంగాణ బహుజన రచయితలకు ముమ్మాటికీ వర్తిస్తుందనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉంటే,బహుజన సామాజిక వర్గాల జీవిత చిత్రణ విషయంలో తెలంగాణాతో పోలిస్తే ఉత్తరాంధ్ర,కోస్తాంధ్ర రచయితలు చాలా వెనకబడిపోయారన్నది నిజం. దీనికి కారణం తెలంగాణ దళిత,బహుజనుల జీవితాల్లో ఉన్న పీడనలు,నిర్బంధం,అణిచివేతలు ఈ స్థాయిలో ఉత్తరాంధ్ర,కోస్తాంధ్ర ప్రాంతంలో లేవు. తెలంగాణఆంధ్రప్రదేశ్ ఏర్పాటు,విభజన విషయాల్లోనూ ఇక్కడి దళిత బహుజనుల రచయితలున్నంత చైతన్యంగా అక్కడి వారు లేరు.

ఇంతెందుకు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సందర్బంలో కూడా వచ్చే తెలంగాణను ఏలేది ఎవరు?అనే ప్రశ్నను లేవనెత్తింది ఇక్కడి దళిత బహుజన రచయితలే. కనుక ఇక్కడి బహుజన రచయితలకు పోరాట చైతన్యం ఎక్కువ. అయితే ఈ పోరాట చైతన్యం ఉద్యమాల్లో,పోరాటాల్లో మాత్రమే కనబడి అసలు విషయమైన ఓటు చైతన్యం దగ్గర కనిపించకపోవడం అసలు లోపం. ఈ విషయంలో ఇంకాస్త ముందుకెళితే దళిత రచయితలకు బాబాసాహెబ్,కాన్షీరాం స్ఫూర్తి, ఓటు బ్యాంకు చైతన్యం ఉంది. కాని బీసీ బహుజన రచయితలు ఇంకా ఓటు చైతన్యం అనే అంశాన్ని అంత సీరియస్ అంశంగా తీసుకోవట్లేదు…కనుకనే తెలంగాణ బీసీ రచయితల కలాల్లోంచి వేల కథలు వెలువడ్డా ఓటు చైతన్యం అనే అంశం ఎక్కడా కనబడదు. ఫలితంగా తెలంగాణ బహుజన కథలు రాజ్యాధికార కథలుగా రూపొందడంలో విఫలమైనాయి. కనుకనే బీసీ కథ అంటే కులవృత్తులు,వృత్తుల ధ్వంసం,ఉన్న ఊరు,కన్నతల్లి,వలసలు,ఆత్మహత్యలు,పేదరికం,ప్రపంచీకరణ దగ్గరే ఆగిపోయింది.కేవలం స్థితిగతులను చిత్రిక పట్టిన కథల వలన తాత్కాలిక ఉపశమనాన్ని బహుజన పాఠకుడు పొందుతాడేమో కాని బహుజనుల జీవితాల్లో సమూల మార్పు రావాలంటే,సామాజిక న్యాయం కోసం పోరాడాలని..,అప్పుడే సామాజిక మార్పు సాధ్యమని అయితే ఆ సామాజిక మార్పు రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యమనే విషయాన్ని మొదట బహుజన రచయితలు విశ్వసించగలగాలి. దానికి ఓటు చైతన్యం ముఖ్యమనే విషయాన్ని బలంగా చెప్పగలగాలి. ఏదేమైనా ‘పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ’ అని తెలియజేసే కథలు విస్తృతంగా వెలువడాల్సిన అవసరం ఉంది.ఈ చైతన్యం తెలంగాణ పోరాటాల గడ్డలో అంత కష్టమైందేమి కాదు ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఆరంభమే కష్టం అందుకుంటే ఇక ఎదురుండదు.

అయితే ఇటీవల తెలంగాణ బహుజన రచయితల్లో పెరుగుతున్న ఫూలేఅంబేద్కర్ భావజాలం దృష్ట్యా, జనాభా దామాషా ప్రకారం “మేమెంత మందిమో మాకంత వాటా” ఉద్యమాలు పెరుగుతున్న దృష్ట్యా ఓటు చైతన్యంరాజ్యాధికారంలాంటి బహుజన భావజాలాన్ని తెలంగాణ రచయితలు తమ కథల్లో కథాంశంగా విరివిగా అక్షరీకరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది శుభ పరిణామం.

                                                                                                                                                         డా.చింతం ప్రవీణ్ కుమార్
                                                                                                                                                                  9346 886 143