Home అంతర్జాతీయ వార్తలు ఖగోళ పరిశోధనల కోసం … టెలిస్కోపు

ఖగోళ పరిశోధనల కోసం … టెలిస్కోపు

NASAవాషింగ్టన్ : గ్రహాలు, గ్రహశకలాలు, దగ్గరగా ఉండే గెలాక్సీలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎగిరే టెలిస్కోపును ప్రయోగించింది. స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ(సోఫియా) అనే ఈ సాధనతో ఏడాది పాటు రోదసి పరిశీలనలు చేస్తారు. బోయింగ్ 747ఎస్‌పి విమానంలో మార్పులు చేసి ఈ టెలిస్కోపును అమర్చినట్టు సైంటిస్టులు తెలిపారు. దీన్ని ప్రయోగించడం ఇది నాల్గో సారి కావడం గమనార్హం. ఈ దపాలో వచ్చే ఏడాది జనవరి వరకూ పరిశీనలు చేస్తారు. దీని కోసం 106 సార్లు ఈ విమానం గగన విహారం చేయనుంది. ఈ క్రమంలో సౌర కుటుంబంలోని గ్రహాలు, చందమామలు, గ్రహశకలాలు, తారలు , గ్రహాల ఆవిర్భావం, తారంతర మాధ్యమం, తారాంవతర రసాయన శాస్త్రం, పాలపుంత గెలాక్సీ కేంద్రకం , సమీపంలోని సాధారణ, క్రియాశీల గెలాక్సీలను పరిశీలించనున్నట్టు సైంటిస్టులు వెల్లడించారు. సోఫియాలోని పరికరాలు పరారుణ శక్తిని పరిశీలిస్తాయని వారు తెలిపారు. కొత్తగా జన్మించిన తారలు సహా అంతరిక్షంలో అనేక వస్తువులు తమ శక్తిని పరారుణ తరంగ దైర్ఘాల్లో వెలువరిస్తుంటాయి. సాధారణ దృశ్యగోచర కాంతిలో వాటిని పరిశీలిస్తే, అవి కనిపించవని సైంటిస్టులు పేర్కొన్నారు.