Home వార్తలు తెలుగు సినిమా ఆణిముత్యం… ‘స్వాతిముత్యం’

తెలుగు సినిమా ఆణిముత్యం… ‘స్వాతిముత్యం’

Swathimuthyam7“స్వాతిముత్యం చాలా గొప్ప చిత్రం. భారతీయ సినిమా హాలీవుడ్‌ను అనుసరిస్తోంది, కాపీ కొడుతోంది… అని విమర్శించే వారందరికీ ‘స్వాతిముత్యం’ ఉదాహరణగా చూపిస్తాను. ఈ సినిమా విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టి ‘ఫారెస్ట్ గంప్’ అనే చిత్రాన్ని హాలీవుడ్ వాళ్లు తీశారు. ఈ సినిమాలోని ప్రతి సీనూ యథాతథంగా తీశారు”అని గొప్పగా చెప్పారు విశ్వ నటుడు కమల్‌హాసన్. ఆయన కథానాయకుడిగా 1986 సంవత్సరం మార్చి 13న విడుదలైన ‘స్వాతిముత్యం’ సోమవారానికి 30 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం నిలవడం ‘స్వాతిముత్యం’కే దక్కింది.
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కళా తపస్వి కె.విశ్వనాథ్, విలక్షణ నటుడు కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వాతిముత్యం’ బాక్సాఫీస్ రికార్డును సృష్టించింది. జాతీయ అవార్డ్‌లో ఉత్తమ తెలుగు చిత్రం, నంది అవార్డ్‌లో బంగారు నంది, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెల్చుకోవడం విశేషం. ఇక రష్యన్ భాషలో కూడా డబ్ చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తమిళంలో ‘సిప్పిక్కుల్ ముత్తు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయ ఢంకా మ్రోగించింది. తెలుగులో 25 కేంద్రాల్లో శత దినోత్సవం, బెంగుళూర్‌లో 516 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. మైసూర్‌లో కూడా ఈ చిత్రం ఏడాది పాటు ప్రదర్శించబడింది.
విభిన్నమైన కథాంశంతో…
పొట్టకోస్తే అక్షరం ముక్కలేనివాడు… వెర్రి వెంగళప్ప… శుద్ధ మొద్దావతారం.. అమాయక చక్రవర్తి.. ఇలాంటి లక్షణాలున్న పాత్రని హీరోగా చేసి ఎవరైనా సినిమా తీస్తారా? దానికి తోడు ఆ హీరో ఓ వితంతువు మెడలో తాళి కట్టి ఆమెకు అండగా నిలబడతాడు. ఇలాంటి కథతో సినిమా తీయడానికి దర్శకనిర్మాతలు ధైర్యం చేయడం చాలా గొప్ప విషయం. తమ అభిరుచి మీద నమ్మకం, కథ మీద ఉన్న ఆత్మ విశ్వాసమే ఆ దర్శకనిర్మాతలతో ఓ పెద్ద సాహసానాకి పూనుకునేలా చేసింది. అయితే ఆ సినిమా వాళ్ల పరువు దక్కించడమే కాకుండా… తెలుగు సినిమా ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసింది. కొమ్ములు తిరిగిన సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఘనంగా శతదినోత్సవ వేడుకలు…
స్వాతిముత్యం సినిమా శతదినోత్సవ వేడుకలు 1986 జూన్ 20న వైభవంగా జరిగాయి. తెలుగు లలితా కళాతోరణంలో జరగాల్సిన ఈ ఉత్సవం భారీ వర్షం కారణంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌లోని దేవి 70 యం.యం. థియేటర్‌లో నిర్వహించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, బాలీవుడ్ దిగ్గజం రాజ్‌కపూర్, చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక పాల్గొన్న తొలి శతదినోత్సవ వేడుక ఇదే. సభాధ్యక్షులు రాజ్‌కపూర్ ప్రసంగిస్తూ… “ఈ సినిమా చూసిన నాకు మరచిపోలేని అనుభూతి కలిగింది. సినిమాలోని డైలాగ్స్ చాలా మట్టుకు అర్థం కాకపోయినా విశ్వనాథ్‌జీ ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో అర్థమైంది”అని ప్రశంసించారు. ముఖ్య అతిథి ఎన్టీఆర్ తన ప్రసంగంలో ఏడిద నాగేశ్వరరావు, విశ్వనాథ్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని దేశ,విదేశాల్లో వ్యాపింపచేసిందని కొనియాడారు.