Home ఎడిటోరియల్ తెలుగు జర్నలిజం మరో లోపం

తెలుగు జర్నలిజం మరో లోపం

telugu

తెలుగు జర్నలిజంలోని కొన్ని లోపాల గురించి తరచు చర్చ జరుగుతున్నది. ఆ చర్చ బయటి వారితోపాటు స్వయంగా జర్నలిస్టులు కూడా చేస్తున్నారు. చర్చ ఫలితంగా లోపాలు తొలుగుతుండకపోవచ్చు. కాని కనీసం వాటిని గుర్తించి చర్చించటం వరకు సంతోషించవలసిన విషయం. ఆ లోపాలు ఏమిటి, వాటి గురించి ఏమి చర్చిస్తున్నారు, అవి ఎందువల్ల పోవటం లేదు అనే వివరాలలోకి ఇక్కడ పోవటం లేదు. కాని అంతగా గుర్తించని, చర్చించని ఒక లోపం విషయం చూద్దాము. అది, విదేశీయ వ్యవహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం మన జర్నలిస్టులు సరిగా చేయకపోవటం. అందువల్ల రాతలో తప్పులు దొర్లటమే కాదు, నష్టాలు కూడా కలుగుతాయి. ఇందుకు మినహాయింపు అయిన జర్నలిస్టులు కొద్ది మంది మాత్రమే కన్పిస్తున్నారు.
విదేశీయ వ్యవహారాల ప్రాముఖ్యత గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. కాని ఆ విషయాలు తెలుసుకునేందుకు జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తోచటం లేదు. అవి ఎంత ముఖ్యమో తెలిసిన వారు కూడా ఆ ప్రయత్నం చేయటం లేదు. అదనపు ప్రయత్నాల మాట అట్లుంచి, కనీసం రోజువారీగా వెలువడే వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలనైనా ఇంగ్లీష్ పత్రికలలో చదువుతున్న వారు అతి తక్కువ. అందు కు బదులు చాలా స్థూలమైన పరిజ్ఞానాన్ని, ఒకోసారి అది కూడా లేనితనాన్ని, ఊహాగానాలను, సందర్భశుద్ధిలేని దేశభక్తిని ఉపయోగిస్తున్న వారే అధికంగా ఉన్నట్లు వివిధ తెలుగు పత్రికలలోని విదేశీ వ్యవహార సంబంధ వార్తలను గమనించినపుడు అర్థమవుతుంది. ఆయా వార్తలు, వ్యాఖ్యలు అనువాదమవుతున్న తీరు, వాటికి ఉపోద్ఘాతంవలె రాసే వ్యాఖ్యలు, ఇచ్చే శీర్షికలు, ఉపశీర్షికలు అన్నింటా ఇది ప్రతిఫలిస్తున్నది.
విదేశీ వ్యవహారాల వార్తలు, వ్యాఖ్యలు రెండు విధాలు. భారతదేశానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉండేవి ఒక విధమైతే, ఏ సంబం ధం లేనివి మరొక విధం. పైన పేర్కొన్న తరహా లోపాలు ఈ రెండింటిలోనూ కన్పిస్తాయి. భారత దేశానికి సంబంధం లేని వాటిలోనూ చాలా ముఖ్యమైనవి ఎన్నో ఉంటాయి. అవి ఒకోసారి ప్రపంచంలోని వేర్వేరు కీలక ప్రాంతాలను బాగా ప్రభావితం చేయగలవి కావచ్చు. అయినప్పటికీ తెలుగు పత్రికలు సర్వసాధారణంగా అసలు ఆ వార్తల జోలికిపోవు. జోలికి వెళ్లి తప్పులు రాయటం ఒక లోపమైతే, ఆ జోలికి వెళ్లకపోవటం కూడా లోపమే అవుతుంది. అటువంటి వార్తలు వేయకపోవటానికి కారణం స్థలాభావమని ఎవరైనా అనవచ్చు. ఒకోసారి నిజంగానే ఇతర వార్తలు, అడ్వర్టయిజ్‌మెంట్ల వత్తిడి వల్ల స్థలాభావం ఏర్పడవచ్చు. కాని, పత్రికను తేరిపార చూసినపుడు అటువంటి వత్తిడి లేని సందర్భాలలో కూడా ముఖ్యమైన అంతర్జాతీయ వార్తలు కన్పించకపోవడమంటే అందుకు రెండు కారణాలు ఉండి ఉంటాయి.ఒకటి, పత్రిక విధానలోపం. రెండు, డెస్క్ దగ్గరపని చేసేవారి పరిజ్ఞాన లోపం. ఇటువంటి స్థితి తరచుగా ఎదురు కావటమన్నది మొత్తం తెలుగు జర్నలిజపు లోపమవుతుంది.
భారత దేశంతో సంబంధంలేని అంతర్జాతీయ వార్తలకు సంబంధించి అట్లా జరిగితే అది కూడా నష్టమేగాని, కనీసం పాఠకులకు ప్రత్యక్ష నష్టం కాదు. సంబంధం ఉన్న వార్తలు, పరిణామాల విషయంలోనైతే ప్రత్యక్ష నష్టమవుతుంది. అటువంటి లోపాలు లేకుండా చూసుకొనకపోవటం జర్నలిజపు అతిపెద్ద లోపం. ఇక్కడ గుర్తించవలసింది ఒకటున్నది. రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు, వేర్వేరు సబ్జెక్టులకు, దేశానికి సంబంధించిన అంతర్గత సమాచారాలను సరిగా తెలుసుకుని రాయటంలోనూ లోపాలు దొర్లుతున్నాయి. కాని ఈ తరహా విషయాలలో పాఠకులలో తగినంతమందికి స్వీయపరిజ్ఞానం ఉంటుంది. ఒక పత్రిక కాకపోతే మరొక పత్రిక చూస్తారు. అందువల్ల, జర్నలిజానికి సంబంధించి ఆ లోపాలన్నవి లోపాలే అయినా, కనీసం ఆ లోటు తీరేందుకు పాఠకునికి ప్రత్యామ్నాయ అవకాశాలున్నాయి. విదేశీ సంబంధ వార్తల విషయంలో ఈ అవకాశం లేదు. ఎందుకంటే, అప్పుడప్పుడు మినహాయింపులను తప్పిస్తే అన్ని తెలుగు పత్రికలు, సాధారణ రూపంలో అట్లానే ఉంటున్నాయి. తెలుగుతోపాటు ఇంగ్లీష్ పత్రికలు కూడా చూసే అలవాటు ఉన్న వారికి మాత్రం సరైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటివారు ఆ వార్తలను బహుశా తెలుగు పత్రికలలో చదవకపోవచ్చు కూడా. చదివిన వారికి తేడా వెంటనే తెలుస్తుంది.
భారతదేశంతో నిమిత్తం గల విదేశీయ వార్తల విషయంలోనైతే ఉన్నట్లుండి అనేక తేడాలు కన్పిస్తాయి. అనువాదం చేసేటపుడు, శీర్షికలు ఇచ్చేటపుడు ప్రతి ఒక్క పదం కూడా దేశీ ప్రయోజనాలపేరిట దేశభక్తి కోణాన్ని సంతరించుకుంటుంది. అది కొన్ని సందర్భాలలో సహజం కావచ్చు. కాని అపుడు కూడా వాస్తవాల విస్మరణ, వక్రీకరణ, సౌకర్యవంతంగా ఉండే వాటిని తీసుకుని కొన్నిటిని కత్తిరించటం ఆమోదించదగిన జర్నలిజం కాబోదు.
ఇది కాకుండా ఒకోసారి, భారతదేశ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా కూడా పాశ్చాత్య న్యూస్ ఏజెన్సీలు, వ్యాఖ్యాతలు, ఇంగ్లీష్ పత్రికలు, ఛానళ్ల ప్రభావంతో కొన్ని ఇష్టాయిష్టాలు ఏర్పడుతుంటాయి. అందులో వాస్తవికత , చరిత్ర, హేతుబద్ధతవంటివి ఏవీ ఉండవు. అదంతా మన వార్తానువాదాల్లో, శీర్షికల్లో, ఛానల్ చర్చల్లో, పత్రికా వ్యాసాల్లో ప్రతిఫలిస్తుంటుంది. వీటన్నింటి ప్రభావం వల్ల సంపాదక లేఖలు కూడా పాఠకుల నుంచి అదే పద్ధతిలో వస్తుంటాయి.
బహుశా ఒక నిర్దిష్టమైన అంశాన్ని ప్రస్తావిస్తే ఇది కొంత అర్థం కావచ్చు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాకు సంబంధించి గత ఆరు మాసాల కాలంలో ముఖ్యమైన పరిణామాలు కొన్ని సంభవించాయి. ఈ రెండు దేశాలకు సంబంధించి అమెరికా శిబిరం పూర్తిగా ఉత్తర కొరియాకు వ్యతిరేకమైన వైఖరి మొదటి నుంచి తీసుకుంటున్నది. వారి ప్రకటనలు, చర్యలు, న్యూస్ ఏజెన్సీల వార్తలు, ప్రత్యేక కథనాలు, ఛానళ్ల వ్యాఖ్యలు అన్ని కూడా ఉత్తర కొరియాను ఒక రాక్షస దేశంగా చిత్రీకరిస్తుంటాయి. అందుకు ప్రత్యామ్నాయ భాషలో, దృక్కోణంతో ఇండియాకు ఏమీ రావు. మన ఇంగ్లీష్ పత్రికలు అవే వార్తలను తీసుకున్నా కనీసం అందుకు విలువలు లేని స్వంత వ్యాఖ్యలను అదనంగా జోడించవు.
శీర్షికలలో వక్రీకరణలు ఉండవు. వార్తల నుంచి తమకు నచ్చని భాగాలను తొలగించటం జరగదు. ఇటువంటివి అనేకం తెలుగు పత్రికలలో జరుగుతాయి. ఫలితంగా ఉత్తర కొరియా ఒక రాక్షస దేశంగా, అక్కడి నాయకత్వం ఒక రాక్షస నాయకత్వంగా తెలుగు పాఠకులకు ఆవిష్కారమవుతుంది. దానితో వారు అమెరికా విజయాన్ని కోరుకుంటారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
తెలుగు జర్నలిస్టుల విదేశీ వ్యవహారాల పరిజ్ఞానం సరిగా ఉన్నట్లయితే ఎటువంటి దురభిప్రాయాలు ఎవరి పట్లా లేకుండా వృత్తి విలువలతో తమ పని చేస్తారు. కొరియా వివాదపు నేపథ్య చరిత్ర, అమెరికా సామ్రాజ్యవాద చరిత్ర, కొరియా వివాదంలో వారి ప్రయోజనాల పాత్ర తెలిసినట్లయితే ఈ వార్తలను జర్నలిస్టులు చేసే విధానం మరొక విధంగా ఉంటుంది. అమెరికన్ ప్రభావం తమకు తెలియకుండానే ఎంత ఉందంటే, కనీసం ఈ సంవత్సరం జనవరితో ఆరంభించి ఉత్తర కొరియా వైపు నుంచి వరుసగా జరుగుతున్న సానుకూల పరిణామాలను పాజిటివ్‌గా చూసిరాసే ప్రొఫెషనలిజం కూడా తెలుగు పత్రికలలో అరుదుగా తప్ప కన్పించలేదు.
భారతదేశంతో ప్రత్యక్ష సంబంధం లేని వివాదం విషయంలోనే పరిస్థితి ఇది అయినపుడు, సంబంధం ఉన్న విషయాలలోనైతే ఇక చెప్పనక్కర లేదు. అసలు సమస్య మౌలికమైన వాస్తవాలు, సమాచారాలను తెలుసుకోక పోవటం. వాటిని వృత్తిపరమైన విలువలతో చూసి రాయకపోవటం. శీర్షికలతో, వ్యాఖ్యలతో ఉద్దేశపూర్వకమైన వక్రీకరణలు తేవటం. అందువల్ల విషయాలు పాఠకులకు సరిగా తెలియనపుడు, దేశ ప్రయోజనాలు ఏ విధంగా నెరవేరుతాయో, అది దేశభక్తి ఎట్లా అవుతుందో అర్థం చేసుకోవటం కష్టం. ఇందులో గమనించవలసింది ఒకటుంది. అదే విషయాన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసే తీరులో ప్రొఫెషనలిజం ఉంటుంది. సంపాదకీయాలలో, వ్యాసాలలో ఏమైనా రాయవచ్చుగాక. ఆ వీలు తెలుగు పత్రికలకు కూడా ఉంటుంది. కాని జర్నలిస్టులు తమ వీలును వార్తానువాదంలోనూ చూపటం తప్పకుండా పెద్దలోపమే. పైన అనుకున్నట్లు అందు కు కారణం విషయ పరిజ్ఞానాలు లేకపోవటం. అర్థ పరిజ్ఞానాలు, ఇతరేతర ఉద్దేశాలు ఎక్కువ కావటం. పాశ్చాత్య ఏజెన్సీలు, వ్యాఖ్యాతల ప్రభావాలు మితిమీరటం. వర్ధమాన దేశాల జర్నలిజానికి ఇది ఇంకాపోని వెనుకటి శాపమే.

టంకశాల అశోక్
9848191767