Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

తెలుగువారు సొంతం చేసుకున్న మళయాళీ నటి సుజాత

Sujatha1హుందాతనం నిండిన దక్షిణాది హీరోయిన్లలో సుజాత ఒకరు. ఆమె ఆలస్యంగా తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టినా…. తెలుగు సినీ అభిమానుల నుంచి మంచి నటిగా గుర్తుంపు తెచ్చుకుని, ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె ప్రసన్నవదనం, గాంభీర్యం, ఏ మాత్రం కష్టపడకుండా ముఖంలో భావాలు పలికించగల నేర్పు నటనపరంగా ఆమెకున్న గొప్ప వరాలు. జన్మతః మళయాళీ అయినప్పటికీ దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో నటించింది. తెలుగులో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో నటించిన మొదటి సినిమా ‘గోరింటాకు’ గొప్ప విజయం సాధించడంతో ఆ తరువాత గుప్పెడు మనసు (కె.బాలచందర్ దర్శకత్వంలో), సంధ్య సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. 80 దశకంలో తెలుగు సినిమా నిర్మాతలు సుజాతకు నీరాజనాలు పలికారు. ఎన్నో అవకాశాలు ఇచ్చి తెలుగు సినిమా తారగా ఓన్ చేసుకున్నారు. ఆవిడ మళయాళ నటి అంటే నమ్మలేనంతగా తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ తనే చెప్పేసుకుంది. ఆకట్టుకునే అందమైన రూపంతో పాటు తమ అక్కనో, అమ్మనో, చెల్లినో చూసినంతగా అభిమానులు ఆమెను ఇష్టపడ్డారు.
మొదటి సినిమా గోరింటాకులో శోభన్ బాబును ప్రేమించే వ్యక్తిగా, ఒక అమ్మాయి జీవితం కోసం తన ప్రేమను త్యాగం చేసిన డాక్టర్ గా నటించి అభిమానుల గుండెల్ని కొల్లగొట్టింది. ఈ సినిమాలోని ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పాట ఇప్పటికీ సరికొత్తగానే వినిపిస్తుంది. రచయితగా, శరత్‌బాబుకు భార్యగా ‘గుప్పెడు మనసు‘లో నటించి మరోసారి అభిమానుల మనసు దోచేసింది. ఇందులోని ‘నేనా పాడనా పాటా… మీరా అన్నది మాట’ మాటలతోనే ఓ పాట… అప్పట్లో అందరినీ ఆకట్టుకున్న గీతం ఇది. ఆ తరువాత కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహిళగా సంధ్య సినిమాలో నటించి త్యాగమూర్తి అన్న ముద్ర వేసుకుంది. ఈ సినిమా హిందీలో రాఖీ హీరోయిన్‌గా నటించిన ‘తపస్య’కు రీమేక్. ఈ చిత్రం సక్సెస్ సినిమాల డైరెక్టర్‌గా పేరుపొందిన కోదండ రామిరెడ్డి మొదటి సినిమా కావడం విశేషం. ఆ తరువాత ఆమెకు వచ్చిన పాత్రలన్నీ ఈ తరహాలోనే కనిపిస్తాయి. దాసరి నారాయణరావు ఆమె పేరుతోనే తీసిన ’సుజాత‘ సినిమా అప్పట్లో మహిళలను బాగా ఆకట్టుకుంది. ఇందులోని పాటలన్నీ చాలా హిట్టయ్యాయి. ’ఉంగరం పడిపోయింది… పోతేపోనీ…’ మోహన్‌బాబు, సుజాతల మధ్య చిత్రీకరించారు. ఈ సినిమాలో సుజాత ద్విపాత్రాభినయం చేయగా మరో హీరోగా మురళీ మోహన్ నటించాడు.
తెలుగులో ఆమె దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, దాసరి నారాయణరావు,, మురళీ మోహన్, మోహన్ బాబు, చంద్రమోహన్, చిరంజీవి, శ్రీధర్‌ల సరసన నటించింది. తమిళంలోనూ అందరు అగ్రహీరోలు శివాజీ గణేషన్, కమల్ హాసన్, రజనీకాంత్, అనంత్ నాగ్, విజయ్ కుమార్‌లతో చేసింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అంతులేని కథ’ సినిమాలోని జయప్రద పాత్రను తమిళంలో సుజాత (అవల్ ఒరు తొడార్ కథై-1974) చేసింది. మొదటి సినిమా మళయాళంలో తన 14 ఏట (1966) నటించింది. ఆమె 1971-72ల్లో సంవత్సరాల్లో మళయాళంలో పాతిక సినిమాల్లో నటించింది. మొత్తం తన సినీ కెరీర్‌లో 300 చిత్రాలకు పైగా తెలుగు, మళయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఇందులో 200 చిత్రాలు తమిళంలో చేయడం విశేషం. హీరోయిన్లు చాలా మంది ఓ పది పదిహేనేళ్ళు గ్యాప్ తీసుకుని తల్లి పాత్రల్లో మళ్ళీ దర్శనమివ్వడం చూశాం. కానీ ఈమె హీరోయిన్‌గా చేస్తూనే వయసు పై బడిన పాత్రల్లోకి దిగిపోయింది. తెలుగులో రంగప్రవేశం చేసినప్పటికే ఆమె వయసు పాతికేళ్ళు దాటేసింది (పెళ్ళయి, పిల్లలు కూడా పుట్టారట). అయినా ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడానికి గల కారణం నటనతో ఆకట్టుకోవడమే కాక తను నటించిన మొదటి చిత్రాలు వరుసబెట్టి విజయం సాధించడమే.
ఆమె ఎక్కువగా అక్కినేని నాగేశ్వర్‌రావు సరసన యువతిగానూ… అటు తరువాత ముసలి పాత్రల్లోనూ నటించింది. ఆయనతో నటించిన ఏడంతస్థుల మేడ (1980), అనుబంధం, మాధవయ్యగారి మనవడు, గురుశిష్యులు, జస్టీస్ చక్రవర్తి (1984), సూత్రదారులు (1990) ఎక్కువ శాతం హిట్ చిత్రాల లిస్టులో చేరిపోయాయి. శోభన్ బాబుతో పండండి జీవితం, వంశ గౌరవం, మురళీ మోహన్‌తో సుజాత, పసుపు పరాణి (1981), ఆశాజ్యోతి వంటి హిట్ సినిమాల్లో చేసింది. కృష్ణం రాజు, చిరంజీవిలతో ప్రేమతరంగాలు, చిరంజీవితో మరో సినిమా సీతాదేవి (1982)లో నటించింది. ఎన్టీఆర్ తో సర్కస్ రాముడు, దాసరి నారాయణ రావుతో ఎమ్మెల్యే ఏడు కొండలు (1983), సూరిగాడు (1992), మోహన్ బాబుతో ఎంఎల్‌ఎ యమ్‌ధర్మరాజులో, చంద్రమోహన్‌తో ప్రణయగీతంలో చేసింది.
తమిళ నటుడు రజనీకాంత్ కు ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అటు తరువాత బాబా సినిమాలో ఆయనకు తల్లిగా నటించింది. జయసుధ నటించిన ఇది కథ కాదు సినిమా తమిళంలో ’అవర్గల్’ గా విడుదలైంది. ఇందులో సుజాత హీరోయిన్‌గా చేయగా, తెలుగులో చిరంజీవి (విలన్) చేసిన పాత్రను తమిళ్‌లో రజనీకాంత్ చేశాడు.
సుజాత వెంకటేష్‌కు తల్లిగా నటించిన చంటి సినిమా ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమా. ఆశించినట్టుగా ఆమెకు ఈ సినిమాలో ఏ అవార్డు దక్కనప్పటికీ, 1997 లో వచ్చిన పెళ్ళి (నవీన్, మహేశ్వరి)చిత్రంలో సుజాత నటనకు గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం సుజాతకు కలైమామణి అవార్డునిచ్చి గౌరవించింది.
సుజాత పుట్టింది శ్రీలంకలో అయినప్పటికీ ఆమె తండ్రి జన్మస్థలం కేరళ, వృత్తిరీత్యా శ్రీలంకలో స్థిరపడ్డ ఆయన పదవీ విరమణ అనంతరం జన్మస్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలోనే సుజాతకు మళయాళంలో సినిమా అవకాశాలు వచ్చాయి. ఆమె జయకర్ హెన్రీని ప్రేమ వివాహం చేసుకుని కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉండి, అక్కడ ఇమడలేక తిరిగి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆమెకు ఒక అమ్మాయి, అబ్బాయి. ఆమె తన 59వ ఏట 2011, ఏప్రిల్ 6న గుండెపోటుతో మరణించారు. తెలుగులో సుజాత చివరి సారిగా శ్రీరామదాసు (2006) సినిమాలో నటించిన పోకల దమ్మక్క పాత్రకు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రశంసలు అందుకున్నారు.

– అన్నపురెడ్డి వనజ

Comments

comments