Home లైఫ్ స్టైల్ అందమా.. అందమా..

అందమా.. అందమా..

Buautiful-lady-images

మ్యాచింగ్ బట్టలు వేసుకునో, కాంట్రాస్ట్ కలర్స్ వేసుకునే, డిఫరెంట్ హైర్‌స్టయిల్‌తోనో అందరి దృష్టిని ఆకర్షించాలని, నలుగురు పొగుడుతుంటే ఆనందించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అలా చేయడం తప్పుకాదు. కానీ నిజానికి అందం ఎక్కడుంది? ఇదే అందం అనడానికి కొలమానం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఈ రోజు వరకూ దొరకలేదు. అందం అనగానే బాహ్య అందమా? ఆత్మిక అందమా అంటూ వివాదం చేయడానికి ఎందరో తయారవుతారు. చక్కగా ఉండాలని, పదిమందిలో భిన్నంగా కనబడాలని కోరుకోవడం నేరమేమీకాదు. అందుకు దోహదం చేసేందుకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు అంగట్లో ఉన్నాయి. స్పాల దగ్గర నుంచి సబ్బుల దాకా, ఆయిల్ బాత్‌ల నుంచి హెర్బల్‌జల్‌బాత్ దాకా అనేకం అందుబాటులో ఉన్నాయి. అందమైన ఆకారం కావాలంటే అందుకు తగ్గట్టుగా చర్మం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన చర్మం వల్లే కళాకాంతి వస్తాయి. బ్యూటీ స్కిన్ డీప్ అన్నారు కదా! చర్మం నిగారిస్తేనే అందం ఇనుమడిస్తుంది. చర్మం మెరవాలంటే డెడ్ స్కిన్ పోవాలి. దానికి మాయిశ్చరైజర్ల దగ్గర నుంచి ఆకురాయిల వరకు అనేక రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

చర్మంతోపాటే జుట్టుకూడా మెరవాలి. అంటే మంచి కండిషనర్ కలిగిన షాంపు వాడాలి. ఎన్ని విషయాలలో జాగ్రత్తపడినా లావు, సన్నం, తెలుపు, నలుపు బెడద ఉంటుంది. పొట్టివాళ్లు పొడుగ్గా కనబడడానికి నిలువుగీతల దుస్తులు లేదా చీరెలు వేసుకోవాలి. లావుగా ఉన్న వారు కూడా నిలువుగతల దుస్తులే వాడాలి. ప్లైన్ దుస్తులు వేసుకుంటే లావుపాటి వాళ్ళు మరింత లావుగా కనబడే అవకాశం ఉంది. అలాగే పొడుగువాళ్లు మరీ ఎబ్బెట్టుగా ఉండకుండా ఉండాలంటే అడ్డగీతలున్న దుస్తులు ధరించాలి. సన్నటి వాళ్ళు లావుగా కనబడాలన్నా ఇదే చిట్కా! ఎండాకాలం పెదవులు ఎండిపోకుండా ఉండడానికి లిప్‌గ్లాస్ వాడాలి. ఆకర్షణీయంగా కనబడడానికి డార్క్ కలర్స్ వేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. కానీ కాంప్లెక్స్‌ను దృష్టిలో పెట్టుకోకపోతే పెదాలకు వేసిన రంగులు ముఖసౌందర్యాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది. చర్మం రంగును బట్టి పెదాలకు వాడే రంగును ఎంచుకోవాలి. నలుపు రంగు వారు లేత రంగును, ఎరుపు రంగు వారు ముదురు రంగును వాడుకోవాలి. చామనఛాయ రంగువారు మిక్స్‌డ్ షేడ్ లిప్‌స్టిక్ వేసుకోవాలి. మెడలో వేసుకునే గొలుసులు మెడకే కాదు మొత్తంగా ప్రథమార్థ శరీరానికి వన్నె తెస్తుంది. సన్నగొలుసులు వాడడం ఫ్యాషన్‌గా ఉన్నా పార్టీవేర్‌గా మాత్రం పెద్దపెద్ద నగలనే వాడుతున్నారు. ఆ మధ్య ఏంటిక్ షేడ్ ఉన్న బంగారు గొలుసులు వాడకం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ బ్రయిట్ నగలనే వాడుతున్నారు.

రవ్వల గాజులు గతంలో ఫ్యాషన్ అయినా ఇప్పుడు డైమండ్ గాజులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎనామిల్ నగలు వాడేవారు కానీ ఇప్పుడు ఎవ్వరూ ప్రిఫర్ చేయడంలేదు. పెద్దగా డబ్బు ఖర్చుపెట్టలేని వారు వన్‌గ్రామ్ గోల్డ్ నగలు పెట్టుకుంటున్నారు. వాటిలోనూ కళ్ళు చెదిరే డిజైన్‌లు రావడంతో సౌందర్యదాహాన్ని వాటిద్వారా తీర్చుకుంటున్నారు. గతంలో మడమ ఎత్తుగల చెప్పులు వాడేవారు.  ఆ తర్వాత ఫ్లాట్స్ వచ్చాయి. ఇప్పుడు పెన్స్ వస్తున్నాయి. అయినా మన రోడ్లకు, మన నడక తీరుకు పెన్స్ అంతగా ఉపయోగపడేవికావు. అసలు హైహీల్సే వేయవద్దని అప్పట్లో వైద్యులు చెప్పేవారు. వీటి వల్ల ఒంటి భారమంతా నడుము మీద పడి అక్కడ కండరాలు పెరిగి ఆకారం చెడిపోతుందని హెచ్చరించేవారు. కానీ ఈ హెచ్చరికలు ఫ్యాషన్ క్రేజు ఉన్న వారికి అంతగా ఎక్కలేదు. కొందరు మాత్రం మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని కంప్లయింట్ చేసేవారు. మొత్తం శరీరాన్ని ఎంత అందంగా డిజైన్ చేసుకున్నా కళ్ల అందం ముందు అన్నీ దిగదుడుపే! ఐబ్రోస్‌ను షేప్ చేసుకోడం, కంటిరెప్పలకు ఐలాష్ వేసుకోవడం అత్యవసరం.

ఐలైనర్ వాడితే కంటి డిజైన్ మరింత బాగుంటుంది. ముఖానికి రంగులువేసే పద్ధతి కూడా ఈ మధ్య పెరిగింది. దిగువ తరగతుల ఆడపిల్లలు కూడా అకేషనల్‌గా పార్టీ టైముల్లో బాగా తయరవాలని సరదాపడుతున్నారు. ఎవరైనా పొగిడితే సంబరపడుతున్నారు. అందం సహజంగా ఉంటే అదృష్టం అనుకునే రోజులు పోయాయి. ఎలా ఉన్నా అందంగా కనబడే రోజులు వచ్చాయి. కనుక లావు, సన్నం, నలుపు, తెలుపు వంటివేమీ పట్టించుకోకుండా హాయిగా తయారవ్వండి. ఆనందంగా ఉండండి. అందంగా తయారైతే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాని వల్ల చురుకు, ఉత్సాహం వంటివి వాటంతట అవే జోడి కడతాయి. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. దాన్ని ఎంజాయ్ చేసే మనం కూడా బ్యూటీఫుల్‌గానే ఉండాలి కదా!