Home దునియా మన షెల్లీ దేవులపల్లి

మన షెల్లీ దేవులపల్లి

Devulapalli-Krishnasastri

భావ కవిత్వాన్ని వాడుకలోకి తీసుకొచ్చిన వ్యక్తి , సినిమా పాటల్లో కూడా భావ కవిత్వాన్ని అధికంగా జొప్పించిన కవి, తేటతెలుగు పదాలతో అద్భుతమైన సినిమా పాటలు అందించిన మన షెల్లీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆత్మ తృప్తి కోసం అనేక పాటలు రాసేవారాయన. భావ కవితా ప్రచారకుడుగా, రాగ భరితంగా అందరి కవుల పాటలు పాడే వ్యక్తిగా , ఉపన్యాసాలతో వూరించే దిట్టగా దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రికి పేరుండేది. ఆకాశవాణి ( ఆల్ ఇండియా రేడియో) లో పనిచేస్తూ అనేక సంగీత రూపకాలు, లలిత గీతాలు, వచన కవితలతో శ్రోతలను తన్మయుల్ని చేసేవారు. శ్రీశ్రీతో ప్రేరణ చెంది అనేక మంది కవితా వ్యాసంగంలోకి అడుగిడితే, కలం పట్టిన ప్రతి కవీ కృష్ణశాస్త్రి కవత్వాకర్షణకు లోనైనవారే అని శ్రీశ్రీ తరచూ ప్రస్తావించేవారంటే విశేషమే కదా!

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వద్ద గల చంద్రపాలెంలో సంస్కృత పండితులుగా, కవులుగా పేరున్న తమ్మన శాస్త్రి దంపతులకు 1897 నవంబర్ 1న జన్మించారు. పెద తండ్రి సబ్బరాయశాస్త్రి , తండ్రి కలిసి దేవులపల్లి కవులుగా పేరొందినవారు. కృష్ణశాస్త్రి ఇద్దరిలోని జ్ఞానాన్ని ఆకళింపు జేసుకుని పదవ ఏడు రాకుండానే పద్యాలు రాసేవారు. విజయనగరం కళాశాలలో బి.ఏ., పూర్తి చేసాక ఉపాధ్యాయుడుగా, కాకినాడ పిఆర్ కళాశాలలో ట్యూటర్‌గా పనిచేశారు. 1929లో కలకత్తాలోని శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్‌తో జరిపిన ముచ్చట్లతో కృష్ణశాస్త్రి కవితా ధోరణిలో చాలా మార్పులు వచ్చాయని సన్నిహితులు చెప్పేవారు. హరిజనోద్ధరణకు కృషి చేశారు. బ్రహ్మసమాజం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ సమాజం వారి కోసం రాసిన పాటల్లో జయము జ్ఞాన ప్రభాకరా జయము కాంతి సుధాకరా…అనే గీతం ఆ సమాజం ప్రార్థనా గీతం అయింది.

అష్టావధానంతో పదహారవ ఏటనే అలరించారు. కృష్ణపక్షం కావ్యం 1925లో విడుదలైన తర్వాత ప్రశంసలే ప్రశంసలు. కన్నీరు ఖండకావ్యం భార్య మృతి తర్వాత వెలువరించారు. ప్రవాసము, ఊర్వశి, శర్మిష్ఠ, కృష్ణాష్టమి, ధనుర్దాసు, గౌతమి, క్షీరసాగర మథనం, విప్రనారాయణ, బహుకాల దర్శనం, పుష్పలావికలు ఇలా పలు రచనలతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డికి 1941లో పరిచయమయ్యారు. బి.ఎన్. రెడ్డి కూడా శాంతినికేతన్‌లో కొంతకాలం వుండి ఆలోచనల్లో పరిపూర్ణత సాధించారు. కృష్ణశాస్త్రి భావ పటిమ గుర్తించి సినీరంగంలోకి తీసుకురావాలని అనేక మార్లు ప్రయత్నించారు బి.ఎన్.రెడ్డి. ఆల్‌ఇండియా రేడియోలో పనిచేసే, స్వతంత్ర ప్రతిపత్తి కోరుకునే కృష్ణశాస్త్రి అయిదేళ్ల పాటు ప్రతిఘటించారు. పట్టబట్టిన బి. ఎన్ .రెడ్డి మద్రాసుకు రప్పించి, తను కష్టపడుతూ ఆయననూ కష్టపెట్టి మల్లీశ్వరి చిత్రానికి రచన చేయించారు.

సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో ఆ చిత్రంలోని కృష్ణశాస్త్రి రాసిన అన్ని పాటలూ ఆణిముత్యాలే అయ్యాయి. ఇప్పటికీ అదే ప్రాశస్తాన్ని పొందుతున్నాయి. ఇక ముందూ అలాగే గుర్తుండిపోయే తేటతెలుగు పాట అని ఆ చిత్రానికి ఆయన రాసిన సంభాషణలూ అద్భుతమే. కృష్ణశాస్త్రి ఆ తర్వాత రాసిన అనేక పాటలతో కూడా కావ్యగౌరవం సమకూరడం సినీ చరిత్రలో ఒక విశేషం. ఉత్తమ అభిరుచితో చిత్రాలు తీయాలనే సంకల్పంతోనే దర్శకనిర్మాతగా మారి వాహిని సంస్థని రూపొందించిన బి.ఎన్.రెడ్డి పట్టుబట్టి కృష్ణశాస్త్రి తో సినిమాలకు రాయించాలని 1941 నుంచి ప్రయత్నిస్తే 1951తో చివర్లో మల్లీశ్వరి చిత్రం విడుదలై పదేళ్ల బి.ఎన్.రెడ్డి శ్రమ ఫలించి ప్రేక్షకులకు శ్రోతలకు కవులకు అద్భుత రసానుభూతిని కలిగించాయి. మొదటి చిత్రంతో అంతటి పేరు ప్రతిష్టలు రావడం రచియితల్లో కృష్ణశాస్త్రికే దక్కింది.

భక్తిగీతాలు రాసినా , ప్రణయ గీతాలు రాసినా, విరహగీతాలు రచించినా విషాద గీతాలు పలికించినా దేశభక్తి గీతాలు నిర్మించి, ప్రకృతి అందాలు పలికింపజేసినా చిన్ని చిన్ని పదాల్లో పెద్ద అర్థాలను , అలౌకిక ఆనందాన్ని కలిగించేలా రాయడమే కృష్ణశాస్త్రిలోని ప్రత్యేకత. అందుకే ఆయన పలువురు కవులకు , సినీ దర్శకులకు ప్రియ బాంధవుడు, ఆరాధనీయుడు అయ్యారు. మొత్తంమీద ఆయన రాసినవి 75 సినిమాలకే. అవి కూడా అన్ని కలిపి 170 పాటలే. వీటిలో 95 శాతం పాటలు ఆణిముత్యాలే. మల్లీశ్వరి తర్వాత జెమినీ వారి రాజీ నా ప్రాణం, నాగయ్య నిర్మించిన నా యిల్లు, నరసూ సంస్థ నిర్మించిన రాజగురువు ఇలా అతి తక్కువ చిత్రాలకు మాటలుకూడా రాసి ఆ తర్వాత పాటలకూ, రేడియోకు పరిమితమయ్యారు. కనిపించిన చిన్న చిన్న కాగితాల మీద కూడా గుర్తుకొచ్చిన భావన రాసేసి జాగ్రత్త పెట్టుకోడం, తప్పనిసరై రాసే సమయం లేకుంటే , నోటితో చెబుతూంటే బాలాంత్రపు రజనీకాంతరావు, కురిమిళ్ల వెంకటరావు వంటివారు వాటిని రాసి రేడియో ప్రోగ్రాంకి అందేలా చేసేవారు. ఏదో బెదురు, భయం, వల్లమాలిన బద్ధకం తనకు ఉండేవని అందరితో గమ్మున కలవనీకుండా ఇవి అడ్డుపడేవని, జమీందారీ మనుష్యుల సహవాసం కూడా ఇందుకు కారణమై ఉంటుందని కృష్ణశాస్త్రి పేర్కొనేవారు. బెజవాడ గోపాలరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, ఎం.ఆర్. అప్పారావు, ఎస్.బి.పి. పట్టాభి రామారావు, పాలగుమ్మి పద్మ రాజు , కాటూరి వెంకటేశ్వరరావు, దొడ్ల రామచంద్రారెడ్డి, బాలాంత్రపు నళినీకాంతరావు ఇలా ఎందరో ప్రముఖులకు ఆత్మీయ మిత్రుడుగా కొనసాగారు కృష్ణశాస్త్రి.

పాటైన కుశల ప్రశ్నలు
కవిగా, ఉపన్యాసకుడుగా,గాయకుడుగా ఆకట్టుకునే ఆయన కంఠానికి 1964 ఏప్రిల్‌లో బొంగురుదనం వచ్చింది. గొంతు సవరించుకుంటే సరిగా రాలేదు. డాక్టర్ పరీక్షలతో గొంతు క్యాన్సర్‌గా తేలడంతో ఆపరేషన్ చేసి గొంతులోని స్వరపేటికను తొలగించడం జరిగింది. ఇక అప్పటినుంచి ఏది చెప్పాలన్నా కాగితం మీద రాయడం ద్వారానే బయటపడేవి. ఇలా కాగితం మీద రాసిన కుశల ప్రశ్నయే పాటకు పల్లవని భ్రమించిన చక్రవర్తి బలిపీఠం చిత్రానికి ట్యూన్ చేసేయడం అది హిట్ కావడం విశేషం. ఏం రాయాలా అని తర్జనభర్జన పడుతూంటే మిత్రలెవరో వస్తే కుశలమా? అని మళ్లీ రాసారు. మనసు నిలువకున్నది ..పాట రాయలి ఇలా రాగా మిత్రుడితో కబుర్లు రాసి ఆ ప్యాడ్ అక్కడే వదిలి రికార్డింగ్ థియేటర్ నుంచి మిత్రుడితో బయటకు వచ్చారు. సంగీత దర్శకుడు చక్రవర్తి టీ బ్రేక్‌లో ఆ కాగితం చూసి పల్లవి అనుకుని కుశలమా నీకు కుశలమా..డ్యూయెట్‌ని ట్యూన్ చేసేశారు. దాసరి నారాయణరావు ప్రభృతులు ట్యూన్‌కి ఫిదా అయిపోవడంతో మిగతా వాక్యాలను తప్పని సరై రాయాల్సి వచ్చింది కృష్ణశాస్త్రికి. ముసలితనం, దానికి మూగదనంతోడు కావడం భయంకరం. శిథిల మందిరంలో అంధకారం వంటిది అని తలచి కాగితం మీద పెట్టేవారు. బాత్‌రూమ్‌లో స్నానానికి అత్యధిక సమయం కేటాయించడానికి ఇష్టపడేవారు. ఆయనకు మంచి భావనలు తన పాటలకు అక్కడే తోచేవి.

మనసున మల్లెల మాలలూగెనె..ఔనా నిజమేనా…కోతీ బావకు పెళ్లంట..పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి…ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు…ఎందుకే నీకింత తొందర…వంటి పాటలు మల్లీశ్వరికి కీర్తిని తెచ్చాయి. నీవుండేదా కొండపై నా స్వామి…(భాగ్యరేఖ),ఏమి రామకథ శబరీ…( భక్త శబరి) . ఘనా ఘనా సుందరా కరుణారస మందిరా ..(భక్తతుకారాం), ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి..(ఏకవీర), ఇది మల్లెల వేళయనీ…మేడంటే మేడాకాదు..(సుఖదుఃఖాలు), చుక్కలు పాడే శుభమంత్రం…(కళ్యాణ మండపం). మాట చాలదా మనసు చాలదా..( మట్టిలో మాణిక్యం), నేలతో నీడ అన్నది ..(మంచి రోజులు వచ్చాయి), నాపేరు బికారి నా దారి ఎడారి..( శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్),మావి చిగురు తినగానే …(సీతామాలక్ష్మి), గట్టుకాడ ఎవరో…., పగలైతే దొరవేరా…(బంగారు పంజరం), నీలమోహన రారా…(డాక్టర్ ఆనంద్), చీకటి వెలుగులు కౌగిటిలో …(చీకటివెలుగులు), ఆకులో ఆకునై…, ముందు తెలిసెనా ప్రభూ…. (మేఘ సందేశం), గోరింట పూసింది కొమ్మా లేకుండా..(గోరింటాకు), ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..(కార్తీక దీపం), పాడనా తెలుగు పాట పరవశమై…(అమెరికా అమ్మాయి) ఇలా ఎన్నో రసగుళికలు. ఉండమ్మా బొట్టుపెడతాలో రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా….చుక్కలతో చెప్పాలని…అడుగడుగున గుడి వుంది…శ్రీశైల మల్లన్న శిరసొంచేనా…గంగమ్మారా…చాలులే నిదురపో జాబిలికూనా…పాటలన్నీ రసరమ్మాలే. 1980 ఫిబ్రవరి 24 న కృష్ణశాస్త్రి దివికెగిసారు. అది విన్న శ్రీశ్రీ తెలుగుదేశపు నిలువుటద్దం బద్ధలైంది. వసంతం వాడిపోయింది. మన షెల్లీ మరణించాడు అని బాధపడ్డారు. కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కృష్ణశాస్త్రికి తెలుసు అని తిలక్, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని చలం, కొంతమందిది యువత కొంతమందిది నవత కృష్ణశాస్త్రిది కవిత అని ఆరుద్ర వివిధ సందర్భాలతో ప్రస్తుతించారు. (నవంబర్ 1న దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి) 

-వి.ఎస్. కేశవరావు, 9989235320