Home తాజా వార్తలు కష్టాలను అధిగమించి నంబర్ వన్‌గా..

కష్టాలను అధిగమించి నంబర్ వన్‌గా..

Telugu Valor Reasons To Celebrate Microsoft Success

 

మైక్రోసాఫ్ట్ విజయం వెనుక తెలుగు తేజం కృషి

న్యూయార్క్: అమెరికా మార్కెట్లలో శుక్రవారం ఓ సంచలనం నమోదైంది. ఎనిమిదేళ్లలో తొలిసారి మైక్రోసాఫ్ట్ సంస్థ తన పోటీదారయిన యాపిల్ సంస్థకన్నా అత్యధిక విలువతో వారాన్ని ముగించింది. గత వారమంతా కూడా ఈ రెండు సంస్థల షేర్లు నువ్వా, నేనా అన్నట్లుగా తమ మార్కెట్ విలువను పెంచుకుంటూ పోయాయి.అయితే శుక్రవారం చివర్లో ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ యాపిల్‌ను దాటేసింది. దీంతో వారంలో ఆ సంస్థ విలువ దాదాపు 110 బిలియన్ డాలర్లు పెరిగి 851.2 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో యాపిల్ విలువ 847.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దాదాపు పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ పూర్వ వైభవాన్ని అందుకుంది. ఈ ఘనత వెనుక తెలుగు తేజం సత్య నాదెళ్ల రచించిన వ్యూహాలు, కృషి ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

గత 12 నెలల్లోనే కంపెనీ విలువ 30 శాతానికి పైగా పెరిగిందంటే సత్య నాదెళ్ల వ్యూహ చతురతను అర్థం చేసుకోవచ్చు.2010లో మైక్రోసాఫ్ట్ అత్యధిక కష్టాలను ఎదుర్కొంది. కొత్తగా వచ్చే టెక్నాలజీ మార్కెట్‌ను కొల్లగొట్టడంలో విఫలమైంది.2012లోనైతే అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది.మరోపక్క సరికొత్త ఉత్పత్తులతో యాపిల్ దూసుకు పోయింది. ఐ ఫోన్ రాకతో యాపిల్ స్వరూపమే మారిపోయింది. 2014లో అప్పటి మైక్రోసాఫ్ట్ సిఈఓ పదవినుంచి స్టీవ్ బామర్ వైదొలిగారు. సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు. సిఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే నాదెళ్ల మైక్రోసాఫ్ట్ వ్యాపారంలో లోపాలను గుర్తించి సరిచేయడం మొదలుపెట్టారు. వ్యాపారాన్ని అత్యధిక లాభాలు వచ్చే రంగంవైపు మళ్లించారు. అప్పటివరకు అనుబంధ వ్యాపారంగా మాత్రమే ఉండిన క్లౌడ్ రంగంపై దృష్టి పెట్టారు. దీంతో ఏడాదిలోపే ఆ రంగంలో మైక్రోసాఫ్ట్ వాటా రెట్టింపై 13 శాతానికి చేరుకుంది.

ఈ దశలో మైక్రోసాఫ్ట్ తన ఆయుధాలకు పదును పెట్టింది. కీలకమైన ఆఫీసు అప్లికేషన్‌కు క్లౌడ్ వెర్షన్‌గా ‘ఆఫీస్ 365’ను తీసుకు వచ్చింది.ఇది గూగుల్ యాప్‌కు విపరీతమైన పోటీగా తయారైంది. మరోపక్క వ్యాపారంతో పాటే ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క ఏడాదిలోనే ఆదాయం 15 శాతం అంటే110 బిలియన్ డాలర్ల ఆదాయం పెరిగింది.సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టిన ఏడాదికే మైక్రోసాఫ్ట్ నష్టాలొస్తున్న ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలికింది. యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి దిగ్గజాలతో ఈ రంగంలో పోటీ పడేవదుకు ఆసక్తి చూపలేదు. దీనివల్ల మైక్రోసాఫ్ట్‌పై 7.6 బిలియన్ డాలర్ల భారం పడింది.7,800 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది కూడా.

మైక్రోసాఫ్ట్ కేవలం విండోస్ సాఫ్ట్‌వేర్‌నే నమ్ముకుని వ్యాపారం చేయడం కష్టమని నాదెళ్ల గ్రహించారు. దీంతో మైక్రోసాఫ్ట్ యాప్స్‌ను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యర్థులకు చెందిన యాపిల్ మాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా పని చేయడం విశేషం. ఇలా సత్య నాదెళ్ల తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సరయినవేనని ఈ నాడు మైక్రోసాఫ్ట్ షేరు విలువే చెబుతోంది. యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల షేర్లు కుదేలవుతూ ఉండగా ఆ సంస్థ షేరు ఏడాదిలో దాదాపు 30 శాతంపెరిగింది.

Telugu Valor Reasons To Celebrate Microsoft Success

Telangana Latest News