Home ఖమ్మం గుడి లేని దైవం ‘అమ్మ’

గుడి లేని దైవం ‘అమ్మ’

Motherఖమ్మం కల్చరల్ : ’అమ్మ అన్నది కమ్మని మాట…అది ఎన్నెన్నో జన్మల మమతల మూట’ అని ఒక సినీ కవి అమ్మ గొప్పదనాన్ని ఏనాడో చెప్పాడు. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు కానీ, అమ్మ లేడనువాడు అసలే లేడని కూడా అదే కవి చెప్పాడు. ఈ చరాచర సృష్టిలో ప్రతీ జీవికి అమ్మ ఉంటుంది. అంతేకాదు ప్రతీ జీవి జీవితం తన అమ్మతో కనెక్ట్ అయి ఉంటుంది. అమ్మలేని ప్రపంచాన్ని ఊహించటం ఎంత కష్టమో అందరికీ తెలుసు. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మను భగవంతుడి ప్రతిరూపంగా పేర్కొంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గుడి లేని దైవం…అమ్మ. అలాంటి అమ్మను మరిచిన వాడు మరణించినవాడితో సమానమంటారు. ఈ సృష్టిలో అందమైనది ఏదైనా ఉంది అంటే అది అమ్మ నవ్వే. అమ్మ అంటే రేపటి మన భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడకు రాలేక అమ్మను సృష్టించాడని మన వేదాలు చెప్తున్నాయి. ముస్లింలు దైవంగా భావించే పవిత్ర ఖురాన్‌లో కూడా స్వర్గం ఎక్కడ ఉందీ అంటే అమ్మ పాదాలకింద ఉందనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచం మొత్తం ఒక వైపు, అమ్మ మరో వైపు ఉంటే అమ్మ వైపే ఒరిగేను అని డాక్టర్ సి.నారాయణరెడ్డి తన గజల్‌లో అమ్మ గొప్పదనాన్ని ఏనాడో చాటిచెప్పాడు. స్వార్దం తెలియని కనులు, మోసం తెలియని మనసు అమ్మది. తన కోసం ఆలోచించక, తనకోసం ఏదీ దాచుకోక మన సంతోషాన్నే తన సంతోషంగా భావించే ఒకే ఒక్క దేవత అమ్మ. మనందరికీ ఈ జన్మలో దైవాన్ని చూసే భాగ్యం తల్లికి బిడ్డగా పుట్టడం. అమృతం పొందిన భాగ్యం అమ్మ పాలను సేవించడం. అంతటి మహత్తరమైనది అమ్మ. ఈ మదర్స్‌డే రోజు అమ్మను సంతోషంగా ఉంచడమే మన పని. ఆమె కోసం ఈ రోజు కానుకలు, బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కడవరకు ప్రేమగా చూసుకుంటానన్న భరోసా ఒక్కటి చాలు. అదే అమ్మ బుణం కొంతైనా తీర్చుకోవటానికి మనకు లభించే గొప్ప వరం…అమ్మలందరికీ ’మదర్స్‌డే’ శుభాకాంక్షలు.

Templeless Goddess Mother