Home వరంగల్ టెన్షన్…టెన్షన్…

టెన్షన్…టెన్షన్…

war

*ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మందుపాతరతో జవాన్‌లను మట్టుబెట్టిన మావోయిస్టులు
*మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్న ప్రత్యేక పోలీసు బలగాలు
*ఇటు పోలీసులు, అటు నక్సల్స్ మధ్యన నలుగుతున్న ఆదివాసీ గూడాలు

మన తెలంగాణ/వరంగల్‌బ్యూరో : తెలంగాణ -చత్తీస్‌గఢ్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్నది. పోలీసులకు, మావోయిస్టుల మధ్యన యుద్ధం జరుగుతోంది. మార్చి 2న  తెలంగాణ సరిహద్దులోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం శివారులోని తడపలగుట్ట, పూజారి కాంకేడ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కమాండో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌గా ప్రతీకారం తీర్చుకుంటామని సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ హెచ్చరిక చేసిన విషయం కూడా తెలిసిందే. ఎన్‌కౌంటర్ అనంతరం చత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణలో కొన్ని వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరిని హతమార్చారు. తాజాగా మంగళవారం చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ జవాన్‌లు ప్రయాణిస్తున్న వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్‌లు ఆర్‌కెఎస్ థామస్, అజయ్ కృష్ణ యాదవ్, మనోరంజన్, జితేంద్రసింగ్, శోబిత్ కృష్ణ శర్మ, లక్ష్మణ్, మనోజ్ సింగ్, ధర్మేంద్రసింగ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు జవాన్‌లో తీవ్రంగా గాయపడ్డారు.
– మావోయిస్టుల కోసం జల్లడపడుతున్న ప్రత్యేక బలగాలు
గొల్లపల్లి ఘటనతో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ కమాండోలు, సిఆర్‌పిఎఫ్ జవాన్‌లతో కూడిన ప్రత్యేక పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం అడవులను జల్లడపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత పల్లెల్లో, ఆదివాసీ గూడాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల సంచారంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే భయాందోళనలో ఆదివాసీ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం పల్లెల్లో ఇంటింటి సోదాలు చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో గూడాలపై బడి పోలీసులు నానా భీభత్సం సృస్టిస్తున్నారు. మాజీలను, సానుభూతిపరులను పోలీసు స్టేషన్‌లకు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారు. మరోవైపున ఇన్‌ఫార్మర్లను టార్గెట్ చేసి మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే భయం గిరిపుత్రులను వెంటాడుతోంది.
– గోదావరి తీరంలో డేగకళ్లలో సోదాలు
తెలంగాణ- చత్తీస్‌గడ్ సరిహద్దులోని దండకారణ్యంలో యుద్ధవాతావరణం నెలకొనడంతో మావోయిస్టులపై తీవ్రమైన నిర్బంధం పెరిగింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఆయుధాలతో సహా 20 మందికిపైగ మావోయిస్టులు ఇటీవలనే పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులను బలహీనపరిచే చర్యలకు పోలీసులు పూనుకుంటున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. కాలినడకన గోదావరిని దాటే ప్రయత్నం చేస్తున్నారు. చత్తీస్‌గడ్‌లో పూర్తిగా నిర్బంధంతోపాటు నిరంతరం కూంబింగ్‌లతో అడవులను జల్లడపడుతుండంతో మావోయిస్టులు గోదావరి తీరాన్ని దాటి వస్తారనే ఉద్ధేశ్యంతో గోదావరి తీరం పొడవునా పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. భద్రాచలం, ఏటూరునాగారం వద్ద గోదావరిపై ఉన్న బ్రిడ్జిల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలను, సోదాలను చేస్తున్నారు.