Home ఎడిటోరియల్ స్త్రీలకు ఏదీ రక్షణ

స్త్రీలకు ఏదీ రక్షణ

Terrific harassment on girls, disturbing the country

భారతదేశం తన బాలికలు, మహిళలతో యుద్ధం చేస్తున్నది. బాలికలపై భయంకరమైన వేధింపులు, మత్తు మందుల ప్రయోగం, హింస, మానభంగం గాధలు దేశాన్ని కలవరపెడుతున్నా యి. బాలికలకు పునరావాసం కలుగజేసి, గౌరవప్రదమైన జీవితం గూర్చి నేర్పాల్సిన షెల్టర్ హోమ్స్ (ఆశ్రయ గృహాలు) నీతిభ్రష్టులైన పురుషులకు వ్యభిచార గృహాలుగా మారాయి. 30 మందికిపైగా బాలికలను నాలుగేళ్లకుపైగా చిత్రహింసలు పెడుతున్న, మత్తు ఎక్కిస్తున్న, లైంగిక దాడులకు గురిచేస్తున్న ముజఫర్ పూర్ (బీహార్) గాథ అతిభయానకం. వారిలో ఏడేళ్ల మూగబాలిక కూడా ఉంది. ఈ ఘోరకృత్యాలకు పాల్పడిందెవరు? రాజకీయంగా సంబంధాలు కలిగిన బ్రజేశ్ ఠాకూర్ (హంటర్ వాలె అంకుల్ అని అతని మారుపేరు) అతడి తొత్తులు.

ముజఫర్‌పూర్ ఘోరకలి పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తుండగానే ఉత్తరప్రదేశ్‌లోని దియోరియాలో మరో షెల్టర్ హోంలో ఆశ్రితులను శీలహరణానికి గురిచేస్తున్న బాధామయ గాథ బయటపడింది. లైసెన్స్ లేకుండా సంవత్సరంపైగా నడుపుతున్న షెల్టర్ హోం నుంచి 10 ఏళ్ల బాలిక తప్పించుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చి ‘హారర్ హోం’ కథలు చెప్పింది. “బాలికలను రాత్రిళ్లు తెలుపు, నలుపు, ఎరుపు రంగు కార్లలో తీసుకెళతారు. తెల్లవారు ఝామున వెనక్కి తెస్తారు…. వారు మాట్లాడలేనంతగా భయపడుతుంటారు, పగలంతా కుమిలికుమిలి ఏడుస్తుంటారు.” యుపి ప్రభుత్వ మహిళ, శిశు సంక్షేమశాఖ 2017 జులైలో లైసెన్స్ సస్పెండ్ చేసినప్పటికీ ఒక స్వచ్ఛంద సంస్థ అక్రమంగా దాన్ని నిర్వహిస్తుండటం దిగ్భ్రాంతికరం. ఆర్థిక అక్రమాలకుగాను ఆ సంస్థపై సిబిఐ నివేదికతో లైసెన్స్ రద్దు అయింది. అందులోని 24 మంది బాలికలను రక్షించారు, 18 మంది జాడలేదు.

ముజఫర్‌పూర్, దియోరియ షెల్టర్ హోంల యజమానులు బ్రజేశ్ ఠాకూర్, గిరిజా త్రిపాఠిలను అరెస్టు చేశారు. వారి ఘోరమైన నేరం నుంచి అది వారిని నిర్దోషులను చేస్తుందా? వారికి ఎటువంటి శిక్ష ఇవ్వాలి? బెయిల్‌పై విడుదలకావటం, కనీసం ఓ 20 ఏళ్లపాటు కేసు దేకటం ద్వారా “చట్టం తన క్రమం అది తీసుకుంటుందా?” ప్రభుత్వాల చర్య షరా మామూలుగా బీహార్ ప్రభుత్వం తమ మహిళా, శిశు మంత్రిణి చేత రాజీనామా చేయించింది, రాష్ట్ర బాలల సంరక్షణ విభాగానికి చెందిన అరడజను అధికారులను సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యకు ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో డియోరియా జిల్లా మేజిస్ట్రేట్‌ను బదిలీ చేసింది. రెండు ప్రభుత్వాలు తమ విధి నిర్వహించాయి. చేతులు కడిగేసుకున్నాయి! మన నగరాలను, పరిసరాలను మహిళలకు సురక్షితం చేయటంలో, వారికి రక్షణ ఇవ్వటంలో వారందరూ సమష్టిగా దారుణంగా విఫలమైనారు.

ఈ రెండు ఘటనలు పురుగుల పెట్టె తెరిచాయి. ఇతర యుపి షెల్టర్ హోంలపై అధికారుల దాడుల్లో ప్రతాప్ ఘర్‌లో 32 మందిలో 26 మంది మహిళలు కనిపించటం లేదు. అష్టభుజి నగర్‌లో 17 మంది బాలికల్లో ఒకరు, అచలాపూర్‌లో 15 మందిలో 12 మంది మహిళలు, ఫిలిభిత్‌లో 30 మందిలో 23 మంది, హర్డోయిలో 19 మంది బాలికలు కనిపించటం లేదు. మరీ దారుణమేమంటే, బాలల హోంల తనిఖీ, ఆడిట్ కొరకు 2017 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు బాధ్యత అప్పగించిన ఏజెన్సీని 9 రాష్ట్రాల్లోని హోంలలోకి రానివ్వలేదు. బీహార్, యుపి, ఒడిసా, ఢిల్లీ, చత్తీస్‌ఘడ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్ (బంగ్లా) వాటిలో ఉన్నాయి. కారణం? తమ ఆడిట్‌ను తామే నిర్వహించుకుంటామని చెప్పాయి. మరీ దారుణం 1339 షెల్టర్ హోంలు ఇప్పటికీ రిజిస్టర్ కాలేదు. ఎంతో కలత చెందిన సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది: “మానభంగాలు ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. ఇదేనా మనం మన బాలికలను పరిగణిస్తున్న పద్ధతి? భయానకం”.

భారతదేశంలో మహిళలపై సర్వసామాన్యంగా జరిగే నేరాల్లో మానభంగానిది నాల్గవ స్థానం. దేశం మొత్తం మీద ప్రతినిముషం ఐదు మానభంగాలు, ప్రతి ఆరు నిముషాలకొక బలాత్కారం, ప్రతి 43 నిముషాల కొక కిడ్నాప్, ప్రతి 51 నిముషాలకొక వేధింపు, ప్రతి 7 నిముషాలకొక క్రిమినల్ దాడి జరుగుతున్నాయి. ఆహా ఏమి రాజ్యం? నాగరీక సమాజంగా మనల్ని మనం పిలుచుకుంటున్నాం. ఉద్రేకాలను చల్లబరచటానికై మోడీ ప్రభుత్వం క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్, 2018 తెచ్చింది. దాని ప్రకారం మానభంగ నేరానికి కనీస శిక్ష 7 సంవత్సరాల కఠిన కారాగార వాసాన్ని 10ఏళ్లకు పెంచారు. దాన్ని జీవిత ఖైదుగా కూడా విస్తరించవచ్చు. 16 సంవత్సరాలలోపు బాలికను మానభంగం చేస్తే కనీస శిక్ష 20 ఏళ్లు, జీవితాంత ఖైదుగా కూడా పొడిగించవచ్చు. 12 సంవత్సరాలలోపు బాలిక మానభంగ నేరానికి శిక్ష మరణ దండన.

విచారకరమేమంటే, మానభంగ చట్టాలను కఠినతరం చేస్తున్నప్పటికీ లైంగిక హింస విస్తృతమవుతూనే ఉంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకారం దేశంలో ప్రతిఏటా దాదాపు 39 వేల మానభంగ దాడులు జరుగుతున్నాయి. మైనర్ బాలకల మానభంగ నేరాలు 2015తో పోల్చితే 2016లో 82 శాతం పెరిగాయి. మానభంగం కేసుల్లో 40 శాతంలో బాధితులు 18 ఏళ్లలోపు వారు. అన్ని మానభంగం కేసుల్లో 95 శాతం రేపిస్టులు అపరిచితులు కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు కావటం మరీ దారుణం. తగినంత కట్నం తీసుకురానందుకు ప్రతి గంటకు ఒక మహిళ చంపబడుతున్నది. స్త్రీలు ఎప్పుడో ఒకసారి తన్నులకు అర్హులని భారతీయ పురుషుల్లో 50 శాతం మందికిపైగా భావిస్తున్నారు. ప్రభుత్వ బేటీ బచావో (ఆడపిల్లను రక్షించుదాం) నినాదం వారి చెవికెక్కదు. విషాదకరమైన దేమంటే, బాలికలు బాధలు భరించటం వారిని ప్రేమించే కుటుంబాలు ఆమోదించిన సుగుణంగా, మంచితనానికి మన నిర్వచనాలుగా చిత్రించబడుతున్నాయి.

కుటుంబ వ్యవహారాలు చొరరానివిగా, అంటకూడనిదిగా కొనసాగుతున్నది. మౌన మే భూషణంగా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మౌనం వహించే స్త్రీలను అలక్షం చేయటం, వారిపై పెత్తనం చేయటం, హింసించటం సులభం. ఈ చర్యలకు పర్యవసానాలుండవు. అపరాధ రాహిత్యం వర్ధిల్లుతున్నది. భౌతిక సుఖానందం పొందే హింసా సంస్కృతికిది ఉపకరిస్తున్నది. మేరా దేశ్ మహాన్, బ్రాండ్ ఇండియా అంటూ మన రాజకీయ వ్యవస్థ గొంతు చించుకుంటూ ఉండగా, మహిళలు, యువతులు అభద్రత వాతావరణంలో జీవించటం పెరుగుతున్నది. వారు మనుషుల ముసుగులోని పురుష మృగాల కామవాంఛ తీర్చే లైంగిక వస్తువులుగా, మాంసం ముద్దలుగా చూడబడుతున్నారు. మహిళలను వీధుల్లో పట్టిలాగినా, కదులుతున్న కార్లలో సామూహిక మానభంగం చేసినా (పేరు మోసిన వారైతే తప్ప) జనాలు పట్టించుకోనంతగా పరిస్థితులు దిగజారాయి. 150 సురక్షిత నగరాల గూర్చి ఒక లండన్ సంస్థ జరిపిన సర్వే న్యూఢిల్లీకి 139 వ ర్యాంక్‌తో రేప్ సిటీ స్థానం ఇచ్చింది.

ఆ కుప్పలో ముంబయి 126వ ర్యాంక్‌లో ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి? దీన్ని ఆపకపోతే మహిళలపై అత్యాచారాలు మరింత పెరుగుతాయి. మన నేతలు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఒక నేరం చేసే ముందు పురుషులు వెయ్యిసార్లు ఆలోచించేటట్లు ముందుగా పోలీసు చట్టాలను కఠినతరం చేయాలి. లైంగిక వేధింపుల సమస్యల గూర్చి మాట్లాడటం ముఖ్యం. బాధిత మహిళలు గొంతెత్తాలి. అప్పుడే అది పది మందికి తెలిసి అండగా వచ్చేవారు పెరుగుతారు, సమష్టి కార్యాచరణ సాధ్యం. వారు మౌన బాధను కొనసాగిస్తే, నేరం చేయటానికి అది పురుషులను ప్రోత్సహిస్తుంది. అదే సమయం లో మహిళలు సురక్షిత వాతావరణంలో పని చేసే పరిస్థితులు కల్పించాలి. ఏ చర్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయో పురుషులు, స్త్రీలకు అవగాహన కల్పించాలి. యజమానులు చట్ట నిర్దేశన ప్రకారం అంతర్గత లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఏర్పాటు చేయాలి. కఠిన కాలం కఠిన చర్యలు కోరుతుంది.

                                                                                                                                         – పూనం ఐ కౌశిక్