Home జాతీయ వార్తలు అన్ని మతాల్లోనూ ఉగ్రవాదుల జాడలే

అన్ని మతాల్లోనూ ఉగ్రవాదుల జాడలే

Terrorists Abound In All Religions

 

చెన్నై : అన్ని మతాలలోనూ ఉగ్రవాదులు ఉన్నారని, ఏ మతం కూడా ఈ విషయంలో మడికట్టుకున్నట్లుగా లేదని నట రాజకీయుడు కమల్ హాసన్ స్పందించారు. దేశపు తొలి ఉగ్రవాది హిందువు అని పేర్కొని, విమర్శల పాలయిన కమల్ దీనికి కొనసాగింపునకు దిగారు. ఏ మతం ఉగ్రవాదానికి అతీతంగా లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రతి మతానికి సొంతంగా ఉగ్రవాదులు ఉన్నారు. ఎవరూ తాము పవిత్రులమని ప్రకటించుకోలేరు’ అన్నారు. మక్కల్ నీధి మయ్యవ సంస్థను స్థాపించిన కమల్ తాను అంటున్న వాటికి తనకు అరెస్టుల భయం ఏదీ లేదని, అయితే ఇటువంటిదేమైనా జరిగితే అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. హిందూ ఉగ్రవాది నాథూరాం గాడ్సే అని చెప్పిన కమల్‌పై కేసు నమోదు అయింది. దీనితో కమల్ యాంటిసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఉగ్రవాదుల గురించి తాను చెప్పడం ఇదే తొలిసారి కాదని, అయితే ఎన్నికలలో గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్న వారు ఇప్పుడు తన మాటలను పెద్దగా చిత్రీకరిస్తున్నారని కమల్ చెప్పారు. అయినా ఉగ్రవాదులు కేవలం ఒక్క మతంలోనే కాదని అన్ని మతాలలోనూ విస్తరించుకుని ఉన్నారని, చరిత్రలోకి వెళ్లితే ఇటువంటి వారు మతాల వారిగా కన్పిస్తారని తేల్చిచెప్పారు.

తాను ఈ కోణంలో ఉగ్రవాదుల గురించి మాట్లాడినట్లు, ఫలానా మతంలోనే ఉగ్రవాదులు ఉన్నారనేది తన అర్థం కాదని వివరించారు. ఉగ్రవాదం లేదా హింసాకాండకు దిగని మతం ఉందని చెప్పగలరా? చరిత్రలో దీని ఆధారాలు దండిగా ఉంటాయన్నారు. ఆదివారం నాటి తన ప్రసంగం కేవలం సామరస్య పరిరక్షణకే అని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కాదని స్పష్టం చేశారు. గాడ్సేపై తాను ఆదివారం చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉంటానని తెలిపారు. తన మాటల తరువాత ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వాదనను కమల్ తోసిపుచ్చారు. అటువంటిది ఏమీ జరగలేదని, కొందరు కావాలనే ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని విమర్శించారు. తాను యాంటిసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు వచ్చిన వార్తలను కమల్ తోసిపుచ్చారు. అరెస్టులకు తాను భయపడేది లేదని తేల్చిచెప్పారు. అరెస్టు చేయకుండా ఉంటే మంచిదన్న కమల్, ఆదివారం నాటి తన ప్రసంగాన్ని మీడియా కావాలనే కొంత భాగంగా వెలువరించిందన్నారు.

Terrorists Abound In All Religions Kamal Haasan Comment