Home ఆఫ్ బీట్ విధానాల ఉరితాళ్లనేత

విధానాల ఉరితాళ్లనేత

2011-12లో దేశంలో ప్రత్తి ఉత్పత్తి, విదేశాలనుండి దిగుమతి చేసుకున్నది కలిపి మొత్తం 374.51 లక్షల బేళ్ళు. దేశీయ వినియోగం 375.28 లక్షల బేళ్ళు. అయినప్పుడు 129.57 లక్షల బేళ్ళు ఎగుమతులు చేయడానికి ప్రత్తి ఎక్కడి నుండి వచ్చింది? అనే ప్రశ్నకు జవాబు లేదు. ఈ సంవత్సర కాలం లోనే ప్రత్తి నూలు ధరలు నియంత్రణ లేకుండా పెరిగిన విషయం మనందరకీ తెలిసిందే. దేశీయ అవసరాలను పణంగా పెట్టి విదేశీ ఎగుమతులకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వటం ద్వారా ప్రైవేటు పారిశ్రామిక పెట్టుబడిదారుల ఆర్ధిక ప్రయోజనాలు కాపాడడం వల్లనే దేశీయ జౌళి రంగానికి ముడి పత్తి కొరత ఏర్పడి నిరుద్యోగం పెరిగింది. ఈ పాపం మన పాలకులు అవలంబిస్తున్న విధానాలదే.

Cheneta

భౌగోళికంగా భారతదేశం వ్యవసాయక దేశం. వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా పారిశ్రామిక అభివృద్ధిని ఊహించలేము.జౌళి రంగం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ఈ రంగానికి కావలసిన ముడి సరుకు పత్తిని పండించే రాష్ట్రాలలో పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు ప్రధానమైనవి. పత్తి ఎగుమతి దేశాలలో భారత్‌ది రెండో స్ధానం. పత్తిని ఎక్కువగా వినియోగించే దేశం కూడా మనదే. అయితే ముడి సరుకు ఉత్పత్తి, వినియోగంలో ముందున్న ఇండియాలో జౌళి రంగ నిరుద్యోగం పెరుగుతున్నది.
పత్తి సాగు విస్తీర్ణంలో 38 శాతంతో భారతదేశం మొదటి స్ధానంలో ఉన్నది. దేశంలో 62 శాతం పత్తి సాగు వర్షాధారిత ప్రాంతాలలో, 38 శాతం నీటి సదుపాయాలు ఉన్న ప్రాంతాలలో జరుగుతున్నది. ఒక హెక్టారు భూమికి వస్తున్న పత్తి దిగుబడి మొత్తం అమెరికా, చైనా దేశాలలో 527 కెజి లైతే మన దేశంలో 493.77 కెజిలు మాత్రమే. ఎరువులు, పురుగు మందులను భూమి సాంద్రతకి మించి వినియోగించి ఆధునిక సాగు పద్ధతులు అవలంబించినప్పటికీ ఉత్పత్తిలో మెరుగుదలలేకపోగా తగ్గుతున్నది.

2011-12లో దేశంలో ప్రత్తి ఉత్పత్తి, విదేశాలనుండి దిగుమతి చేసుకున్నది కలిపి మొత్తం 374.51 లక్షల బేళ్ళు. దేశీయ వినియోగం 375.28 లక్షల బేళ్ళు. అయినప్పుడు 129.57 లక్షల బేళ్ళు ఎగుమతులు చేయడానికి ప్రత్తి ఎక్కడి నుండి వచ్చింది? అనే ప్రశ్నకు జవాబు లేదు. ఈ సంవత్సర కాలం లోనే ప్రత్తి నూలు ధరలు నియంత్రణ లేకుండా పెరిగిన విషయం మనందరకీ తెలిసిందే. దేశీయ అవసరాలను పణంగా పెట్టి విదేశీ ఎగుమతులకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వటం ద్వారా ప్రైవేటు పారిశ్రామిక పెట్టుబడిదారుల ఆర్ధిక ప్రయోజనాలు కాపాడడం వల్ల దేశీయ జౌళి రంగానికి ముడి పత్తి కొరత ఏర్పడి నిరుద్యోగం పెరిగింది. ఈ పాపం మన పాలకులు అవలంబిస్తున్న విధానాలదే.

జౌళి పరిశ్రమలో మిల్ సెక్టార్, పవర్ లూమ్స్, చేనేత రంగాలు ప్రధానమైనవి.వీటిలో ఎక్కువ శాతం వస్త్రోత్పత్తి పవర్ లూమ్స్ రంగం నుండి జరుగుతున్నది. ఈ రంగంలో 61.72 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ కూడా ఎక్కువ భాగం పవర్ లూమ్స్‌పైనే ఆధారపడుతున్నది. దీనికి కారణం మిల్ సెక్టార్, చేనేత రంగాలలో తయారయ్యే వస్త్రాల ధరల కంటే పవర్ లూమ్స్ పై తయారయ్యే వాటి ధరలు చాల తక్కువగా ఉండడమే. పవర్ లూమ్స్ పై పని చేసే కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అంతేగాక కార్మిక చట్టాల నుంచి తప్పుకోవడానికి యాజమాన్యాలు 20 పవర్ లూమ్స్ కంటె ఒకటో రెండో తక్కువ వాటితో యూనిట్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి.

అలా ఏర్పాటయే యూనిట్స్‌పై కార్మిక చట్టాలను (ESI, PF, గ్రాట్యుటీ లాంటి సంక్షేమ పథకాలు) అమలు చేయమని ఒత్తిడి తెచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. జౌళి రంగంలో చిన్న తరహా మిల్లులు, పెద్ద కాంపోజిట్ మిల్లులు మొత్తం 3400 ఉన్నాయి. ఏభై మిలియన్ల ్ల కదుళ్ళతో స్పిన్నింగ్ మిల్లులలో మన దేశానిది ప్రపంచంలోనే మొదటి స్థానం. బట్టల మిల్లులు 2500 మిలియన్ల చదరపు మీటర్ల వస్త్రాని ఉత్పత్తి చేస్తున్నాయి. 95 కాంపోజిట్ మిల్లులు 13 లక్షల మెట్రిక్ టన్నుల జనపనార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

ప్రపంచీకరణలో భాగంగా చేసుకున్న జౌళి ఒప్పందాల వల్ల ఏర్పడిన విదేశీ పోటీ తట్టుకోవడానికి వీలుగా నాణ్యత ప్రమాణాలు పెంచాలనే నెపంతో సాంకేతిక అభివృద్ధి నిధి (TUF)ని ఏప్రిల్,1999 నుండి మన దేశంలో అమలు చేస్తున్నారు. ఇందుకోసం నాలుగు శాతం వడ్డీ రాయితీని, జౌళి పరిశ్రమల వ్యవస్ధాపక పెట్టుబడిలో 10% సబ్సిడీని మార్చి 2004వరకు ఇచ్చి ప్రోత్సహించారు.అయినా జౌళి పరిశ్రమ తగినంతగా పుంజుకోలేదు. దాంతో దీనిలో స్వల్పమైన మార్పులు చేసి M-TUF గా 2007 వరకు కొనసాగించారు.

అయినప్పటికీ, స్పిన్నింగ్, గార్మెంట్స్, ప్రాసెసింగ్, జిన్నింగ్, ముంగ్ పరిశ్రమలు విదేశీ పోటీని తట్టుకోలేకపోతున్నాయని భావించి సాంకేతిక అభివృద్ధి నిధి కేటాయింపులు మరింత ప్రోత్సాహకరం చేయాలనుకున్నారు. ఇందుకోసం 2011 ఏప్రిల్ 4 నుంచి 2012 మార్చి 31 వరకు రూ. 1972 కోట్లు అంటే మొత్తం పెట్టుబడిలో 10% సబ్సిడిగా జౌళి పారిశ్రామిక వేత్తలకు (R-TUFs) ప్రభుత్వం అందించింది.అయినప్పటికీ ఈ రంగంలో ఉద్యోగాలు పెరగకపోగా మరింత తగ్గాయి. పరిశ్రములు వాణిజ్య బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి తల ఎత్తింది. దానితో 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) RR-TUFs ను సాంకేతిక అభివృద్ధి నిధిగా మార్చి అమలు చేశారు.దీనిలో వీవింగ్ మిషన్స్, పవర్ లూమ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహించారు. క్రొత్తగా బ్రాండెడ్ కంపెనీల నుండి షటిల్ లెస్ మర మగ్గాలు కొనుగోలు చేస్తే 6% వడ్డీ రాయితీని మొత్తం పెట్టుబడిలో 15% సబ్సిడీని ఇచ్చారు. మార్జిన్ మనీ సబ్సిడీని కూడా 20% నుంచి 2012-17సంవత్సరాల మధ్య కాలంలో 30 %కి ప్రభుత్వం పెంచింది. దీనితో జౌళి రంగ బడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిలో 51%సబ్సిడీ గా లభించింది. అంతేగాక విదేశాల నుండి దిగుమతులు చేసుకునే సెకండ్ హ్యాండ్ షటిల్ లెస్ లూమ్స్ కు 2%వడ్డీ రాయితీని కూడా వారు పొందారు. పారిశ్రామిక వేత్తలపట్ల ప్రభుత్వ ప్రత్యేక ప్రేమకు ఇది నిదర్శనం.

అతి గొప్పగా ప్రచారం చేసిన మేక్ ఇన్ ఇండియా వల్ల కూడా వీసమెత్తు మేలు జరుగలేదు. ఎందువల్లనంటే ఈ పరిశ్రమలు ఆధునిక యంత్రాలను, ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుని, తగిన సాంకేతిక పరిజ్ఞానం లేదనే నెపంతో దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు నిరాకరించడం జరుగుతున్నది. అంతిమంగా ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులును ఎగుమతి చేసి భారీగా సంపాదించుకోవడానికే మేకిన్ ఇండియా వ్యాపారాలు పరిమితమయ్యాయి. స్థానిక ముడి సరుకు వినియోగం, తయారీ పరిశ్రమల ఏర్పాటు జరుగక ఉపాధి కల్పన శూన్యమౌతున్నది. ప్రైవేటు పారిశ్రామిక పెట్టుబడి లక్షణం లాభాపేక్ష, దోపిడీ తప్ప, దేశ భక్తి, జాతీయ సంపద పెంపుదల, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పనలతో ముడి పడి ఉన్న మానవ అభివృద్ధి ఎంత మాత్రం కాదు. అందుకే విదేశీ యంత్రాల దిగుమతులతో భారతదేశంలో ఉత్పత్తి చేసే ఏ వస్తువునైనా వ్యతిరేకిస్తూ స్వదేశీ యంత్రాల ద్వారా, దేశీయ ముడి సరుకుతో ఉత్పత్తి యైన వస్తువుల కొనుగోలును పెంపొందించుకోవాలనే తపన భారత పౌరులలో కలగాలి. అప్పడే మేక్ ఇన్ ఇండియా – మేడ్ ఇన్ ఇండియా అన్న నినాదాలు అర్ధంతో కూడిన విలువలు సంతరించుకుంటాయి.

లేకుంటే ఇండియా ప్రోడ్యూస్డ్ బై ఇంపోర్టెడ్ మిషనరీ అనేది గత్యంతరం లేని నినాదంగా మారుతుంది. బ్రిటిష్ వలస పాలన కాలంలో భారత్ నుండి ముడి సరుకులు ఎగుమతి చేసినట్లే నేడు మన దేశం నుండి జౌళి రంగానికి ప్రధానమైన ప్రత్తి, కాటన్ యారన్‌లలో ఎగుమతులు యేటా పెరుగుతూనే ఉన్నాయి. దీని వలన భారత దేశంలోని 124 కోట్ల మంది జనాభా వస్త్రాలను దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిలో భాగంగానే Amended technology upgradation fund scheme ను అమలు చేస్తూ రు.30 కోట్లు పెట్టుబడి వరకు కొనుగోలు చేసే ఆటో ఎయిర్ జెట్, వాటర్ జెట్స్ లాంటి షటిల్ లెస్ మర మగ్గాలకు 15% సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1999 నుండి 2014 వరకు సాంకేతిక అభివృద్ధి పేరుతో వాణిజ్య బ్యాంకులు రూ. 2,71,480 కోట్ల పెట్టుబడి ఋణాలు రు.20,464 కోట్ల సబ్సిడీని జౌళి పరిశ్రమలకు ఇచ్చాయి. అయినప్పటికీ 95జౌళి పరిశ్రమలలో 1,17,343 మంది కార్మికులను తొలగించి, జౌళి కార్మికుల పునరావాస నిధి కింద రూ. 317.5కోట్లు చెల్లించారు. ఆధునిక యంత్రాలు ఉద్యోగ కల్పనను తగ్గిస్తాయనడానికి ప్రభుత్వం చెబుతున్న ఈ లెక్కలే మంచి ఉదాహరణగా మనం గుర్తించాలి.

దేశంలో మగ్గాల సంఖ్య 32 లక్షలు కాగా వీటిపై పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకుని 1.92 కోట్ల మందికి చేనేత రంగం జీవనోపాధిగా ఉందని శివరామన్ కమిటీ నిగ్గు తేల్చింది. 2012-13 నాటికి పవర్ లూమ్స్ సంఖ్య 23,47,249కు పెరిగినప్పటికీ ఆమేరకు వస్త్రోత్పత్తి పెరగలేదు. అది 38,038 మిల్లియన్ల చ.మీటర్లకే పరిమితమయ్యింది. అదేవిధంగా 2015-16 నాటికి అత్యంత ఆధునిక మరమగ్గాల స్దాపన జరిగి మగ్గాల సంఖ్య 24,69,638 కి పెరిగినప్పటికీ వస్త్రోత్పత్తి పుంజుకోలేదు.

పెరిగిన 4,79,330 ర్యాపియర్, ప్రొజెక్టియర్, ఎయిర్ జెట్ లూమ్స్, ఆటోమాటిక్ పవర్ లూమ్స్ ఉత్పత్తి పెరగకపోగా తగ్గింది. అలాగే 2005 వరకు రెండు మర మగ్గాలపై ఒక కార్మికుని నియమించే పద్దతి కొనసాగగా నేడు ఒకే కార్మికుడు 4 ఆధునిక మర మగ్గాలపై పనిచేస్తున్నాడు. దీనిని బట్టి పవర్ లూమ్స్ రంగంపై రోజుకు 2 షిఫ్టులలో ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య 26 లక్షలు మంది మాత్రమే. అంతేగాక రోజుకు 12 గంటలు పని చేస్తూ అనారోగ్య పీడితులుగా, కార్మిక చట్టాల అమలుకు దూరమై సంక్షేమ పధకాలు అందని ద్రాక్ష పళ్లవుతున్నాయి. భివాండి, సూరత్, ఇచ్చల్ కరెంచ్, నాగ్‌పుర, మాలేగావ్, మీరట్, కోయంబత్తూర్, సేలం, నారాయణ వనం నగిరి, పుత్తూరు, ఇళ్ కల్, హుబ్లి దొడ్డ బల్లాపూర్, యెలహంక, బెంగళూర్, సిరిసిల్ల, భువనగిరి, నకిరేకల్, వారణాశి, మొగల్‌పుర, ఘజియాపూర్, ముబారక్పూర్, లోహత, ఘజియాబాద్, ఢిల్లీ, ఆలంపుర, పిల్లికోటి, నోయిడ మొదలైన ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులు శ్రమకు తగ్గ వేతనాలు లేక కుటుంబ జీవనానికి సరిపడా ఆదాయం లేనందున అర్ధాకలితో అలమటిస్తూ అనారోగ్య పీడితులై వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

పవర్ లూమ్ కార్మికులు కేవలం వేతన కూలీలే తప్ప చేనేత కార్మిక వర్గానికి శత్రు వర్గం కాదు.రెండు రంగాలలోని కార్మిక వర్గం దోపిడీకి గురౌతూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు బలౌతున్నది. జౌళి రంగంలో అమలౌతున్న ప్రభుత్వ విధానాలపై ఐక్యతతో ఉద్యమించాల్సిన అవసరాన్ని ఈ కార్మిక వర్గం అంతా గుర్తించాలి.

చేనేతకు హక్కుగా ఉన్న చేనేత వస్త్రవుత్పత్తుల రిజర్వేషన్ చట్టం, వారికి ప్రాణాధారమైన చిలపల నూలుకు సంబంధించి హాంక్ యార్న్ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ధితో అమలు చేయగలిగితే, ఒక్క చేనేత రంగం పైనే 3 కోట్ల మందికి పైగా ఉపాధిని పెంపొందించే అవకాశాలు భారత దేశంలో ఎక్కువగా వున్నాయి. ప్రపంచ దేశాలలోనే విశాల మార్కెట్ అవకాశాలు కలిగిన భారత దేశంలో వస్త్ర మార్కెట్ ను విదేశీయులకు ధారాదత్తం చేయకుండా స్వదేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రత్తి, సిల్క్, వూల్, జూట్ మొదలగు వాటితో వస్త్రోత్పత్తి చేయతమేగాకుండా వివిధ వస్తు ఉత్పత్తులను స్వదేశి యంత్రాలతో స్వదేశంలోనే ఉత్పత్తి చేయటానికి విధాన పరమైన రూపకల్పనలు చేసినప్పుడే మేక్ ఇన్ ఇండియా – మేడ్ ఇన్ ఇండియా అనే నినాదాలు సార్ధకం అవుతాయి.

లేకుంటే విదేశీ ఆధునిక యంత్రాలతో తయారు చేసిన భారతీయ ఉత్పత్తులుగా మారి ముడి సరుకును ఎగుమతి చేసుకునే దేశంగాను . విదేశీయులకు కావలసిన ఉత్పత్తులను అతి తక్కువ ధరకు, అతి తక్కువ వేతనాలకు పని చేసే భారతీయ కార్మికులుగా, అంతిమంగా విలయ తాండవం చేస్తున్న నిరుద్యోగ సైన్యంగా కొన్ని కోట్ల యువ భారతీయుల అశాంతిని దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. దేశ సార్వభౌమ అధికా రాన్ని కాపాడు కోవడానికి అంతర్గత శాంతితో పాటు, ఆర్ధిక అసమానతలు లేని సమాజం కొరకు ప్రజాస్వామిక విలువలతో విధాన రూపకల్పన చేయాల్సిన బాధ్య తను రాజ్యాంగ శక్తులుగా ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నత అధికా రులు గుర్తించి అమలు చేయకపోతే భారత దేశ పౌరుల ఉజ్జ్వల భవిష్యత్తు ప్రశ్నార్ధకమే అవుతుంది.

storyమాచర్ల మోహన్‌రావు
వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర చేనేత జన సమాఖ్య
(9441041266)