Home సినిమా థియేటర్ల బంద్‌కు టిఎఫ్‌సిసి మద్దతు

థియేటర్ల బంద్‌కు టిఎఫ్‌సిసి మద్దతు

cin

దక్షిణాదిన నాలుగు భాషల చిత్రాల నిర్మాతలు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్‌ఒ, పిఎక్స్‌డి సంస్థలకు మధ్య బెంగుళూర్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిర్మాతలు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి మార్చి 2 నుంచి థియేటర్లు బంద్ చేస్తూ ఆ మూడు డిజిటల్ సంస్థలకు సినిమా కంటెంట్ ఇవ్వకూడదని నిర్ణయించారు. థియేటర్ల బంద్‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ “గత పదేళ్లుగా డిజిటల్ వ్యవస్థపై మేము పోరాటం చేస్తున్నాం. గతంలో మేము డిజిటల్ రేట్లను తగ్గించాలంటూ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. కానీ అప్పట్లో పెద్దగా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. కొంతమందికైతే డిజిటల్ రేట్లపై అంత అవగాహన కూడా ఉండేది కాదు. ఇక బెంగుళూర్‌లో నిర్మాతలతో జరిగిన చర్చల్లో ఆ మూడు డిజిటల్ సర్వీస్ సంస్థలవారు 9 శాతానికి మించి డిజిటల్ రేట్లను తగ్గించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. అసలు డిజిటల్ ఛార్జీలు ఐదేళ్లకు మించి ఉండకూడదు. కానీ 13 ఏళ్లయినా కూడా అదే రేట్లు తీసుకుంటూ నిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారు. మన సౌతిండియా ఫిలిం ఇండస్ట్రీలలో తప్ప హాలీవుడ్, బాలీవుడ్‌లలో ఈవిధంగా లేదు. గతంలో రూ.2500కే డిజిటల్ సర్వీసెస్‌ను మేము అందిస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చినా వారిని రానివ్వకుండా చేశారు కొంతమంది. ఇప్పటికే అత్యధిక డిజిటల్ రేట్ల వల్ల రిలీజ్‌కాకుండా ఎన్నో చిత్రాలు ఆగిపోయాయి. క్యూబ్, యుఎఫ్‌ఒ, పిక్స్‌డి సంస్థలతో అగ్రిమెంట్‌ను రద్దుచేసుకుంటే తక్కువ రేట్లకే డిజిటల్ సర్వీసెస్‌ను అందిస్తామని కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి మార్చి 2 నుంచి థియేటర్ల బంద్‌కు అందరూ సహకరించాలని కోరుతున్నాము”అని అన్నారు. టిఎఫ్‌సిసి కార్యదర్శి సాయి వెంకట్ మాట్లాడుతూ “ఎంతో కాలంగా డిజిటల్ వ్యవస్థపై మేము ఉద్యమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సౌతిండియా ఫిలిం ఇండస్త్రీ అంతా ఏకమై ఆ మూడు డిజిటల్ సంస్థలు దిగి వచ్చేలా మార్చి 2 నుంచి చేయబోతున్న థియేటర్ల బంద్‌కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. దీనిని ముందుండి నడిపిస్తున్న జెమిని కిరణ్, డి.సురేష్‌బాబుకు ధన్యవాదాలు చెబుతున్నాము”అని చెప్పారు.