Home వికారాబాద్ సాగుకు జీవం

సాగుకు జీవం

The agriculture sector has changed in four years

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి :  ఒకప్పుడు  ఎర్రబారిన పంటలు, నెర్రెలు వారిన భూములు దర్శనమిచ్చేవి. సాగునీటి వనరులు సరిగ్గా లేక వర్షాధారిత పంటలు వేసుకునేవారు. ఒక యేడు అతివృష్టి..మరో యేడాది అనావృష్టితో రైతాంగం సతమతమైంది.  అలా దశాబ్ధాల పాటు పడరాని పాట్లు పడ్డారు. కానీ నాలుగేళ్లుగా వ్యవసాయరంగం రూపురేఖలే మారిపోయాయి. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. ఉనికి కోల్పోయిన రెడ్డి రాజుల కాలం నాటి చెర్వులకు మోక్షం లభించింది.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌కాకతీయ పథకం ద్వారా ఎన్నో చెర్వులు బాగుపడ్డాయి.  వికారాబాద్ జిల్లాలో అనేక మొండి చెర్వులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. నీటి పారుదలశాఖ అధికారులు పాత రికార్డులకు బూజు దులుపి కొత్త అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. సిఎం  కేసీఆర్, నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లిన మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లాకు దండిగా నిధులు రాబట్టారు.

నాలుగు దశల మిషన్‌కాకతీయ పథకం ద్వారా రూ.250 కోట్లు సాధించారు. ఈ నిధులతో 703 చెర్వులు పునరుద్ధరించారు.  వాటి కింద 76 వేల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చారు.  గతంలో ఇదే చెర్వుల కింద పట్టుమని 25 వేల ఎకరాలు కూడా మించని సాగు భూములను మూడింతలు రెట్టింపు చేశారు. వరి, వేరుశనగ తదితర పంటలకు పుష్కలంగా నీరు లభించింది. భూగర్భజలాలు పెరిగి పరోక్షంగా కంది, పెసర, మినుము, పత్తి, చెరుకు, జొన్న తదితర పంటలకూ అనుకూల వాతవరణం ఏర్పడింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెడ్డి రాజుల కాలం నాటి చెర్వులతో పాటు శిథిలావస్థకు చేరిన నీటి వనరులను గుర్తించి మరమ్మతులు చేపట్టారు.  వికారాబాద్, మర్పల్లి, ధారూరు, బంట్వారం, మోమిన్‌పేట, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, కోటపల్లి, పరిగి, దోమ, కులకచర్ల, కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో పునరుద్ధరణ జరిగిన తర్వాత అనేక చెర్వులు ప్రాజెక్టులను తలపిస్తున్నాయి. ఆధునీకరణ చేపట్టిన తర్వాత ఏటేటా వర్షాకాలంలో భారీగా నీటి నిల్వ పెరిగింది. చెర్వు కట్టలు, ఆనకట్టలు, తూములు, శిఖం పూడికతీత, వరద పాటు, పిచ్చిమొక్కలు తొలగింపు, నీటి పారుదల కాల్వల నిర్మాణం చేపట్టారు. ఒక్కో చెర్వుకు కిలోమీటరుకు తగ్గకుండా కాల్వలు మరమ్మతు  చేశారు. చాలా వనరులకు కొత్త కాల్వలూ నిర్మించారు. శిథిలావస్థకు చేరిన తూములు, అలుగులను మెరుగుపరిచారు. ఆనకట్టల ఎత్తు పెంచారు. నీటి ప్రవాహానికి కట్ట దెబ్బతినకుండా పలు చెర్వులకు రిబెట్‌మెంట్ పనులూ చేపట్టారు. చెర్వుల్లో నీటి నిల్వ పెంచేందుకు పూడికతీత పనులు నిర్వహించారు.

ఒండ్రుమట్టి తవ్వకాలు జరిపి పరిసరాల పొలాలకు తరలించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ రెవెన్యూ డివిజన్‌లో కేవలం 9 శాతానికే పరిమితమైన సాగునీటి పారుదలను ఈ నాలుగేళ్లలో 22 శాతానికి పెంచారు.  నీటి వనరులు పెద్దగా లేనందున సాగుశాతం చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో రాష్ట్ర సాగునీటి పారుదల శాతం 44 మాత్రమే ఉంది.  హైదరాబాద్‌కు మంచినీటిని అందించే మూసీ నది వికారాబాద్ ప్రాంతంలో జన్మించింది. మూసీ నదిపై ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించరాదన్న నిజాం కాలం నాటి ఫర్మనా ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఫలితంగా మూసీ ఎగువ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టు నిర్మించలేదు. గ్రామీణ ప్రాంతంలో ప్రవహిస్తున్న కాగ్నా, కాకరవేణి నదులను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉండగా చెర్వులకు మోక్షం లభించింది.  జిల్లాలో ఉన్న 9 శాతం సాగునీటి భూములను 14 శాతానికి పెంచుతామని 2004లో నాటి సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ప్రకటించినా సాధ్యం కాలేకపోయింది.  2014లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ధృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టిన  మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెర్వుల పునరుద్ధరణ సాధ్యమైంది. ప్రతి యేటా పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు దశల కాకతీయ పనులు చేపట్టారు. ఈ నాలుగు దశల్లో పూర్తి చేసిన  చెర్వుల ద్వారా అదనంగా 13 శాతం సాగునీటి పారుదల పెరిగింది.

ప్రతి చెర్వు కింద రెండు, అంతకంటే రెట్టింపు స్థాయిలో ఆయకట్టు భూములు సాగులోకి వచ్చాయి.  మూడేళ్లలో వ్యవసాయరంగం రూపురేఖలే మారిపోయాయి.  మిషన్‌కాకతీయ చెర్వులే 22 శాతం ఆయకట్టు భూములలో 76 వేల ఎకరాలను సస్యశ్యామలం చేయగా చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో 16 వేల ఎకరాలు సాగవుతున్నాయి. వరి, వేరుశనగ పంటలు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రత్యేకించి ఖరీఫ్, రబీలో పండించిన వరి ధాన్యం మరీ అధికంగా చేతికి వస్తున్నది. గతంలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో రెండు సీజన్‌లలో కలిపి 6 లక్షల క్వింటాళ్లు కూడా దిగుబడి సాధించలేకపోయారు. కానీ రెండేళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి  11 లక్షల క్వింటాళ్లు సాధించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అందులో సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రబీలో 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. గతంలో రబీలో కనీసం 25 వేల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదని చెబుతున్నారు. మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు కూడా భారీస్థాయిలో సరకు కొనుగోలు చేశారు. రెండేళ్లుగా అదనంగా 40 శాతం ఉత్పత్తులు పెరిగాయని అధికారులు చెప్పారు. జిల్లాలో తాండూరు సెగ్మెంట్‌లో కోటపల్లి మధ్య తరహా ప్రాజెక్టు కింద 9,200 ఎకరాల ఆయకట్టు భూములో 6 వేల ఎకరాలలో పంటలు పండించారు.

యాలాల మండలంలో జుంటుపల్లి, పరిగి సెగ్మెంట్‌లో లఖ్నాపూర్ తదితర మధ్య తరహా ప్రాజెక్టుల్లో 5 వేల ఎకరాలలో పంటలు పండించారు. కేవలం రబీ సీజన్‌కే ప్రాజెక్టులు పరిమితమైనాయి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే వికారాబాద్ జిల్లాలో మరో లక్ష ఎకరాలు సాగుకు నోచుకోనున్నాయి. 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందంచాలని పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది పూర్తయితే వికారాబాద్ జిల్లాలో ఉత్పత్తులు మరింత పెరుగుతాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ కింద మొదటి దశలో 234 చెర్వులు, రెండో దశలో 249, మూడవ దశలో 119, నాలుగవ దశలో 101 చెర్వులను పునరుద్ధరించారు.