Home కలం సాహితీ సేనాని సీతారాం

సాహితీ సేనాని సీతారాం

Sitaram

ఎనభై దశకంలో తెలుగు కవితా ప్రపంచంలోకి కొత్త కలాలు ప్రవేశించాయి. అప్పటికి ఇంకా స్త్రీ, దళిత వాద సాహిత్యాలు పిండ దశ లో ఉండి ఉంటాయి. ఇదే కాలంలో కొత్త పలుకుబడితో, సరికొత్త ఆభివ్యక్తి ధోరణితో కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించారు, ‘రక్త స్పర్శ’ కవులు. ‘రక్త స్పర్శ’ పేరుతో 1985-86 సంవత్సరాల్లో అఫ్సర్, ప్రసేన్, సీతారాంలు, కవులకు గుమ్మమైన ఖమ్మం నుండి ఈ కవితా సంకలనం వెలువరించారు. నాడు విమర్శకులుగా, కవులుగా, ఆచార్యులుగా ప్రసిద్ధమైన వాళ్లు ఈ కవితా సంకలనంలోని కవులకు “చక్కటి భవిష్యత్తు ఉంది. కవిత్వాన్ని నవచేతనతో నడిపించే సత్తా ఉంద” ని అంచనా వేశారు. అట్లా అంచనా వేసిన వాళ్లల్లో ప్రముఖ విమర్శకులు కీ.శే. చేకూరి రామారావు గారు ప్రసిద్ధ కవి. కీ.శే. వేగుంట మోహన్ ప్రసాద్‌గార్లున్నారు. అట్లా నేడు తెలుగు కవిత్వాన్ని శ్వాసగా, ధ్యాసగా జీవిస్తున్న నిరంతర కవి గోపి, శివారెడ్డి, పేర్వారం జగన్నాథం, కోవెల సుప్ర సన్నాచార్య, సంపత్కుమారాలతో పాటు ఎందరో ఈ కవుల కవిత్వంపై సద్విమర్శ చేశారు. అది మొదలు ఆ ముగ్గురు కవులు తాము కవితా ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు.
చేరా గారు ఒక ప్రముఖ దిన పత్రికలో వారం వారం చేరాతలు రాసేవారు. ఆ చేరాతల్లో ఈ కవుల గూర్చి వారి కవితా వైశిష్టాన్ని గూర్చి చేరా ప్రస్తావించారు కూడా. అట్లాగే కీ.శే. జి.వి సుబ్రహ్మణ్యం గారు మరొక దిన పత్రికలో “సాహిత్యంలో చర్చనీయాంశాలు” పేరుతో “కాలం” నిర్వహించే వారు. వారు కూడా ఈ కవులను గూర్చి ప్రస్తావించిన సందర్భాలున్నాయి. ఈ విమర్శకుల అంచనాలను నిజం చేస్తూ “రక్త స్పర్శ” కవులు విడివిడిగా తమ కవితా సంపుటాలను ఆ తరువాత ప్రకటించారు.
డా॥ రావులపాటి సీతారామారావు “సీతారాం” పేరుతో కవిగా, విమర్శకులుగా, పరిశోధకులుగా, సామాజిక సేవా కార్యకర్తగా, ఉత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు పొందాడు. ‘సీతారాం’ తెలుగు కవితా క్షేత్రంలోకి అడుగిడేనాటికే ‘రావులపాటి సీతారామారావు’ అనే ఒక కథా రచయిత ప్రసిద్ధి గాంచాడు. వీరు ఖమ్మం జిల్లా వారే. వీరు పోలీసు శాఖలో నాటికే ఉన్నతోద్యోగంలో ఉన్నారు. బహుశః ఈ కారణాల వల్లనేమో డాక్టర్ సీతారామారావు ‘సీతారాం’ అనే పేరుతో కవిత్వం రాసి ఉంటాడు. వీరి కవితలు సీతారాం పేరుతో అచ్చు అయ్యేవి. వ్యాసాలు, విమర్శలు, ఇంటర్వూలు మాత్రం ‘జానకి’ పేరుతో మొదట్లో అచ్చ య్యేవి. అనంతర కాలంలో సీతారాం పేరుతోనే రచనలు వెలువడుతున్నాయి.
సీతారాం ‘ఇదిగో ఇక్కడి దాకే’ కవితా సంపుటి ఏప్రిల్ 1990 సంవత్సరంలో వెలువడింది. ‘S/o మాణిక్యం’ జూన్ 1995, ‘కుప్పం కవితలు’ జూన్ 2008లో వెలువడ్డాయి. కవితా సంపుటాలు వెలువరించడంలో ఆలస్యం కావడా
నికి ఆయన పరిశోధకుడిగా మారడమే. 1990-93 వరకు కాకతీయ విశ్వ విద్యాలయంలో ‘ఆధునిక కవితా ధోరణులు అనే అంశంపై పిహెచ్‌డి చేశాడు. ఈ పరిశోధన కోసం విస్తృతంగా క్షేత్ర పర్యటన చేశాడు. నాటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు సందర్శించి సమాచార సేకరణ చేశాడు. ఈ పరిశోధన కాలంలో ఎందరో పరిశోధకులను, ఆచార్యులను స్వయంగా కలిసి ఆధునిక కవితా ధోరణులపై సప్రమాణికమైన సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధన కోసం ఏకంగా హైదరాబాద్‌లోనే ఒక చిన్న గది అద్దెకు తీసుకొని పరిశోధన యజ్ఞంలా భావించి పూర్తి చేశాడు. కవిత్వం హృదయ సంబంధమైనది, పూవులా సుకుమారమైనది, సున్నితమైనది. పరిశోధన ఆలోచనాత్మకమైనది. సున్నితత్వాన్ని నలిపేసి వజ్రతుల్యమైన తార్కికతకు తావిస్తుంది. ఒక కవి పరిశోధకుడు కావచ్చునేమో కానీ, ఒక పరిశోధకుడు కవి కాలేడు. తన పూర్వాశ్రమంలో నిలదొక్కుకోవడం అంత సులభమైనది కాదు. పరిశోధన తర్వాత నిరుద్యోగం ఆయనను బాధించిన అంశం. అందుకు పోటీ పరీక్షల కోసం విస్తృతమైన, లోతైన అధ్యయనం చేసి అధ్యాపక ఉద్యోగాన్ని సంపాదించి, నిరుద్యోగ రక్కసిని గెలిచి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే తనలో ఉన్న కవిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పుష్పం నిశ్శబ్దంగా పరిమళాన్ని వెదజల్లినట్లు అక్కడక్కడా దిన పత్రికలల్లో, కరపత్రాల ద్వారా కవిత్వాన్ని పాఠకులకు అందిస్తూనే ఉన్నాడు. విమర్శనా వ్యాసాలు రాస్తూ పరిశోధనా పత్రాలను జాతీయ సదస్సులలో సమర్పించాడు. క్రమంగా సీతారాం అధ్యాపక వృత్తిలోకి ఒదిగిపోయాక వివిధ పార్శాల్లో కనబడ్డాడు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో దాదాపు 14 గ్రామాలను దత్తత తీసుకొని హెచ్‌ఐవి నిర్మూలన కోసం ప్రచారంలోకి దిగాడు. అటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతోపాటు ఇటు సామాజిక సేవకులను కలుపుకొని ఆ గ్రామాలు మహమ్మారి వ్యాధినపడకుండా రేయింబవళ్ళు తిరిగాడు. ఆరోగ్య విద్యా, సామాజిక చైతన్యాలు రగిలించేలా కృషి చేసి అందరి మెప్పులను పొందాడు. అందుకే ఆయన్ని ఆయా గ్రామాల ప్రజలు ఆత్మ బంధువులా ఆరాధించారు. ఈ వ్యాస రచయిత కూడా వారు ఏర్పాటు చేసిన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు రాసిన ‘అదే పుట’ విమర్శా సంపుటిని ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ కేంద్రాలలో ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ అనేది ఒక మిష మాత్రమే. ఆ వేదికలపై హెచ్‌ఐవి నిర్మూలన బ్యానర్లే కొట్టవచ్చేవి. ఒక నిజమైన సామాజిక బాధ్యత కలగిన సాహితీ సేనాని సీతారాం అని విమర్శకులచే ప్రశంసలను అందుకున్నారు.
ద్రవిడ విశ్వ విద్యాలయం కుప్పంకు ఆ వైస్ చాన్సులర్ ఆహ్వానం మేరకు ప్రసార విభాగంలోకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డిప్యూటేషన్‌పై వెళ్లారు. అక్కడ తన సహోద్యోగులతో కలిసి పదుల సంఖ్యలో గ్రంథాలను విశ్వవిద్యాలయం పక్షాన ముద్రించి వెలువరించారు. కొన్నాళ్లకు తర్వాత మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వచ్చి కళాశాలలో చేరి ఆ ప్రాంత పేద విద్యార్థులను అనేక విధాలుగా చైతన్యవంతులను చేశారు. సీతారాం విద్యార్థులతో మమేకమై పనిచేసే క్రమంలో అన్ని మర్చిపోయేవాడు. విద్యార్థులతో విద్యార్థిగా గడిపేవాడు. వారితోనే భోజనం చేసి అక్కడే కాలం గడిపేవాడు. తల్లి కోడి తన పిల్లలను వెంటబెట్టుకొని రక్షించినట్లు ఆ విద్యార్థులను చేరదీసి సృజనాత్మక శక్తులను వెలికితీసే ప్రయత్నం చేసేవాడు. అట్లా కవితా సంపుటికి వారితోనే ముందు మాట రాయించి వారిలో సాహిత్యాభిరుచిని పెంచాడు.
అలాగే వారికి నచ్చిన గురువులను ‘నాకు నచ్చిన టీచర్’ పేరుతో విద్యార్థుల అభిప్రాయాలను వ్యాస మాలికగా వెలువరించాడు. దీనివల్ల విద్యార్థుల్లో అలసత్వం మాయమై క్రమ శిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకునే అవకాశాలు కలిగాయి. తాను పనిచేస్తున్న మానుకోట కళాశాల విద్యార్థులచే ‘మానుకోట ముచ్చట్లు’ అనే పుస్తకం రాయించి వారిలో కొత్త ఆలోచనలు, కొత్త వెలుగులను నింపాడు. వారు ఏ కళాశాలలో పనిచేసినా ప్రయోజనకరమైన పనులను తాను చేస్తూ తన తోటి అధ్యాపకులతో చేయిస్తూ విద్యార్థులను భాగస్వాములను చేయడం ఆయనలోని నాయకత్వ లక్షణానికి నిదర్శనం. కొంత కాలం కాకతీయ యూనివర్శిటీ అనుబంధ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో ఖమ్మం, ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కళాశాలల్లో కూడా పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పని చేశాడు. ఈ సమయాల్లో విద్యార్థులను గ్రామాల్లోకి తీసుకెళ్లి వారికి సేవ చేసే కార్యక్రమాలను రూపొందించాడు. ఖాళీ సమయాల్లో వారికి వక్తృత్వ, వ్యాస రచన, కవితా రచనలల్లో శిక్షణ లిచ్చేవాడు.
వివిధ ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక పోటీలకు విద్యార్థులను సమాయత్తం చేసి వరుసగా మూడు సంవత్సరాలు అనేక బహుమతులను కళాశాలకు తీసుకొచ్చాడు. ‘S/o మాణిక్యం’ కవితా సంపుటికి పీఠిక రాసిన ప్రసేన్ ‘సీతారాం కవిత్వానికి మూడు బాధలు. అవి పర్సనల్, ఇంటర్ పర్సనల్, యూనివర్సల్ వీటినే మోనోలాగ్, డైలాగ్, డ్యూయెలాగ్ అని కూడా అనొచ్చు. యూనివర్సల్ కవితలో ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. తన కోణంలోంచి ప్రపంచాన్ని మనకు దర్శింప చేస్తాడు. ఇంటర్ పర్సనల్ కవితల్లో తనకూ, తన పరిసరాలకూ ఉన్న సంబంధాల్లో తన పరిచయాలనూ, ప్రపంచంలో తన పాత్రను చూపెడతాడు’ అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.