Search
Friday 16 November 2018
  • :
  • :

ప్రత్యేక గౌరవవ పొందిన ‘ఫస్ట్‌లేడి’

ఇప్పుడు విజయం పేరు మహిళ. వివిధ రంగాలలో దూసుకుపోతూ అరుదైన శిఖరాలను అధిరోహిస్తోంది. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంది. క్రీడా, వైద్య, ఆరోగ్య, రక్షణ, విమానయాన, పరిశ్రమ,సినీ అనేక రంగాల్లో విజయం సాధించిన 112 మంది మహిళలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ‘ఫస్ట్‌లేడి’ అవార్డులతో సత్కరించింది. వీరంతా మిగతా మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.  ఈ సందర్భంగా ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో తొలి మహిళా డ్రైవర్‌గా ఎంపికైన తెలంగాణకు చెందిన సరిత, బ్రిటీష్ పార్లమెంటు ద్వారా హౌస్ ఆఫ్ కామర్స్ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ గాయకురాలు కె.ఎస్. చిత్ర, హైదరాబాద్‌కు చెందిన తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ సాజిదాఖాన్‌లు  తమ మనోభావాలను మనతెలంగాణ ముందుపరిచారు..

CHITRA

మహిళా సాధికారతను పెంచాలి
అన్నిరంగాలలో మహిళా సాధికారతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చాలా పాటలు పాడాను. క్లాసికల్ ఆల్బమ్స్ చేశాను. ఈ రంగంలో ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంది. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. వారికి అభినందనలు. ఒక కుటుంబంలో మహిళ ఉద్యోగం సాధించి ఆర్థికంగా బలపడినప్పుడే ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది..
మన సమాజంలో పాఠశాల స్థాయి నుండి పిల్లలలో సోదరభావాన్ని, ఒకరికి ఒకరు గౌరవ, మర్యాదలను ఇచ్చి పుచ్చుకొనే ధోరణిని మళ్లీ నేటి స్థాయి యువతకు బోధించాలి. పిల్లలు పాఠశాల స్థాయి నుండే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, వారు ఆ బారిని పడకుండా జాగ్రత్తగా కాపాడాలి. అటువైపు మళ్లకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి. చాలా వరకు మద్యపానం, డ్రగ్స్ వాడకం వల్లనే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళా సాధికారతను పెంచే ప్రయత్నాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. గల్ఫ్ దేశాలలో భాగంగా అందరికి చట్టం అంటే భయం ఉండాలి, చట్టాలు కూడా ఆ దిశగా చేయాలి. తప్పు చేసిన వ్యక్తి చట్టం ద్వారా కఠినంగా శిక్షించబడతామనే భావన కలిగినప్పుడే మహిళలపై దాడులు చేసేందుకు భయపడతాడు. మహిళల పట్ల గౌరవ భావన, ధృక్పధం మారే విషయంలో స్కూలు స్థాయి నుండే వారికి ఆ దిశగా బోధన, శిక్షణ సాగాలి.

PH

 అవార్డు నాకు అరుదైన గౌరవం 
అవార్డు అందుకోవడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో సామాజిక రంగంలో అత్యుత్తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాను. దానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాను. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు అంధ విద్యార్థులను గౌరవించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరాను. నా అభ్యర్ధనను మన్నించిన ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ ఘటన తరువాత నాలో ఒక ఫైర్, సామర్ధ్యం ఉన్నదని గమనించాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2013 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో 343 ర్యాంకు సాధించాను. మా నాన్న నా చిన్నప్పటి నుండి ఎటువంటి అపజయం ఎదురయినా నన్ను కృంగిపోకుండా ధైర్యం చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించారు. మేము హైదరాబాద్‌కు చెందిన తెలుగువారమే. మా నాన్న వృత్తి రీత్యా చెన్నై వెళ్లి స్థిరపడాల్సి వచ్చింది. తమిళంతో పాటు అంతే స్థాయిలో తెలుగును కూడా మాట్లాడగలను. మహిళలైనా, యువత అయినా తమలో ఉన్న బలహీనతలను పెద్దవిగా చేసి, వాటి గురించి ఆలోచించకుండా దాన్ని మన బలంగా మార్చుకొని ముందుకు సాగిపోవాలి. ప్రతి మనిషిలో కూడా ఏదో ప్రత్యేకత, సామర్ధ్యం దాగి ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే ప్రతి మనిషి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతాడు. మనం విజయం దిశగా సాగిపోవడానికి కావాల్సిన మార్గాన్ని మనమే అన్వేషించుకోవాలి. అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవడం ద్వారా ఎప్పుటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. మనం ఏ ప్రాంతం నుండి వచ్చినా, ఏ భాష నుండి వచ్చినా దేశాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే మనం మన కుటుంబ సభ్యులను ప్రేమిసాం.

PHH

నిబంధనలు అడ్డుకాలేదు

నాకు తల్లిదండ్రులు, సమాజం నుంచి చాలా ప్రోత్సాహం అందింది. ఒకప్పుడు మతపరమైన నిబంధనలతో మహిళలు బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు రోజులు, పరిస్థితులు మారాయి. మహిళలు బయటికొచ్చి వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నారు.ఈ రంగంలో ఒక్కోసారి రాత్రిళ్లు కూడా పనిచేయాల్సి వస్తోంది. కానీ ఇలాంటివి అన్ని రంగాల్లోనూ ఉంటాయి. స్వశక్తి మీద నమ్మకంతో అడుగు ముందుకేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం. కష్టాలు, ఇబ్బందులు అందరికీ వస్తాయి. ధైర్యంగా నిలబడినప్పుడే విజయం వరిస్తుంది.

SRT

సొంత రాష్ట్రానికి రావాలనుంది
బస్ డ్రైవర్ కంటే ముందు ట్యాక్సీ నడిపాను. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో డ్రైవర్లుగా మహిళలను కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు నాతో పాటు 10 మంది దరఖాస్తు చేశారు. కాని నేనొక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. ఇప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు తెలంగాణలో ఉంటారు, వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి నేనిక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంది.అలాగని వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచే పరిస్థితి లేదు. అందుకే నేను నా సొంత రాష్ట్రంలో పనిచేయాలనుకున్నాను. అక్కడ డ్రైవర్‌గా పనిచేయడానికి కావాల్సిన అర్హతలన్నీ నాకున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డిని, ఎంపీ కవితను కలిశాను. నాకు తెలంగాణ ఆర్టీసీలో అవకాశం ఇప్పించాల్సిందిగా కోరాను. పరిశీలిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా నా బాధను సహృదయంతో అర్థం చేసుకుని నా తెలంగాణలో అవకాశం ఇప్పించడం ద్వారా ఆదుకుంటారని ఆశిస్తున్నాను. మహిళలకు పెద్దపీట అంటున్న మన ప్రభుత్వం నాకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నాను.

KARANAM

స్ఫూర్తినివ్వడమూ స్ఫూర్తే

ఎంచు కున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎవరో ఒకరు దారి వేస్తే ఆ దారిలో ఇంకో వంద మంది నడుస్తారు. వెయిట్ లిఫ్టింగ్ లో మహిళలు ఏం రాణిస్తారు అనుకున్న సమయంలో నేను ప్రవేశించాను. నేను సాధించిన విజయాలతో అనేక మంది స్ఫూర్తి పొందారు.  ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ మహిళలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం సాహసంతో కూడిన పనే.  అయినా  మహిళలు ఇప్పుడు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నారు.

Comments

comments