Home కలం సాహితీ పురస్కారాలెవరికి?

సాహితీ పురస్కారాలెవరికి?

Awards

కళా రంగములో విశేష కృషి చేసిన కళాకారులను ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు పురస్కారాలందించి గౌరవించడం సదాచారం. అది కళాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చి ప్రోత్సహిస్తుంది. కళాతాపసులకు ప్రాణ వాయు వవుతుంది. కళలు రాణించని ఏ దేశమైనా, రాష్ట్రమైనా వల్లకాడుతో సమానం.ప్రజాస్వామ్యంలో కళాకారుల కృషిని గుర్తించి పురస్కారాలందించడం ప్రశంసనీయం. అది ఆ రాష్ట్ర / దేశ సౌభాగ్యానికి దోహదపడుతుంది.
ఈ మధ్యనే సాహితీ రంగంలో విచిత్రమైన పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సాహితీ కృషీవలులను ఎంపిక చేసి పురస్కారాలందించడం ప్రగతికి నిదర్శనమే. కానీ, కృషిని మదింపు వెయ్యడములో నిజాయితీ లోపించిందని అందరికీ తెలిసిన రహస్యమే. అది తిరోగమనానికి తొవ్వ జూపుతుంది.
రచయితల కృషిని మదింపు వెయ్యడములో సిద్ధాంతాల రాద్ధాంతాలు, కమిటీ వారితోనున్న సాన్నిహిత్యముకు లభించిన ప్రాధాన్యత కృషికి లభించడము లేదు. పురస్కారాలకు సాహితీ వేత్తలను ఎంపిక చేసే కమిటీలో ఉన్నవారు ఆలోచనల కనుగుణమైన రచయితలకే ఎక్కువ పురస్కారాలు వరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనే తేడా లేకుండా మెజారిటీ సంస్థలది అదే దారి. ఫలితంగా నిష్పాక్షికత నీరుగారి పోతుంది.
భారతీయ భాషా సాహిత్యాలలో విశేష కృషి చేసిన సాహితీ వేత్తలకు కేంద్ర సాహిత్య అకాడమీ ఏటేటా పురస్కారాలందిస్తుంది. ప్రాంతీయ భాష ల్లో పురస్కారాలకు సాహితీ వేత్తలను ఎంపిక చేసేందుకు ఒక్కో భాషకు ఒక్కో కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ వారు ఆయా భాషా సాహిత్యాలలో విశేష కృషి చేసిన వారిలోంచి ఒకరిని ఎంపిక చేస్తారు. క్షేత్ర స్థాయిలో కమిటీ వారు రచయిత/ రచయిత్రి కృషికి తక్కువ ప్రాధాన్యత నిచ్చి తమ ఇష్టాయిష్టాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం త్రికరణ శుద్ధిగా సాహిత్యానికే అంకితమై కృషి చేస్తున్న సాహితీ వేత్తలను వెనక్కు నెట్టినట్టవుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో తెలంగాణలో విశేష కృషి చేసిన తెలుగు సాహితీ వేత్తలకు పురస్కారాలిచ్చి గౌరవించడం ఉత్కృష్టమైన సంప్రదాయమే. రాష్ట్ర స్థాయి పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పురస్కారానికి ఎంపికయ్యే సాహితీ వేత్త పురస్కారాల కమిటీ వారికున్న సాన్నిహిత్యం లేదా పలుకుబడి ఎక్కువ ప్రాధాన్యత, కృషి తక్కువ ప్రాధాన్యత వహిస్తున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలదీ అదే తంతు. ఈ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం కూడా ఒక కారణమే.
తెలుగు సాహితీ క్షేత్రములో విశిష్టమైన కృషి చేసి వాసిలోనూ, రాశిలోనూ మెరుగనిపించుకున్న వారు పురస్కారాలందుకోవడంలో వెనకబడుతున్నారు. తక్కువ కృషి చేసిన వారు పురస్కారాలందుకుంటున్నారు. కృషి మదింపుకు నిబంధనలు లేవు. ఫలానా సాహితీ వేత్త కృషి బాగానే వుంది కాని ఆ వ్యక్తికి పాపులారిటీ లేదన్న కారణము పురస్కారానికి దూరముంచుతుంది.
నిజమైన సాహితీ వేత్తలెందరో తమ కృషిని ప్రచారం చేసుకోలేకపోతున్నారు. వారికి చొరవ లేదనే కారణం కూడా కమిటీ వారిని ప్రభావితం చేస్తుంది. కృషిని శ్రమను గుర్తించే బాధ్యత కమిటీ వారి మీదుంటుంది. అయినా కమిటీ వారు ఆ బాధ్యతను పక్కన బెట్టి తమ ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యత నిస్తున్నారు.
ఒక ప్రక్రియలో పురస్కార గ్రహీత నెంపిక చేసేప్పుడు ఆ ప్రక్రియతోపాటు ఆ రచయిత ఇతర ప్రక్రియల్లో కృషి చేశాడని పక్కన బెట్టడం జరుగుతుంది. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ఆచార్య సి. నారాయణ రెడ్డి లాంటి సాహితీ దిగ్గజాలు ఎన్నో ప్రక్రియల్లో నిష్ణాతులని అందరికీ తెలుసు. ఒక రచయిత ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియల్లో కృషి చేయడాన్ని సకారాత్మకముగా స్వీకరించాలి గదా!
తమ రచనలతో ఒక పుస్తకం కూడా వెలువరించని సాహితీ మూర్తుల్లో కొందరు సాహితీ పురస్కారాల కమిటీల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. అందులో కొందరు నిరంతరం శ్రమించి ఎన్నో పుస్తకాలు (శతాధికం కూడా) వెలువరించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఎద్దేవా చేస్తున్నారు. గొడ్రాలికేం దెల్సు ప్రసవ వేదనా? అన్నట్టుగా పుస్తకాన్ని అచ్చే వేయించి, వెలువరించడంలోని సాధక బాధకాలు తెలియని వారివల్ల ఒరిగేదేముంది?
పురస్కారాల కోసం నిష్ణాతులను ఎంపిక చేసేప్పుడు సరియైన నిబంధనలుంటే బాగుంటుంది. సాహితీ రంగంలో ఏయే కృషికి ఎంత ప్రాధాన్యత నివ్వాలో నిర్ణయించి, అన్నింటిని జమ చేసి పురస్కార గ్రహీతను ఎంపిక చేసేందుకు నిబంధనలను రూపొందించి అమలు చేస్తే సాహితీ వేత్తలకు న్యాయం జరుగుతుంది. అప్పడు నిజమైన నిష్ణాతులకే పురస్కారాలందుతాయని ఆశించవచ్చు. దాంతో పురస్కారాలకు గౌరవం పెరుగుతుంది.