Search
Monday 24 September 2018
  • :
  • :

ధర్మాన్ని అనుసరిస్తేనే..ఉత్తమ సమాజ నిర్మాణం

p-vishwaprasadఅత్యాశ, ధర్మబద్ధ్దత లోపం వల్లే దుర్ఘటనలు
సమాజ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో ముఖ్యం
తల్లిదండ్రులను కష్ట పెట్టకుండా నడుచుకోవటంతోనే జీవితం సార్థకత: ఎస్‌పి పి. విశ్వప్రసాద్

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్: ధర్మాన్ని అనుసరించి జీవించటంలోనే ఉత్తమ సమాజం నిర్మితమవుతుందని జిల్లా ఎస్‌పి పి. విశ్వప్రసాద్ అన్నారు.  సోమవారం తమ సమస్యలను ఫిర్యాదు రూపేణా ఎస్‌పికి ఇవ్వడానికి వచ్చిన వివిధ ప్రాంతాల ప్రజలనుద్దేశించి ఎస్‌పి మాట్లాడారు. ఆస్థి, భూ తగాదాలు, ఎక్కువగా చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అత్యాశ పెరగటం ధర్మబద్ధత లోపించటం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్‌పి తెలిపారు. చట్టాన్ని గౌరవించటం ప్రతి పౌరుని సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎస్‌పి సూచించారు. ఇతరుల సొమ్మును కాజేయాలనే ధోరణి నుండి సమాజం బయటపడవలసిన అవసరం ఉందనీ, అత్యాశ వలన గొడవలు పెరగటం, మనశ్శాంతి లోపించటం, అనారోగ్యాలు చుట్టుకోవడం మినహా ఒరిగేదేమీ ఉండదని హితవు పలికారు.

ఫిర్యాదు దారులలో ఉన్న యువతీ, యువకులను ఉద్దేశించి ఎస్‌పి మాట్లాడుతూ రానున్న కాలంలో వేలాదిగా ఉద్యోగాలకై ప్రకటనలు వెలువడనున్నాయని, క్రమశిక్షణతో ఎదగాలని యువతకు సూచించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మూడు జంటలు కులాంతర వివాహాలు చేసుకొని రక్షణ కొరకు రాగా, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడిన ఎస్‌పి ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించవలసిందిగా ఆదేశించారు. జిల్లాలో పని చేస్తున్న క్రైం స్టాఫర్ డయల్-100, షీటీమ్స్ గురించి కూడా యువతను అడిగి తెలుసుకున్నారు. సమాజ నిర్మాణం యువత పాత్ర ఎంతో ముఖ్యమని ఎస్‌పి తెలిపారు. ఫిర్యాదులు ఇచ్చిన వారిలో మహబూబ్‌నగర్‌కు చెందిన సాబేర్ కుమారుడు తప్పిపోయాడని ఫిర్యాదు చేయగా, జడ్చర్లకు చెందిన పద్మను భర్త వేధిస్తున్నాడని తగు చర్యలు తీసుకోవాలని ఎస్‌పిని కోరింది. దేవరకద్రకు చెందిన బాలరాజు షెడ్డును కొందరు వ్యక్తులు కూల్చివేసి తనపై దాడి చేశారని ఎస్‌పికి ఫిర్యాదు చేశాడు. ప్రేమ వివాహాలు చేసుకున్న యువతీ, యువకులను ఉద్దేశించి ఎస్‌పి మాట్లాడుతూ కనిపెంచిన తల్లిదండ్రులను కష్ట పెట్టకుండా నడుచుకోవటంలోనే జీవితం సార్థకత చెందుతుందని ఉద్భోదించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో దరఖాస్తుల స్వీకరణపై ఎస్‌పి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

comments