Home జాతీయ వార్తలు బిజెపి అంటే బూటకాల పార్టీ

బిజెపి అంటే బూటకాల పార్టీ

rahul

అబద్ధాల పునాదులపైనే దాని నిర్మాణం
కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి సిడబ్లుసిలో రాహుల్ విమర్శనాస్త్రం

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ (బిజెపి) అంటేనే అసత్యాల పుట్ట అని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి వ్యవస్థ అంతా అబద్ధాల నుంచే అంకురించిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత రాహుల్ అధ్యక్ష హోదాలో జరిగిన సిడబ్లుసి తొలి భేటీ ఇదే. అధ్యక్షుడి హోదాలో ఆయన ఈ కీలక సమావేశంలో ప్రసంగిస్తూ  బిజెపిపై ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు ఈ పార్టీ పుట్టిందే అబద్ధాల నుంచి అని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం, ప్రతిపక్షాలపై కట్టుకథలతో అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు బరితెగించి ప్రజా వనరులను దోపిడీ చేస్తోందని రాహుల్ విలేకరుల సమావేశంలో విమర్శించారు. అందినంతగా ప్రజా ధనాన్ని దోచుకోవడం ఈ పార్టీ తంతుగా మారిందని, ఈ విధంగా పార్టీ నేతల ఆప్తులు అందనంతగా ఎదిగిపోతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షాలను లక్షంగా చేసుకుని రాహుల్ పదునైన మాటలతో విమర్శలకు దిగారు. దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలను ప్రస్తావించారు. రాఫెల్ డీల్, జిఎస్‌టి అంతకు ముందటి పెద్ద నోట్ల రద్దు వంటివి బిజెపి వైఖరికి , వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. వనరులను కొల్లగొట్టడమే ఈ ఇద్దరు నేతల ఉద్ధేశం అని , చేసే తప్పులను అసత్యాలతో కప్పిపుచ్చుకుంటూ బిజెపి అసత్యాల పార్టీ అనేది రుజువు చేసుకుంటున్నారని తెలిపారు. పుట్టలో నుంచి పాములు వెలుపలికి వచ్చినట్లుగా ఒకొక్కటిగా వారి నిర్వాకాలు , వారు వల్లించిన అసత్యాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. రాఫెల్ ఒప్పందాన్ని మార్చివేశారని , ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనం కల్పించారని , నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. తాము ప్రధానంగా మూడు ప్రశ్నలను సంధించామని, అయితే వీటికి ఆయన జవాబు చెప్పడం లేదని వివరించారు. రాఫెల్ ఒప్పందాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అని అడిగితే దీనికి సమాధానం లేదని, ఇక 2 జి గురించి చూసుకున్నా, మోడీ తరహా వాగ్దానాలు లెక్కలోకి తీసుకున్నా అన్నీ బూటకాలే అని తేలిపోయిందని రాహుల్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై అసంబద్ధ వాదనలు, ప్రతి బ్యాంకు ఖాతాలో రూ 15 లక్షలు, చివరికి గబ్బర్ సింగ్ టాక్స్ (జిఎస్‌టి) వంటివి అన్నీ కూడా తప్పులతడకలు, నిజాలకు ఆమడదూరాలుగా మారాయని ఆగ్రహించారు. ఇక గుజరాత్‌లో మోడీ మాడల్ పూర్తిగా అబద్ధమని తేలిందని, తాను గుజరాత్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు మోడీ సాధించిందీ ఏమీ లేదని చెప్పారని, మోడీ మాడల్ లేదు గీడల్ లేదన్నారని, కేవలం ప్రజల వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారని రాహుల్ చెప్పారు. ఇక అమిత్‌షాపై విమర్శలు గుప్పిస్తూ ఈ బిజెపి నేత తన కుమారుడు జయ్ షాతో సంబంధాలు ఉన్న కంపెనీ అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు వీలు కల్పించారని విమర్శించారు. మూడు నెలల వ్యవధిలోనే షా సుపుత్రుడు తన అరలక్ష పెట్టుబడిని ఏకంగా 8౦ కోట్ల రూపాయలుగా పెంచుకున్నారని ఇదేం విచిత్రం అని వ్యాఖ్యానించారు. దీనిపై మన ప్రధాని ఏమీ చెప్పరని, వీటిపై మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. తాజాగా వచ్చిన 2 జి స్పెక్ట్రమ్ కేసు తీర్పుపై స్పందిస్తూ కాంగ్రెస్ ఇంతకాలం చేస్తూ వచ్చిన సత్యవాదనకు ఇది నిర్థారణగా మారిందన్నారు. అబద్ధాల బిజెపి ఏమిటనేది తెలియచేసిన తీర్పు ఇది అని తెలిపారు. ప్రజల ముందు బిజెపి ఏమిటనేది వెలుగులోకి వచ్చిందన్నారు.
సోనియా ఇతర ప్రముఖుల హాజరు తల్లి సోనియా హాజరుకాని దశలో ఇంతకు ముందు ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ సిడబ్లుసి భేటీని నిర్వహించారు. అయితే అధ్యక్షుడి స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ ఆరంభానికి ముందు పలువురు నేతలు రాహుల్‌ను అభినందించారు. ఈ నెల 11న రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 18న బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం నాటి భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ అధ్యక్షురాలు సోనియా, ఇతర నేతలు మోతీలాల్ వోరా, ఆజాద్, జనార్దన ద్వివేది, మల్లిఖార్జున ఖర్గే, కరణ్‌సింగ్, ఆనంద్ శర్మచ మోహిసినా కిద్వాయ్, అంబికా సోనీ, సిపి జోషీ, కమల్‌నాథ్, బికె హరిప్రసాద్, ఆస్కార్ ఫెర్నాండేజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జీలు హాజరు అయ్యారు.