Home తాజా వార్తలు జవహర్‌నగర్ బస్ డిపో ఏర్పాటు హుళక్కేనా…

జవహర్‌నగర్ బస్ డిపో ఏర్పాటు హుళక్కేనా…

Bus Depot

 

జవహర్‌నగర్ : ఏళ్లు గడుస్తున్నా జవహర్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు మోక్షం కలగడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పట్టించుకోకపోవడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మౌళిక వసతుల్లో ప్రధానంగా రవాణ సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రవాణ సౌకర్యం ఉన్న గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. అయితే జవహర్‌నగర్‌కు ప్రజారవాణా ఉన్నా పూర్తిస్థాయిలో లేకపోవడంతో స్థానికులు ఇంకా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జనాభా పరంగా స్థానికంగా బస్ డిపో ఏర్పాటుకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంఎల్‌ఎ కేఎల్‌ఆర్ బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవతో డిపో ఏర్పాటుకు ప్రభుత్వం అమోదం తెలిపింది. డిపో ఏర్పాటుకు జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌లో సర్వే నెంబర్ 257లో 2 ఎకరాలు, సర్వే నెంబరు 258లో 5 ఎకరాల స్థలం కేటాయించారు.

ఇందులోనే బస్ డిపో, బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో మేడిపల్లి మండలం చెంగిచర్ల గ్రామంలో కూడా చెంగిచర్ల బస్ డిపో ఏర్పాటుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యుడు సర్వే సత్యనారాయణ, స్థానిక ఎంఎల్‌ఎ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి జవహర్‌నగర్ , చెంగిచర్ల డిపోల ఏర్పాటుకు చెంగిచర్లలోనే ప్రారంభోత్సవాలు చేశారు. చెంగిచర్ల డిపో నిర్మాణం సంవత్సరంలోపే నిర్మాణం పూర్తిచేసుకుంది. కానీ జవహర్‌నగర్ డిపో నిర్మాణం మాత్రం నేటికి కార్యరూపం దాల్చలేదు. ఇక సంవత్సరంలోపు నిర్మాణం పూర్తికాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అయినప్పటికి కేఎల్‌ఆర్ తన వంతు ప్రయత్నం చేసినప్పటికి నిధులు తిరిగి మంజూరు కాలేదు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో మేడ్చల్ ఎంఎల్‌ఎగా గెలిచిన మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఆ ఊసే ఎత్తలేదు. దీంతో ఎక్కడి వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లు ఉంది. దాదాపు 2 లక్షల జనాభా ఉండి 90 కాలనీలతో విస్తరించిన జవహర్‌నగర్ మున్సిపాలిటీ నుంచి దూర ప్రాంతాలకు సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

టిఆర్‌ఎస్ పాలనలోనైనా కార్యరూపం…

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక గ్రామాలకు రోడ్లు కూడా వేయడం జరిగింది. కానీ, జవహర్‌నగర్ నుంచి ఈసిఐఎల్, మహాత్మాగాంధీ బస్టాండ్, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. కనీసం కుషాయిగూడ నుంచి జవహర్‌నగర్‌కు కూడా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. బస్ డిపో నిర్మాణం జరిగితే ఆర్టీసికి అధిక ఆదాయం కలుగుతుంది. ఆదాయం వచ్చే మార్గం ఉన్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ఆర్థం కావడంలేదని స్థానికులు విస్మయం చెందుతున్నారు. స్థలం కేటాయించినా, నిధులు మంజూరు చేసినా బస్ డిపో నిర్మాణంలో జరుగుతున్న జాప్యమేమిటో ఆంతర్యం ఆర్థం కావడంలేదు. రాష్ట్ర మంత్రి మేడ్చల్ ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో జవహర్‌నగర్ దశ, దిశ మారుస్తానని హామీ ఇచ్చారు. ఆయన హయాంలోనైనా బస్ డిపో నిర్మాణ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జవహర్‌నగర్ వాసులు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.

The Bus Depot should be Established