Home రాష్ట్ర వార్తలు జంట పేలుళ్ల కేసు ప్రత్యేక కోర్టుకు

జంట పేలుళ్ల కేసు ప్రత్యేక కోర్టుకు

గోకుల్ చాట్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్ల కేసు విచారణకు చర్లపల్లిలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు
26వ తేదీ నుంచి చేపట్టనున్న విచారణ

Gokul-Chat

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన గోకుల్ చాట్, లుంబినీపార్క్ జంట బాంబుపేలుళ్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కోసం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేక కోర్టు (నాంపల్లి మెట్రో పాలిటన్ స్పెషల్ కోర్టు)ను ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి కేసు విచారణ ఇక్కడే చేపడతారు. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను శనివారం భారీ భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. మక్కా మసీ దు కేసులో నిందితులుగా ఉన్న ఒక వర్గం వారు నిర్దోషులుగా ఇటీవలే కోర్టు ప్రకటించి కేసును కొట్టివేసింది. దీంతో మరో వర్గం వారు ఈ తీర్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లుంబిని పార్క్, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న మరో వర్గంవారిపై పక్కా సాక్షాధారాలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో నిందితులకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. త్వరలో తీర్పు వెలువడున్న నేపథ్యంలో విచారణను నాంపల్లి కోర్టులో సాగిస్తే భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో భద్రతా దృశ్యా విచారణను ప్రత్యేక కోర్టు ద్వారా చర్లపల్ల  జైలులో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దర్యాప్తు అధికారులు (కౌంటర్ ఇంటెలిజెన్స్) హైకోర్టులో రెండు నెలల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవలే చర్లపల్లి జైలులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల మేరకు నాంపల్లి మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టును చర్లపల్లికి మార్చారు. ఇక నుంచి ఈ జంట బాబు పేలుళ్ల కేసు విచారణ చర్లపల్లి జైలులోనే నడుస్తుంది. తదుపరి విచారణ ఈ నెల 26న నాంపల్లి కోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్లపల్లికి వచ్చి కేసును విచారిస్తారు. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఐదుగురు నిందితులు ఇసార్ అహ్మద్, అక్బర్ ఇస్మాయిల్, షఫిక్ సయిద్, ఫారూఖ్ షర్ఫోద్దిన్,అంజుములను భారీ బందోబస్తు మధ్య చర్లపల్లికి తరలించారు. ప్రస్తుతం వీరు మానస సెల్ఫ్‌బ్యారెక్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నారు.  కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి… 2008 ఆగస్టు 25న కోఠిలోని గోకుల్‌చాట్, సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీపార్క్‌లో సాయంత్రం 6.30 గంటలకు జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనలో 42 మంది చనిపోగా 70 మంది క్షతగాత్రులయ్యారు. ఈ బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ (ఐఎం) ఉగ్రవాదులని గుర్తించారు.