Home రాష్ట్ర వార్తలు ఎల్లలు లేని తెలుగు

ఎల్లలు లేని తెలుగు

kvnd

ఎందరో మహానుభావుల తెలంగాణ 

కొనియాడిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
వెలుగుల వెల్లువలో ఘనంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుక

హైదరాబాద్ : తెలుగు భాష దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే వారధి మా త్రమే కాక ప్రపంచ భాష అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. నగరంలోని ఎల్‌బి స్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగి న ప్రపంచ తెలుగు మహాసభల సమాపన ఉత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి గౌరవం, విశ్వ విలువలు కలిగిన భాష తెలుగు అని పేర్కొ న్నారు. ముగ్గురు రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, నీలం సంజీవరెడ్డి, దివంగత ప్రధాని పివి నర్సింహారావులు తెలుగువారేనని గుర్తు చేశారు. ప్రపంచ గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ళ తెలుగువాడేనని, అమెరికా ప్రభుత్వంలోనూ తెలుగువారు ఉన్నారని, అక్కడి పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్త లు, శాస్త్రవేత్తల్లో చాలా మంది తెలుగువారు ఉన్నారన్నారు. కుమ్రంభీం, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామిలాంటి ఎంతో మందికి తెలంగాణ జన్మనివ్వడం సంతోషమని చెప్పారు. దేశ విదేశాల నుంచి తెలుగువారు ఈ మహాసభలకు రావ డం ఆనందంగా ఉందని, భాషాభిమా ని మాత్రమేగాక తెలుగు సాహిత్యం పై అభిలాష ఉన్న సిఎం కెసిఆర్ చొరవతో జరిగిన ఈ సభలను తెలుగువాడైన ఉపరాష్ట్రపతి ప్రా రంభించడం, ముగింపునకు తాను రావడం సంతోషమన్నారు. తదుపరి మహాసభల కోసం ఎదురు చూస్తుంటానని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల వరుసలో ఇది ఐదవది అయినా తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న తొలి మహాసభ అని పేర్కొన్నారు. తా ను రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఈ మహాసభలు జరగడం తెలుగు భాషకు, సం స్కృతికి, వారసత్వానికి, గొప్పదనానికి సరైన గౌరవం ఇవ్వడమేనని అన్నారు. దేశంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు రెండవదని అన్నారు. మన దేశానికి తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి చాలా చేసిందని, మానవ నాగరికతలో ఈ భాష పాత్ర మరువలేనిదని అన్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారని, చరిత్ర ఆయనను ఒక సమర్ధవంతమైన పాలకుడిగా, తెలుగు భాష అభివృద్ధి కాముకుడిగా పేర్కొనిందని గుర్తుచేశారు. తెలుగు సాహిత్యం లోతుల్లోకి వెళ్తే నన్నయ, తిక్కన మొదలు 19వ శతాబ్దంలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరధి, అల్లూరి సీతారామరాజు ఇలా ఎంతో మంది సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. సామాన్యుల కష్టాలపై శ్రీశ్రీ రాసిన పాటలుగానీ, దాశరధి పాటలుగానీ ఇప్పటికీ ప్రజల నోళ్ళపై నానుతూనే ఉన్నాయని అన్నారు. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల కష్టాలను తన సాహిత్యంలో ప్రస్తావించారని, ఆయనతో విభేదించేవారు సైతం గౌరవిస్తారని అన్నారు. త్యాగరాజ కృతులు ఇప్పటికీ కర్నాటక శాస్త్రీయ సంగీతంలో వినిపిస్తూ ఉంటాయని అన్నారు. అటవీ హక్కులు, సహజ వనరుల అంశంలో ఆదివాసులను ఉత్తేజపరిచిన కొమ్రంభీంకు జన్మనిచ్చిన నేల తెలంగాణ అని కొనియాడారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ, దళిత ఉద్యమ నేత భాగ్యరెడ్డివర్మ లాంటివారు పుట్టిన నేల కూడా తెలంగాణేనని అన్నారు.
తెలుగు ప్రపంచ భాష : నేటి పరిస్థితుల్లో తెలుగు భాష ప్రపంచ భాషగా అవతరించిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా మొదలు ఆగ్నేయాసియా వరకు ఎంతో మంది తెలుగువారు వివిధ రంగాల్లో విజేతలుగా ఉన్నారని అన్నారు. 1920వ దశకంలో జీవవైద్య శాస్త్రవేత్త అయిన ఎల్లాప్రగడ సుబ్బారావు హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకున్నారని, ఎన్నో రంగాల్లో తెలుగువారి ప్రతిభా పాటవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయన్నారు. తెలుగు భాషలో చాలా పదాలు సంస్కృతం, హిందీ, ఉర్దూల నుంచి వచ్చి చేరినవి ఉన్నాయని, కేవలం పదాలు మాత్రమే కాకుండా ఆలోచనలను కూడా తనలో ఇముడ్చుకునే గొప్ప సంస్కారం తెలుగు భాషదని అన్నారు. అనేక రాష్ట్రాల సంస్కృతులకు కూడా తెలంగాణ కూడలిగా ఉన్నదని అన్నారు. భౌగోళికంగా కూడా వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఒక వారధి లాంటిదని అన్నారు.
హైదరాబాద్ ‘బాహుబలి’: హైదరాబాద్ నగరానికి చాలా విశిష్టతలు ఉన్నాయని పేర్కొన్న రాష్ట్రపతి ‘బాహుబలి’ నగరంగా పొగిడారు. వ్యాక్సీన్ తయారీ, ఔషధాల ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త అన్వేషణలు, పరిశ్రమల స్థాపన… ఇలా అనేక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిందని అన్నారు. ఢిల్లీలోనూ, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు వంటలకు, పచ్చళ్ళకు విపరీతమైన అభిమానం ఉందన్నారు. కొత్తగా ఎదిగిన రాష్ట్రమే అయినా సులభ వాణిజ్య విధానంలో తొలి స్థానంలో నిలిచిందని, ఇటీవలనే గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని కొనియాడారు. అనేక అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించిన హైదరాబాద్ నగరం గ్లోబల్ నగరంగా, మెట్రోపాలిటన్ నగరంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. అభివృద్ధిలో రెండు కొత్త తెలుగు రాష్ట్రాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయన్నారు. సినిమా రంగంలో సైతం హైదరాబాద్ నగరం ‘బాహుబలి’ అని కొనియాడారు.
దేశ భాషలందు… నుంచి ఏ దేశమేగినా వరకు : ‘సోదర సోదరీమణులకు… ’ అంటూ తెలుగులో సంబోధించి శ్రీకృష్ణ దేవరాయల గేయం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’తో ఉపన్యాసాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ‘ఏ దేశమేగినా …’ గేయంతో ముగించారు. ‘మన బడి’ అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభు త్వం చిన్నారుల్లో తెలుగు భాషను నేర్పడానికి చేస్తున్న కృషిని అభినందించారు. 2008లో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతూనే ఉందన్నారు. ప్రాచీన భాష విషయంలో భాషాభిమానిగా సిఎం కెసిఆర్ కృషి, సాహిత్యాభిలాషిగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని వ్యాఖ్యానించారు.