Home కలం మహాకవి జాషువా వర్గదృష్టి

మహాకవి జాషువా వర్గదృష్టి

Jashuva

మహాకవి జాషువా భావకవితోద్యమ కాలంలోనూ, అభ్యుదయ కవితోద్యమ కాలంలోనూ చైతన్యవంతంగా కవిత్వం రాశారు. భావకవితా రీతిలో ప్రభావితుడైనా, తన ప్రత్యేకత ప్రతిఫలించే భావకవిత్వం రాశారు. అలాగే అభ్యుదయ కవిత్వం కూడా ఆయనపై ప్రభావం చూపింది. అభ్యుదయ కవిత్వానికి నేపథ్యమైన మార్కిస్టు దృక్పథాన్ని ఆయన స్వీకరించలేదు గాని, అభ్యుదయ కవిత్వానికి ప్రధానమైన భావధారలన్నిటి చైతన్యమూ ఆయన కవిత్వంలో కొనసాగింది. జాషువా మార్కిస్టు దృక్పథంతో కవిత్వం రాసిన వారు కాదు కాని అభ్యుదయ ఆవేశాన్ని మెండుగా స్వీకరించారు.
సంకీర్ణ భావధారలున్న ఆనాటి కవుల్ని అంచనా వేసేటప్పుడు, వారిలోని మౌలికావేశాన్ని గ్రహించడం అత్యవసరం. జాషువాకి గాంధీతత్వం మీద, సంప్రదాయం మీద, పురాణేతిహాసాల మీద గౌరవ దృష్టి వుండి వుండవచ్చు. కాని ఆయనలోని మౌలికావేశాలు అభ్యుదయ నేపథ్యం కలిగినవే. జాషువా స్వీయముద్ర నిజానికి ఆ నేపథ్యంలోనే వుంది. అలా వుండడానికి తగిన జీవితం ఆయనకు వుంది. పాండిత్యం వల్ల గాని, ఆకర్షణ వల్ల గాని, కీర్తికాంక్షతో గాని జాషువాకి ఆ ఆవేశాలు ఏర్పడలేదు. అవి, తన జీవితానుభవాల వల్ల సహజంగా ఆయనలో వికసించాయి. వర్గదృష్టి ఏర్పడడానికి ఆయనకి ఏ చదువులూ అక్కర్లేదు. పీడిత వర్గానికి చెంది, ఆర్థిక, సాంస్కృతిక సామాజికమైన అణచివేతలకు గురైన వారు కాబట్టి వర్గ స్పృహ ఆయనలో అత్యంత సహజంగా రూపుదిద్దుకుంది. తనపై ప్రభావం కలిగించిన ప్రాచీన, భావ కవిత్వాల రీతుల్ని అనుసరిస్తూనే, ఆయన తనలోని వర్గ కవికి సరైన వ్యక్తీకరణ చెయ్యగలిగారు.
వర్గ, స్పృహ కలిగిన కవికి, సమాజంలో రెండు వర్గాలు ఉన్నై అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి దోపిడి చేసే వర్గం రెండోది దోపిడికి గురికాబడే వర్గం దోపిడీ చేసే వర్గాలు రాచరిక, భూస్వామ్య, పెట్టుబడిదారీ భావజాలంతో దోచుకుంటై, ఈ భావజాలం మీద జాషువాకి విపరీతమైన ఆగ్రహం వుంది. ఆ ఆగ్రహాన్ని అనేకచోట్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తీకరిస్తారు. రాచరిక దురహంకారానికి, దుర్మార్గానికి, ఎంత గొప్ప ప్రతిభ కలవాడైనా బానిసగా భావించడం, తన కోరికని తీర్చడానికే ప్రజలందరూ వున్నారనుకోవడం అలాంటివన్నీ ప్రధానమైన లక్షణాలు. వీటన్నిటినీ జాషువా “ఫిరదౌసీ” కావ్యంలో తుత్తునియలు చేశారు.
గజనీ మహమ్మదు క్రూరత్వాన్ని, ఎన్నో పద్యాల్లో వర్ణించినా రానంత స్పందనని, కవి ఒక్క పాదంలో ధ్వని పూర్వకంగా చెప్పాడు.
“పదియునెనిమిది విజయ రంభల వరించి
గంగా జలమున నెత్తుటి కత్తి కడిగి”
గంగానది భారతీయులకి అత్యంత ఆరాధ్యమైన నది. వేల మంది భారతీయుల్ని చంపిన కత్తిని గంగా జలంతో కడుకున్నాడనంలో, రాజు క్రౌర్యం అనిర్వచనీయమైన ధ్వని ద్వారా వ్యక్తమవుతుంది. జాషువా రచనలోని ధ్వని ఎక్కడైనా ఇంత అప్రయత్న పూర్వకంగానే వుంటుంది.
చివరికి రాజులో పశ్చాత్తాపం కలిగి, మళ్లీ బంగారు నాణాలు కవి ఇంటికి పంపినా, ఆయన కుమార్తెతో, కవి, తిరిగి పంపేటట్లు చేశారు. అంతేగాక కావ్యం ముగిస్తూ.
‘గజనీ పట్టణ వీధులన్ నృపాని కంకాళంబు సప్రాణమై
రజనీ మధ్యమునందు క్రుమ్మరుచు ఆర్త ధ్వానముల్ చేయు’ అన్నారు. ఇలా రాచరికం లక్షణాల మీద వున్న తన ఆగ్రహాన్నంతా, ‘ఫిరదౌసి’ కవి మీద పెట్టి, మహాకవి జాషువా వ్యక్తపరిచారు. ఈ కావ్యంలోని రాజు దుర్మార్గ రాచరికానికంతటికీ ప్రతీక.
భూస్వామ్య విధానం వల్ల కలిగిన అనర్థాలన్నీ జాషువా పద్యాల్లో కనిపిస్తే, శ్రమదోపిడికి మొట్టమొదటగా గురైన కులంలో పుట్టిన జాషువాకి ఈ అనర్థాలన్నీ అనుభవ పూర్వకమే. ఆయన పద్యాల్లో అక్కడక్కడ దైవభక్తి కనిపించినా, మానవతా దృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి మతంతో రాజీలేదు. అన్ని మతాల్ని విమర్శిస్తారు. పైగా ‘నేను కుల మతాల చేత కట్టుపడను’ అని బాహాటంగా చెప్పుకున్నారు. మత భావాల్ని విమర్శించేటప్పుడు, వాటి వెనకనున్న ఆర్థిక నేపథ్యాన్ని స్ఫుటంగా చెప్పడం జాషువా మౌలికావేశాల్లోని వర్గదృష్టికి నిదర్శనం. ఉదాహరణకి ఈ పద్యం తీసుకోవచ్చు.

“ప్రతిమల పెళ్లి చేయుటకు వందలు వేలు వ్యయింత్రుగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్చదీ భరతమేదిని ముప్పది మూడుకోట్ల దే
వత లెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్త్తులారునే?”

‘భాగ్యవిహీనుల క్షుత్తు’ మీదనే ఎప్పుడూ జాషువా ప్రధాన దృష్టి. దాదాపు ఆయన అన్ని కావ్యాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలితో వున్న వారిని ఆదుకోవడం కంటే గొప్ప విషయం, లేదని జాషువా అన్ని కావ్యాల్లోనూ ఎక్కడో ఒక చోట చెబుతూనే వుంటారు. ‘ఆకలి’ మీద ఇంతటి కేంద్రీకరణ అభ్యుదయావేశానికి మొదటి గుర్తు. పేదరికం ప్రసక్తి లేకుండా జాషువా కావ్యం వుండదు. ‘స్వప్నకథ’లో ఒక చోట ఇలా అంటారు.

‘పేదరికము పెద్ద వింత విద్యాశాల
దానిలోన లజ్జ గానబడదు
ఉదర మొజ్జయగుచు ఓరంత ప్రొద్దులు నోర్మి
విద్దె నేర్పుచుండునచట’
ఆకలి గురించి ఇంత తెలిసిన కవికి, చాలా సహజంగా వున్నవారికీ లేని వారికీ వున్న తేడా హృదయాన్ని కలచివేస్తుంది. ఈ భావన కూడా జాషువాలో అడుగడుగునా కన్పిస్తుంది. ‘స్వప్నకథ’లోనే మరోచోట ఇలా అంటారు.
‘ఒకడు చిన్నమ్మ కరోడల నూగుచుండ
ఒకడు పెద్దమ్మ కటికి దృష్టికి తపించు
ప్రకృతి జనయిత్రి అనుగు గారాల సుతుల
ఒకని ద్వేషించు ఒకని అభ్యుద్దరించు’

‘చిన్నప్పటి నుండియు నా కన్ను పరుల కష్టములను గని ఓరువలేదు’ అని ఒక స్త్రీ ద్వారా చెప్పించిన మాటలు తనను గూర్చి కవి అన్నవే.
తన కులం కారణంగా సమాజంలో దారుణమైన అవమానాలకు గురైన జాషువాకి దళితుల అణచివేతలపై కలిగిన ఆగ్రహం ఎంత తీవ్రమైనదో ఊహించుకోగలం. ఆయన కవిత్వంలో ఈ ఆగ్రహం ఒక బలమైన అభివ్యక్తి పొందింది. దళితుల అణచివేతను గూర్చి 20వ శతాబ్ది మొదటి నుంచీ తెలుగులో వచ్చిన కవిత్వాన్ని పరిశీలిస్తే మహాకవి జాషువా ఆ విషయంలో తెచ్చిన మలుపు ప్రత్యేకమైంది. పైకి కొన్ని పద్యాల్లో కరుణామయంగానూ, కొన్నిటిలో సామరస్యం గానూ, వేదనతోనూ రాస్తున్నట్లు కనిపించినా, జాషువా ముద్ర ప్రతిఘటన పూర్వకమైన ఆగ్రహాన్ని ప్రకటించడం లోనే వుంది.

‘క్రూరుల్ కుత్సితులు అస్మదీయులు హక్కుల్ దోచుకొ
న్నారు నన్నూరింబైటన్ నెట్టినారు ఇప్పడు నన్నోదార్చుచున్నారు’

‘ ఈ దేశంలో శ్రమ విభజన కాదు. శ్రామిక విభజన జరిగింది’ అన్నారు డా॥ అంబేద్కర్. ఎక్కడ దళిత ప్రసక్తి వచ్చినా దళితుని శ్రమదోపిడి గురించి చెప్పడం జాషువాలో తీవ్రంగా కనిపిస్తుంది. దళితుని శ్రమంతా భూమి నాశ్రయించుకుని వున్నదే. ఈ విషయాన్ని ఎంతో తీవ్రంగా చెప్పడం, వర్ణానికున్న వర్గ లక్షణాల్ని స్పష్టంగా గుర్తించడమవుతోంది.

‘వాని రెక్కల కష్టంబులేనివాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమట లోడ్చి, ప్రపంచమునకు
భోజనము పెట్టు వానికి భుక్తి లేదు’
పరాయీకరణకు గురైన దళితుణ్ణి వర్ణించడం గమనించదగింది.
వర్గభేదాన్ని గూర్చి చెప్పడమే కాకుండా, ఉన్నత వర్గం పేద వర్గాన్ని చేసే దోపిడిని కూడా ,సరిగ్గా అభ్యుదయ కవుల్లాగానే చెప్తారు జాషువా.
‘ఎవడారగించు అమృత భోజనంబున / కలిసెన్ ఈ లేమ గంజిబువ్వ
ఎవడు వాసము చేయు శృంగార సౌ/ ధానమునిగెన్ ఇన్నారి పూరి గుడిసె
ఎవని దేహము మీది ధవళాంబరములలో / వొదిగెన్ ఇన్నాటి ముదుకుపంచె
ఎవడి దేహము పేర్పు మృదు తల్పములలోన / నక్కెనో ఈయమ్మ కుక్కి పడక
వసుధపై నున్న భోగ సర్వస్వమునకు
స్వామిత వహించి మనుజుండు ప్రభావమందు
ఎవడపహరించె ఏమయ్యె దీని సుఖము?’

అభ్యుదయావేశానికి పరాకాష్ట రాజకీయ దృక్పథం. రాజకీయ విషయంలో జాషువా గాంధీ సిద్ధాంతాలపై అవగాహన గల వారైనప్పటికి, పేదవారికీ, గొప్ప వారికీ భేదాన్ని పెంచే రాజకీయాన్ని తీవ్రంగా ద్వేషించిన వారు. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదలివెళ్లిన తర్వాత, నల్లదొంగల చేతిలో వ్యవస్థ ఎంత అవినీతి మయమయిందో ‘స్వయం వరం’ కావ్యంలో చాలా వ్యంగ్యంగా వర్ణిస్తారు. పెట్టుబడిదారి వ్యవస్థ ఏ విధంగా ధనిక వర్గాన్ని తయారుచేస్తుందో చెప్తారు. ఈ విషయంలోనే అనేక కోణాల్ని స్పృశిస్తారు.
ఉదాహరణకి రెండు అంశాలు

‘తెలవారేలేడ్చి చేయునాడు ఇతడు మంత్రిత్వంబు సాధించి
ఆప్తులకున్ దగ్గరి చుట్టుపక్కల కుద్యోగంబు లిప్పించి
అన్యుల కన్యాయము చేసినాడనుచు నించున్
వర్ణ విద్వేషముల్ పులులై
ఎంతగి సత్కళారముల గొంతుల్ నొక్కి భక్షించెన్?’
“అటకాయించెడు శాసనాల చెవుల ల్లాడించుచున్
బ్లాకు మార్కెటు సాగించు బెహారిమిన్న ఇతడు
ఆర్పెన్ పెక్కు సంసారముల్ / చిటికెడంత దయారసంబు
ఇతని కుక్షిన్ చీల్చినంగానము / ఇక్కుటిలుండు ఉత్తమ దేశభక్తుడని
పల్కుక పత్రికా రాజముల్’

ఎక్కడో ఒకటి, రెండు చోట్ల కొన్ని అంశాలు కనిపిస్తే, ఆశ్చర్యం లేదు. కాని అభ్యుదయావేశం అన్ని సూక్ష్మసూక్ష్మ వివరాలతో కవిత్వం నిండా అంతర్వాహినిగా ఉండడం మహాకవి జాషువాలోని విశిష్టత.
ఇలా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక రాజకీయ అంశాలలో వర్గ దృక్పథం మహాకవి జాషువాలో విశిష్టంగా వుంది. ఆయన గాంధీ సిద్ధాంతాన్నీ మానవతా సూత్రాల్నీ, కరుణ రస ప్రాధాన్యాన్నీ విశ్వసించిన వారే. అయినా జాషువా జీవితానుభవాలు, సామాజిక స్పందనా ఆయనలో అభ్యుదయావేశాన్ని రగిలించినై. దేవుడి మీద నమ్మకాన్ని చెప్పినప్పటికంటే, దేవుడి పేరు మీద జరిగే అన్యాయాల్ని వర్ణించేటప్పడు హేతువాదికి దగ్గరగా వస్తారు. గాంధీ సిద్ధాంతాన్ని నమ్మినా, నల్లదొంగల అన్యాయాల్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్తారు. మానవతా, కరుణ భావాల్ని రూపుగట్టినా, పేదతనాన్ని, కులం కారణమైన అణచివేతనీ, ధనిక వర్గాల దోపిడీని ప్రతిఘటన పూర్వదశయైన ఆగ్రహంతో వర్ణిస్తారు. మార్కిస్టు పరిష్కారాన్ని జాషువా విశ్వసించకపోయినా మౌలికమైన నిజాయితీతో కూడిన ఆవేశాలన్నీ ప్రథమశ్రేణి అభ్యుదయ కవులకి తీసిపోకుండాఉంటాయి. జాషువా కవిత్వంలో వర్గ దృక్పథం అడుగడుగునా కనిపిస్తుంది.
కర్మసిద్ధాంతం నుంచి కవిత్వం దాకా, నన్నయ్య నుంచి వేమన దాకా ఆయన హృదయాన్ని స్పృశించి, స్పందింపజేసిన ప్రతి అంశాన్ని రసవత్తరంగా మలచిన సామాజిక సందేశాన్ని అందించిన కవి జాషువా. సమాజ సముద్ర మథనం చేశారు జాషువా. ‘ముసాఫరులు’లోని ఈ పద్యం జాషువా వర్గ దృక్పథాన్ని తేటతెల్లం చేస్తుంది.
‘కోటానుకోట్ల నరులొక /మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం
చాటింపు మీ సువార్తన్ /జాటింపుము జీవితంబు సార్థక్యమగున్’
1970ల నుండి విప్లవోద్యమం రాకపోతే శ్రీశ్రీ “మహాప్రస్థానం” గురించి ఎన్ని సమీక్షలొచ్చేవో తెలియదు. శ్రీశ్రీ కవిత్వంలో ఎన్ని భరించరాని సంకీర్ణతలున్నా, నిబద్ధతా సిద్ధాంతం వచ్చిన తర్వాత, మహా ప్రస్థానంలో నిబద్ధత కలిగిన పదిలోపు కవితలపై ప్రగతిశీల సమీక్షలు అసంఖ్యాకంగా వచ్చినవి. అలాగే దళిత దృక్పథం పరంగా జాషువాలోని ప్రగతిశీల భావాల్ని గూర్చి ఎంతో పరిశీలన జరగవలసి వుంది. ప్రగతిశీల భావాలకు సరిగ్గా సరిపోయిన ప్రజాశైలిలో, అద్భుతమైన అభివ్యక్తితో పద్యాలు చెప్పినవారు జాషువా ఒక్కరే.