Home దునియా దృశ్య కావ్యాల దర్శకుడు

దృశ్య కావ్యాల దర్శకుడు

BN-Reddy

అసభ్యత, అశ్లీలతకు తావులేకుండా సందేశాత్మక ప్రయోజనాత్మక చిత్రాలు రూపొందించాలనే తపన వున్న వ్యక్తి బి.ఎన్. రెడ్డి. ఈయన అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. దర్శక నిర్మాతగా తీసింది తక్కువ చిత్రాలే అయినా, దర్శకుడుగా బయట నిర్మాతలకు తక్కువ చిత్రాలే చేసినా కథలోగాని, సన్నివేశాల్లో గాని, సంభాషణల్లోగాని, సెట్స్, సెట్‌ప్రాపర్టీ విషయంలోగాని అణుమాత్రమైనా రాజీపడకుండా దృశ్యకావ్యాల్లాంటి చిత్రాలు రూపొందించారు. అందుకే అవి క్లాసిక్స్‌గా పేరు తెచ్చు కున్నాయి. విజయాపతాకాన పలు చిత్రా లు నిర్మించిన, విజయావాహినీ స్టూడి యో, విజయాగార్డెన్స్ అధినేత బి.ఎన్. నాగిరెడ్డికి అన్న బి.ఎన్.రెడ్డి. సినిమా ద్వారా ప్రేక్షకుడుకి నీతి, సందేశం అందకపోతే ఆ చిత్రం తీయాల్సిన అవసరం లేదు. దర్శక నిర్మాతలు సమాజానికి బాధ్యత వహించాలి కనుకనే తను ఈ అభిప్రాయానికి కట్టుబడి వుంటానని ఆయన అనేవారు.

కడప జిల్లా పులివెందుల తాలూకాలోని కొత్తపల్లి గ్రామంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ దంపతులకు 16111908న పెద్దకుమారుడుగా జన్మించారు నాగి రెడ్డి. కొండారెడ్డి, రామలింగారెడ్డి ఆ తరువాత జన్మించారు. తండ్రి మద్రాసులో ఉల్లిపాయల వ్యాపారం, కమీషన్ వ్యాపారం భారీగా విదేశాలతో నిర్వహిస్తుండేవారు. బి.ఎన్.రెడ్డికి మాత్రం చదువు మీద ఆసక్తి తక్కువ వుండేది. జి.డి.ఎ చదువు (చార్ట్‌ర్డ్ అక్కౌంటెన్సీతో సమానమైనది) పూర్తిచేసి తండ్రి వ్యాపారం ఇష్టపడక ఉద్యోగంలో చేరారు. చిన్నతనం నుంచి సాహిత్యం మీద రంగస్థలం మీద ఆసక్తివుండేది. చెన్నపురి ఆంధ్రమహాసభలకు తరచు హాజరౌతూ, అక్కడ జరిగే సాహితీ, సాంస్కృతిక కార్య క్రమల్లో కీలక బాధ్యతలు కూడా నిర్వహించేవారు. ఇది తండ్రికి ఇష్టం వుండేది కాదు. అందుకే చేతికి అందివచ్చిన సాగిరెడ్డికి వ్యాపార బాధ్యతలు అప్పగించినప్పుడు తండ్రి చేసిన పనికి సంతసించి తమ్ముడిని ఆశీర్వదించారు.

ఆంధ్రనాటక సంఘంలో సభ్యుడైన బి.ఎన్.రెడ్డి నాటకాల్లోనూ నటించేవారు. అలా అప్పుటి ప్రముఖ నటులు బళ్లారి రాఘవాచారి, స్థానం నరసింహారావు, వేమూరి గగ్గయ్య ప్రముఖులతో గాఢస్నేహం వుండేది. కలకత్తాలోని శాంతినికేతన్‌లో కొంత కాలం వుండటంతో కళలు, సాహిత్యంపై మరింత మక్కువ పెరిగింది. వరవిక్రయం నాటకంలో బి.ఎన్.రెడ్డి పోషించిన పాత్ర చూసిన మహాత్మగాంధీ అభినందించడం విశేషమే. బెంగాలీ సాహిత్యం, బెంగాలీ నాటకాలపై ఆసక్తి పెరిగాక బొంబాయి వెళ్లి మరాఠీ, రంగస్థలంపై కూడా అవగహన ఏర్పరుచుకున్నారు. బర్మా సందర్శించినప్పుడు, అక్కడే చైనా ఒపేరాలు తిలకించి కళలపై మరింత అభిరుచి పెంపొందించుకున్నారు. ఈ ప్రభావం ఆయన రూపొందించిన సినిమాలపై వుండేది.

బి.ఎన్.కె.ప్రెస్‌ని కూడా నిర్వహించేవారు బి.ఎన్.రెడ్డి. గూడవల్లి రామబ్రహ్మం, చక్రపాణి తదితరులు ఆ రకంగా పరిచయం అయ్యారు. టాకీ పులిగా గుర్తింపు పొందిన హెచ్.ఎం.రెడ్డి చిత్ర నిర్మాణాలు ఫైనాన్స్ కోసం కొల్లావూర్ నుంచి మద్రాసు రావడంతో గూడవల్లి కూడా ప్రోత్సహించడంతో తండ్రి నుంచి పాతికవేలు తీసుకున్నారు. నటి కన్నాంబ కూడా భాగస్వాములయ్యారు. ఆరోజుల్లో రంగూన్ రౌడీ నాటకం బహుళ ప్రజాదరణ పొందిన, సామాజిక ప్రయోజనం వున్నదిగా గుర్తింపు పొందింది. మద్యపాన వ్యసనం, అందమైన భార్యవున్నా పరాయి స్త్రీపై మోజుపడటం, భార్యాభర్తల మధ్య సయోధ్యలేకపోవడం, మహిళలను కించపరచడం, భార్యని రకరకాలుగా హింసించే భర్త వంటి అంశాలతో ఈ నాటకం వుండేది. టైటిల్‌ని గృహలక్ష్మిగా పెట్టి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు.

కన్నాంబ, కాంచనమాల, రామానుజాచారి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారానే నాగయ్య ఒక మంచి పాత్రలో సినీనటుడుగా పరిచయం అయ్యారు. గృహలక్ష్మి విడుదలై ఘనవిజయం సాధించింది. మద్రాసులోని కార్తికేయ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంది. హెచ్.ఎం.రెడ్డితో కొన్ని అంశాల్లో విబేధించిన బి.ఎన్.రెడ్డి తన అభిరుచితో మంచి చిత్రాలు రూపొందించాలని తలచి, రోహిణీ నుంచి విడిపోయి వాహినీ పిక్చర్స్ సంస్థని నెలకొల్పారు. టెక్నిషియన్స్‌గా గుర్తింపు పొందిన కె.రామనాథ్, ఎ.కె.శేఖర్ నటులు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, కె.వి.రెడ్డి పూర్తి సహకారం అందించడంతో పాటు కె.రామ్‌నాధ్ ఒత్తిడి చేయడంతో వందేమాతరం చిత్రాన్ని తొలుత దర్శకత్వం వహిస్తూ రూపొందించారు. కాంచనమాల, నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, దొరైస్వామి, కళ్యాణీ, శేషుమాంబ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం 1939లో హిట్ కావడమే కాకుండా నాగయ్యను స్టార్‌ని చేసింది. పలు కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మైసూర్ ప్రాంతాల్లోని ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా లభించింది.

బాల్యవివాహాలను నిరసిస్తూ, విధవా పునర్వివాహాలను సమర్ధిస్తూ ముక్కోణ ప్రేమకథా చిత్రంగా వాహినీ పతాకాన సుమంగళి ద్వితీయ చిత్రంగా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందించింది. నాగయ్య, గిరి, లింగమూర్తి, గౌరీపతి శాస్త్రి, కుమారి మాలతి, పార్వతీబాయి ముఖ్య పాత్రధారులు. తృతీయ చిత్రంగా దేవత బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందించి కుమారి, …..లహరి సూర్యకుమారి, సి.హెచ్. నారాయణ రావు, లింగమూర్తి ముఖ్యపాత్రలు ధరించిన ఈ చిత్రం 1941లో ఘన విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకుంది. అయిదవ చిత్రంగా భానుమతి, నాగయ్య, జయమ్మ, లింగమూర్తి, సి.హెచ్. నారాయణ రావులతో స్వర్ణసీమ రూపొందించారు. 1946లో విడుదలై నాలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించింది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వియత్నాంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందింది.

దేవులపల్లికృష్ణశాస్త్రిని సినీ రచయతగా చేయాలని అయిదు సంవత్సరాలు ప్రయత్నించి తీసిన మల్లీశ్వరి ఎంతో ఘనవిజయం సాధించింది. ఎన్.టి.ఆర్, భానుమతి ముఖ్య పాత్రధారులుగా 1951లో విడుదలైంది. ఎస్.వి.ఆర్, జగ్గయ్య, కృష్ణకుమారి, జమున ప్రభృతులతో రూపొందించిన బంగారు పాప 1955లో విడుదలై ప్రశంసలు పొందింది. లండన్ ఫిలిం ఫెస్ట్‌వల్‌లో కూడా ప్రదర్శితమైంది. ఎస్.వి.ఆర్ కి మంచి పేరు తెచ్చిన ఈ చిత్రాన్ని తొలిసారి దేవకీ బస్ బెంగాలీ చిత్రంగా తర్వాత తీసారు. వాహినీ పతాకాన ఎన్.టి.ఆర్, రాజసులోచన, రాజనాల, గుమ్మడిలతో తెలుగు, తమిళ భాషల్లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్‌ని పరిచయం చేస్తూ వాహినీ పతాకాన రూపొందించిన రంగుల రాట్నం చిత్రం 1966లో విడుదలై మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత రూపొందిన బంగారు పంజరం మంచి చిత్రం అనిపించుకున్నా విజయం సాధించలేదు. ఇవన్నీ వాహినీ పతాకాన నిర్మితమైన చిత్రాలే. బయట సంస్థలు తీసిన భాగ్యరేఖ, పూజాఫలం, చిత్రాలకు బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు.

బి.ఎన్.రెడ్డి ప్రతి అంశమూ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు కనుక ఆయన దర్శకత్వంలో నటించాలంటే, సన్నివేశాలు పూర్తి కావాలంటే చాలా ఓపిక, సహనం వుండాలని తను నటుడైనా ఇలా నటించాలని చెప్పేవారు కాదని భానుమతి, నాగయ్య, లింగమూర్తి ప్రభృతులు అనేవారు. అంతేకాదు ఆయన తీసిన చిత్రాలకు సెన్సార్ కట్ ఒకటి కూడా పడక పోవడం విశేషం. సినీరంగంలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లులో అవగాహన, విజ్ఞానం పెంపొందాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవాలని, అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ చదవాలని, ఇతర భాషా చిత్రాలు చూడాలని బి.ఎన్.రెడ్డి చెప్పేవారు. వాహినీలో పనిచేసే వారిలో తారతమ్యాలు వుండకూడదని, కలసికట్టుగా వుండాలని చెబుతూ అది ఆచరణలో పెట్టించేవారు. లైట్‌బాయి నుంచి దర్శకుడు వరకు ఒకే రకమైన భోజనం ఏర్పాటు చేయడమే కాక అందరూ కలసి తినే పద్ధతి అమలుచేసేవారు. ఆంధ్రపత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరావు శిష్యుడుగా పేరు తెచ్చుకున్నారు. పాత్ర చిన్నదైనా వైవిధ్యం వుంటే అంగీకరించి చేస్తేనే సామర్ధం బయట పడుతుందని చెప్పేవారు. అంగీకరింపజేసి నటింపజేసేవారు. చిత్ర రంగంలో ఒకరిని మరొకరు బ్రదర్ అని పిలవడం ఈయన ద్వారానే ప్రారంభమైంది.

దర్శకుడు, నిర్మాత సినిమాకు రెండు కళ్లు. అందుకే నిర్మాత, దర్శకుడు ఒకరే అయి చిత్రాలు చేస్తే ఫలితం బాగావుండే అవకాశం వుంది. నిర్మాత ఒకరు, దర్శకుడు ఒకరు అయితే ఒకరి భావం ఒకరికి నచ్చకపోతే అనుకున్నది అనుకున్నట్టుగా రాదు. మనకు రియల్ ప్రొడ్యూసర్లు లేరు. 8 ప్రొడ్యూసర్లే వున్నారు అనే వారు. నటీనటులు సన్నివేశంలో తాదాత్మం చెంది చక్కని నటన ప్రదర్శిస్తుంటే తనూ మమేకమైపోయి కట్ చెప్పడం మరిచిపోతూవుండేవారు. బి.ఎన్.రెడ్డి ఆలోచనలు, ఆయన తీసిన సినిమాల కారణంగా సినిమా వారిని చిన్న చూపు చూసే రోజుల్లోనే మేధావిగా గుర్తించి ఆయనను దేశవ్యాప్తంగా గౌరవించడం విశేషం. తెలుగు వారిలో తొలుత పద్మభూషణ్ అవార్డు అందుకున్న వానిగా, దాదా ఫాల్కే అవార్డు 1974లో అందుకున్న తొలి దక్షిణదేశానికి చెందిన వ్యక్తిగా బి.ఎన్.రెడ్డికి గుర్తింపు వుంది. అంతేకాదు డాక్టర్ ఆఫ్ లెటర్స్ స్వీకరించిన తొలి భారతీయ సినీ ప్రముఖుడు.. రాజీపడని వ్యక్తిగా గుర్తింపు పొందిన బి.ఎన్. రెడ్ది 81177న మృతి చెందారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగయ్యను భక్త పోతనగా చూపిస్తూ వాహినీ సంస్థ తీసిన చిత్రానికి వచ్చిన పేరు ప్రతిష్టలు అంతాఇంతా కాదు. 1942లో విడుదలైన ఈ చిత్రంలో జంధ్యాల గౌరీనాధ శాస్త్రి, లింగమూర్తి, సి.హెచ్. నారాయణరావు ముఖ్య పాత్రధారులు.

-వి.ఎస్. కేశవరావు, 99892 35320