Home మహబూబ్‌నగర్ ప్రజారోగ్యానికి అత్యంత భద్రత

ప్రజారోగ్యానికి అత్యంత భద్రత

tk-srideviప్రజావాణి, పల్లెవికాసానికి ప్రభుత్వ శాఖాధిపతులు కచ్చితంగా హాజరు కావాలి
కలెక్టర్ టికె.శ్రీదేవి ఆదేశం

మన తెలంగాణ/మహబూబ్‌న గర్: ప్రజావాణి, పల్లెవికాసం కార్యక్రమాలకు ప్రభుత్వ శాఖాధిపతులు కచ్చితంగా హాజరు కావాలని, బాధ్యతాయుతం గా పనిచేయాలని కలెక్టర్ టికె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణి, పల్లెవికాసం నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పర్యటించి ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ట్రైనింగ్ వివరాల నివేదికలు అందించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఐరన్ మాత్రలు సకాలంలో అందించాలని తెలిపారు. కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్వహించేందుకు కాన్పు తేదీలను విధిగా సేకరించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రజారోగ్యానికి అత్యంత భద్రత ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్ అధికారు లు వార్డులో మంచినీటి కొరత లేకుండా చూడాలని తెలిపారు. మంచినీటి నాణ్యతను పరీక్షించాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. లింగాల వంటి మండలాలలో ప్రత్యేక అధికారుల పనితీరు బాగుందని, అధికారులు కష్టించి పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొనాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని స్పష్టం చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మౌళిక వసతులు కల్పనకు కృషి చేయాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, విధులలో నిర్లక్షం వహిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జెసి రాంకిషన్, డిఆర్‌ఒ భాస్కర్, జడ్పి సిఇఒ లక్ష్మీనారాయణ, డ్వామాపిడి దామోదర్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జెసి రాంకిషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా డిఆర్‌ఒ ఫిర్యాదు దారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో 195 ఫిర్యాదులురాగా, ఇందులో ఫోన్ ద్వారా 7 ఉన్నాయని, మిగతా ఫిర్యాదులు కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఆన్‌లైన్ ప్రజావాణిలో వచ్చే దరఖా స్తులను క్షణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా ఉన్నతా ధికారులు తప్పక హాజరుకావాలని, క్రింది స్థాయి సిబ్బందిని సమావేశానికి పంపరాదని ఆదేశించారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వెంకటయ్య గౌడ్, డీపీఓ వెంకటేశ్వర్లు , హోసింగ్ పీడీ రమణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సాగునీరు వదలాలి…
రాజోళి గ్రామ రైతులు ఆర్డీఎస్ 26వ డిస్టిబ్యూటర్ నీటి పారుదల కింద పత్తి, మిరప, జొన్న సాగు చేసుకున్నామని ఆర్డీఎస్ కాలవ ద్వారా డిస్టిబ్యూటర్లకు మాత్రమే నీరు అందుతోందని, మాకు నీరు అందడం లేదని ఇలాగే అయితే పంటలు ఎండిపోతాయని వారు ప్రజావాణిలో అధికారులతో వాపోయారు.

ఇళ్ల స్థలాలు చూయించాలి…
దౌల్తాబాద్ మండలంలోని సర్వే నెం.531లో ఇళ్ల స్థలాలకు 1980లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేసి స్థలాలు చూయించడం లేదని గత 8 సార్లుగా ప్రజావాణిలో మొరపెట్టుకున్నా అధికారుల పట్టించుకోవడం లేదని మల్లప్ప, రాజు అనే వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి వెంటనే ఇల్ల స్థలాలు చూయించాలని వారు కోరారు.

మైనార్టీలకు సబ్సిడీ డబ్బులేవి?
మైనార్టీలకు కార్పోరేషన్‌లో సబ్సిడీ డబ్బులు అకౌంట్‌లో వేయడం లేదని వడ్డేపల్లి మండలానికి చెందిన మైనార్టీలు 8 మందికి 8 యూనిట్లు మంజూరు అయినవి అయితే ఆరు నెలల నుంచి కార్యాలయం చట్టూ తిరుగుతున్నా నేడు రేపు అంటూ గడుపుతున్నారని ఇంత వరకు ఇవ్వడం లేదని వారు అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

సారూ… పింఛన్ ఇప్పించండి….
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మూడు నెలల మాత్రమే పింఛన్ ఇచ్చారని అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ ఇవ్వడం లేదని, అధికారులను ఎన్ని సార్లు కలిసినా పట్టించుకోవడం లేదని ఎదిర గ్రామానికి చెందిన కోమటి రాజు, తమ భార్య ఆయనను తీసుకుని ప్రజావాణిలో అధికారులకు విన్నవించారు. దీనిపై వెంటనే అధికారులతో మాట్లాడి వెంటనే పింఛన్ ఇప్పించ్చేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు.

డిఎస్‌సిలో పరీక్షలకు అనుమతి
టీటీసీ రెండవ సంవత్సరం చదువుతున్న వారికి టెట్, డీఎస్సీలో పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని శారద, నాగార్జున డైట్ కళాశాల విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

దుందుబి వాగు ఇసుకను ఆపి రైతులను ఆదుకుందాం…
డోర్క్ మండలంగా పేరున్న మిడ్జిల్ మండలం దుందుబి వాగు ఇసుకను ఆపి అక్కడున్న రైతుల బోర్లు ఎండిపోతున్నాయని, అక్కడున్న మట్టి ఇసుకను వేరే ప్రాంతాలకు తీసుకెళ్తూ ట్రాక్టర్ల రోజుకు వేలాదిగా తరలివెళ్తున్నందు వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయని వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.