Home లైఫ్ స్టైల్ ముష్టియుద్ధ వీరభద్రులు

ముష్టియుద్ధ వీరభద్రులు

Saiva Kalakaruluసాక్షాత్తు వీరభద్రుని అంశతో పుట్టిన వీర ముష్టి (వీరభద్రీయులు)కులస్థులు పూర్వం వీరశైవులుగా, పూజారులుగా దాతృ కులం దగ్గర గౌరవమైన స్థానాన్ని పొందారు. కానీ కాలనుక్రమంగా మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల పోషక కులం కళాకారులను ఆదరించే పరిస్థితి లేకపోవడంతో కన్యకా పురాణ కథా గానం చేసే వీరి సంస్కృతి అంతరించిపోయింది. ప్రస్తుతం వీరభద్రులు భద్రకాళి అమ్మవారి పూజలు చేసే పూజారులు గానే మిగిలిపోయారు. తమ కులం పేరు వీర ముష్టి అని ఉండటంతో మానసికంగా న్యూనతకు గురైన వీరు ఆ పేరు మార్పు కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వ రికార్డుల్లో వీరభద్రీయులు గా నమోదు చేయించుకున్నారు. కథా గానం చేసే తమ మూల సంస్కృతి అంతరించి పోయినప్పటికీ, కొందరు కళాకారులు వీరభద్రుని దండకాలు వేస్తూ , పూజలు చేస్తూ , జేగంట వాయిస్తూ దానిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం కళాకారులు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వృత్తి కళాకారులు తక్కువగా ఉన్నారు. సంప్రదాయమైన వృత్తికి ఆదరణ లేకపోవడంతో కొందరు కళాకారులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీరిని ఎంబిసి జాబితాలో చేర్చి న్యాయం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందలేదని వాపోతున్నారు. ప్రభుత్వం వృత్తి కళాకారులను గుర్తించి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

వీరిముష్టి పుట్టుక గురించి మౌఖికంగా చెప్పే కథలలో ‘ దక్షుడు యాగం తలపెట్టి బ్రహ్మ విష్ణు సకల మునీశ్వరులను ఆ యాగానికి పిలుస్తాడు. కానీ శివుని వద్ద విభూది, పాములు తప్ప ఏమీ లేవని తలచి యాగానికి పిలువకుండా అవమాన పరుస్తాడు. అప్పటికే దేవతలంతా శివుడు లేని యాగం సంపూర్ణం కాదని చెప్పినప్పటికీ ,యాగం తలపెడతాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి శివునితో తన తండ్రి చేసే యాగానికి వెళ్దామని అడుగుతుంది. పిలువని యాగానికి వెళ్లడం సరి కాదని శివుడు చెప్పినప్పటికీ పితృ వాత్సల్యంతో పార్వతీదేవి ఒక్కతే ఆ యాగానికి వెళ్తుంది. అక్కడ తన తండ్రి దక్షుడు అవమానపరచడం తో యాగ గుండంలో దూకి అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రళయకాల రుద్రుడై తన జటాజూటాన్ని బండకేసి కొట్టగా వీరభద్రుడు జన్మిస్తాడు. ఆ వీరభద్రునికి విషయం తెలిపి దక్షుని యాగాన్ని ధ్వంసం చేయమని పంపుతాడు. వీరభద్రుడు జేగంటలు, భేరీ నాదాలు మ్రోగుతుండగా వెళ్లి దక్షుని యాగాన్ని ధ్వంసం చేసి అతన్ని సంహరిస్తాడు. అయితే ఇదే సందర్భంలో వీరభద్రుని చెమట నుండి యాగ గుండంలో వీర ముష్టి జన్మించినట్లు చెప్తారు.

మరొక కథనంలో వీరభద్ర స్వామి భద్రకాళిని పెళ్లి చేసుకోవాలని భూమి మీదకి వస్తాడు. వీరభద్ర స్వామి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో అతడి చెమటను ఒక బండ మీద వేలడగా, అక్కడ ఒక వర పుత్రుడు జన్మిస్తాడు. అతను యుద్ధంలో వీరభద్ర స్వామికి సహాయంగా ముష్టి యుద్ధం చేసి విజయానికి కారణమవుతాడు. ఆ యుద్ధానంతరం వీరభద్రస్వామి భద్రకాళి పెళ్లి అయిన తర్వాత వరాన పుట్టిన వాడిని ఏం చేయాలని ఆలోచించి, భద్రకాళీ దేవి తల్లిగారైన వైశ్యులను పిలుస్తాడు. మీరు మీ ఇంటి ఆడపడుచును చూసుకున్నట్లుగానే ఈ వీర ముష్టి వారిని చూసు కోవాలని చెప్పి వారికి అప్పగిస్తాడు. ఆ తర్వాత అగ్నిగుండం నుండి దోసిలిలో వజ్రవైఢూర్యాలు తీసి వీర ముష్టికి ఇవ్వబోతాడు. అతను వరాన పుట్టడంతోఅతని దగ్గర వాటిని పట్టుకోవడానికి ఏమీ ఉండవు. అప్పు డతను ఆ వజ్రవైఢూర్యాలు నాకొద్దని వైశ్యులకు పెడితే నాకు పెట్టినట్టే అని కోరుతాడు. ఆ రకంగా వీర భద్రుడు వైశ్యులకు వజ్రవైఢూర్యాలు పెట్టడం జరుగుతుంది. ఇట్లా వీర ముష్టి కి కలిగే సంపదంతా వైశ్యులకు కలిగిందని కళాకారుల మాటల్లో వినిపిస్తుంది. అందుకే వైశ్యుల దగ్గర వీర ముష్టిలకు హక్కు ఉంటుందని, సంవత్సరంలో రెండు సార్లు వారింటికి వెళ్లి ప్రతిఫలం స్వీకరిస్తా మంటారు.

తెలంగాణలోని జానపద కళారూపాల్లో అతి ప్రాచీనమైనది వీర ముష్టి. వీరికి వీరభద్రీయులు అనే పేరు కూడా ఉంది. డా. బిరుదురాజు రామరాజు తన జానపద గేయ సాహిత్యంలో వీరముష్టి కళాకారులను ప్రస్తుతిస్తూ వీరులైన యోధులని, వీరశైవ భక్తులని పేర్కొన్నారు. యుద్ధంలో సైనికులుగా ఉండి ముష్టి యుద్ధం చేయడంతో వీరముష్టిగా పిలవ పడ్డామని కళాకారులు కూడా చెప్తారు. వీరి ప్రస్తావన శాసనాల్లోనూ ప్రాచీన కావ్యాల్లోనూ కనిపిస్తున్నది. వీర ముష్టి కళాకారుడైన అగుళ్ల శంకర్ మౌఖికంగా చెప్పే కన్యకా పురాణం ఆధారాన్ని బట్టి చూస్తే, రాజ మహేంద్ర వరాన్ని పరిపాలించిన విష్ణువర్ధనుడు రాజరాజ నరేంద్రుని తండ్రి. అతను రాజ్యంలో పర్యటిస్తుండగా పెనుగొండ వాస్తవ్యుడైన కుసుమ శెట్టి( వైశ్యుల) కుమార్తె కన్యకను మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమె అంగీకరించకపోతే బలవంతంగానైనా వశం చేసుకుంటానని భటులతో కబురు పంపుతాడు. అందుకు కన్యక నిరాకరించి కులం కట్టుబాటు కాదని, తమ కుల శ్రేష్ఠుల తో విచారిస్తుంది. తమ వంశ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ఆమెతో నూటాఏడుగోత్రాలలోని నూటారెండు గోత్రాలవారు అగ్నిలో దూకి ప్రాణ త్యాగ్యం చేసుకోవడానికి సిద్ధపడతారు.

అయితే విష్ణువర్ధనుని దుష్ట పరిపాలనకు, కామ వాంఛలకు విసుగు చెందిన అతని వీర భటులు కన్యకను ,వారి వంశ ప్రతిష్టను కాపాడేందుకు, ఆమె అగ్నికి ఆహుతి అయ్యే ప్రదేశానికి కావాలనే ఆలస్యంగా అతన్ని పల్లకిలో తీసుకవస్తారు. ఈ రకంగా కన్యకను విష్ణువర్ధనుడు చెర పట్టకుండా కాపాడిన వారయ్యారు వీరభటులు. ఆ తర్వాత కన్యక తమ వంశ ప్రతిష్టను కాపాడిన వీర భటులే వీర ముష్ట్టిలని, వారిని గౌరవించి వైశ్యు ల కులం ఉన్నంత కాలం వారికి ప్రతిఫలం అందించాలని దీవిస్తుంది. ఈ కథను బట్టి చారిత్రకంగా విష్ణువర్ధనుని కాలా న్ని బట్టి చూస్తే వీర ముష్టి ప్రస్తావన క్రీ.శ. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే కాకతీయ రుద్రమ దేవి క్రీ.శ.1183 లో ఒక ఆలయాన్ని నిర్మించి దానికి వివిధ సేవలు చేసేవారికి భూదానాలు, మాన్యాలు ఇస్తున్నట్లు వేయించిన శాసనంలో కూడా వీర ముష్టి ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథంలోని తృతీయాశ్వాసం తొమ్మిదవ రాత్రి కథలో ఈడిగ ,మేదర ,కాటిపాపల, మాష్టి, వీర ముష్టి మొదలైన కులాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ రకంగా అతి ప్రాచీనమైన కాలం లోనే వీరి ఉనికి ఉన్నట్టు తెలుస్తున్నది .ఈ కళాకారులు వీర శైవ భక్తులుగా, వీరభద్రీయులుగా వైశ్యుల కులానికి ఆశ్రితులుగా ఉంటూ, పూజలు చేస్తూ వస్తున్నారు.

పూర్వం కళాకారులు తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన మిరాశి గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి చొప్పున రెండుసార్లు వెళ్లేవారు. మిరాశి విషయంలో ఏ ఆశ్రిత కళారూపానికి లేని ప్రత్యేకత వీరముష్టి కళాకారులకు ఉంది. వీరు స్థలం(తళం), పర స్థలం అని రెండు రకాలుగా మిరాశి గ్రామాల్లో ప్రతిఫలం స్వీకరిస్తారు. స్థలం అంటే ఇంటిలోని మగసంతానం దగ్గర స్వీకరించే ప్రతిఫలం. పర స్థలం అంటే ఇంటి ఆడపడుచుకు పెళ్లి చేసి, అత్తగారింటికి పంపిన తర్వాత అక్కడ స్వీకరించే ప్రతిఫలాన్ని పర స్థలం అంటారు. ఈ విధంగా ఈ కళాకారులు ప్రత్యేక నియమం తో కూడిన హక్కులు కలిగి ఉండేవారు. ఈవిషయాలన్నీ తాళపత్ర ప్రతుల మీద రాగి శాసనాల మీద రాయబడి ఉండేవి.

కళాకారులు పూర్వం కట్టడి గ్రామాలు లేదా మిరాశి గ్రామాల్లోని వైశ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు దోతి, కమీజు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు లింగం కాయలు జందెం వేసుకొ ని, తలకు రుమాలు చుట్టుకొని, నుదుట విభూది పూసుకొని, చేతిలో జేగంట, భుజాన జోలె సంచి వేసుకొని వెళ్లేవారు. ఒకవేళ వైశ్యులు కన్యకా పురాణం చెప్పమంటే వారి ఇంటి ముందే కన్యకా పురాణ కథా గానం చేసేవారు. ఈ సందర్భంలో జేగంట వాయిస్తూ కథా గానం చేసేవారు. ప్రస్తుతం కథా గానం చేసే కళాకారుల తరం అంతరించి, ఆ సంస్కృతి వారసత్వాన్ని కొనసాగించే తరం లేకుండా పోయింది. గ్రామాల్లో వైశ్యులు కథాగానం వద్దనుకుంటే ఆ గ్రామంలో ఎంతమంది వైశ్యులు ఉంటే అంతమంది కలిసి కళాకారులతో వీరభద్రుని ప్రభ కట్టించుకొనేది.ప్రభతో కళాకారులు ఇంటింటికి వెళ్లి జేగంట వాయిస్తూ ,వారి ఇంట్లో దండకం చదువుతూ దేవుళ్ల దగ్గర గండ దీపం వెలిగించి మోడీ కొట్టేవారు. మోడీ అంటే ఒక కొబ్బరికాయ మీద రూపాయి బిల్ల నుంచి దాన్ని నుదుట అంటించుకోడం ,అలాగే ఒక ఎండుకొబ్బరిని దండకం చదువుతూ నుదురుతో పగులగొట్టడం. ఆ తర్వాత వారిచ్చే దక్షిణ తీసుకొని ఆ ఇంటి వంశక్రమాన్ని కీర్తించి ఆశీర్వదించేవారు.

జేగంట:
ప్రదర్శనలో కళాకారులు ప్రధానంగా ఉపయోగించే వాద్యం జేగంట. దీన్నే జాగంట అని కూడా పిలుస్తారు. దీన్ని ఇత్తడి లేదా కంచు లోహంతో ఆరువందల యాభై గ్రాముల నుండి ఏడు వందల యాభై గ్రాముల బరువు ఉండేవిధంగా, గుండ్రంగా పలక మాదిరిగా చేయించుకుంటారు .అంతకంటే ఎక్కువ బరువుంటే దాన్ని వాయించినప్పుడు’ ఓం’ అనే శబ్దం పలకదని సరిగ్గా అంతే బరువు తో చేయించుకుంటారు. వీటి మీద కొందరు కళాకారులు తమ ఇంటి పేరు తో సహా తమ పేర్లను, గోత్రాలను, సంవత్సరాలను రాయించుకుంటారు. ప్రస్తుతం కళాకారుల వద్ద ఉన్న ఈ జేగంటలు వారి తాతలు తండ్రుల నుండి వంశపారంపర్యంగా సంక్రమించినవే. వాటి ని పూజ గదిలో భద్రపరచుకొని ప్రతి సోమవారం పూజ చేసుకొని సంప్రదాయంగా ఒకసారి వాయిస్తారు. ఈ జేగంటను వాయించే కర్రను ’కొనుపు’ అంటారు . దీనిని ఊడుగు కర్రతో తయారు చేసుకుంటారు.

వైశ్యులు కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు, పెళ్లిళ్లు, దిన కా ర్యాల సందర్భంలో వీరముష్టి కళాకారుల చేత పూజ చేయించుకుంటారు. కొత్తగా వైశ్యులు ఇంట్లోకి వచ్చిన సందర్భంలో అయితే పూర్వం కళాకారులు కుమ్మరి మట్టితో భద్రకాళీ అమ్మవారి ప్రతిరూపం తయారుచేసి పూజ నిర్వహించేవారు. ప్రస్తుతం కళాకారులు భద్రకాళి అమ్మవారిని కుమ్మరి మట్టితో కాకుండా మైదా పిండి తో చేసి, అలంకరించి పూజ నిర్వహిస్తున్నారు. పూజానంతరం ఆ ప్రతి రూపాన్ని జలధిలో కలుపుతారు. అంతేకాకుండా కళాకారులు కొత్తకొండ, కురవి వీరభద్ర స్వామి పుణ్యక్షేత్రాల్లోనే కాకుండా వీరభద్ర స్వామి ఆలయాలున్న గ్రామాల్లో పూజలు చేయడానికి పదిమంది వరకు వెళ్తారు. తమ తమ హక్కు ప్రకారమే వెళ్తారు. ఒకరికి హక్కుగా ఉన్న గ్రామంలో కనుక పండగ చేయాల్సి వస్తే అతను మిగతా కళాకారుల సహాయం తీసుకుంటాడు. వచ్చిన ప్రతి ఫలాన్ని సమానంగా అందరూ పంచుకుంటారు. ఈ వీరభద్రస్వామి పూజ చేయడానికి వెళ్లే తంతుని ‘మెరుమడి ‘అని పిలుస్తారు. ఇందులో భాగంగా కళాకారులు జే గంట కొట్టడం, దండకాలు (ఖడ్గాలు) వేయ డం, ప్రభలు కట్టడం, కత్తులతో విన్యాసాలు చేయడం, అగ్నిగుండం తొక్కడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వీరభద్రస్వామి ఆలయాల్లో మెరుమడి పూజ చేయాల్సి వస్తే కళాకారులు అక్కడ ప్రధాన పాత్ర వహిస్తారు. వీరభద్రుడు, భద్రకాళికి ప్రతిరూపాలుగా ఎరుపు రంగులో వీరభద్రునికి, పసుపు రంగులో భద్రకాళి అమ్మవారి కి ప్రభలు కడతారు. ఇందులో వీరభద్రస్వామి ప్రభకు పైభాగంలో వీరభద్రుని ప్ర తిమను ఉంచి, ఇత్తడితో కుడకల మాదిరిగా చేయించిన ప్రభ కుడకలు అనే పేరుతో జందెం మాదిరిగా వేస్తారు., అలాగే అతనికి ప్రీతిపాత్రమైన మారేడు పత్రితో ప్రభను అలంకరిస్తారు. ఈ రెండు ప్రభలను ఆలయం ప్రాంగణంలో ప్రదక్షిణ చేసే సందర్భంలో కళాకారులు నార్సాలు (నారసాలు) వేసుకుంటారు. అంటే నాలుక మీద చెంపల మీద శూలాలను దిగేసుకోవడం. అంతేకాకుండా నాలుక మీద శూలాన్ని దిగేసుకుని దానిమీద ఒక కొబ్బరి కుడుకను కూడా భక్తి పారవశ్యంతో కాల్చుకుంటారు. ఇదే సమయంలో జేగంట, సొన్నా యి, బాజాలు వాయిస్తుండగా కళాకారులు మోడీ కొట్టుకొని, కత్తులు పట్టుకొని శరభ శరభ… అంటూ వీరభద్రుని దండకం వేస్తూ భక్తులను పరవశింపజేస్తారు. పూజలో భాగంగానే కళాకారులు అగ్నిగుండ ప్రవేశం కూడా చేస్తారు. ప్రదర్శనలో కళాకారులు నారసాలు వేసుకున్నప్పుడు ఎటువంటి నొప్పి ఉండదని కేవలం విభూదిని మాత్రమే పెట్టుకుంటామని, ఇదంతా దేవుని మహిమ అని చెబుతారు.

వీరముష్టి కళాకారుడైన అగుళ్లశంకర్ చెప్పిన దాని ప్రకారం శివునికి ప్రీతి వంతమైన విభూది ఉండలు తయారు చేసి జీవించే వృత్తిగా చెప్పుకునే వీరు ,ఒకప్పుడు సంచారం చేస్తూ సాక్షాత్తు వీరభద్రుడు ప్రసాదించిన వృత్తిని నమ్ముకొని బతికేవారు. అయితే మొదటి తరంలో కళాకారులు జేగంట వాయి స్తూ వైశ్యుల ఇంటికి వెళ్తే ఇంటి ఆడపడుచు వచ్చినట్లుగా ఆదరించి వారితో కన్యకా పురాణం కథా గానం చేయించుకునేవారు. వీరు ఆ తర్వాత వీరభద్రుని దండకం వేసి, వైశ్యులకు ఆశీర్వాదం పెట్టేవారు.

ఈ తరానికి వచ్చేసరికి వీర ముష్టిలకు ఆదరణ తగ్గిపోయింది. దీనితో కళాకారులు తమ సంస్కృతిని విస్మరించి వేరే వృత్తుల్లో స్థిరపడిపోయారు. శివనామ స్మరణ చేస్తూ ’ఓం ’అనే శబ్దాన్ని పలికించే జేగంటలు వీరముష్టి కళాకారుల పూజ గదికి పరిమితమయ్యాయని కళాకారుని మాటల్లో తెలుస్తున్నది. ప్రస్తుత తరంలో దాదాపుగా సంచారం చేసే కళాకారులు అతి తక్కువగా ఉండటం , కొందరు కళాకారులు మాత్రం వీరభద్ర స్వామి పూజలు చేయడానికి మరియు వైశ్యుల ఇండ్లల్లో చేయించుకునే పూజలకు మాత్రమే వెళ్తున్నారు. ఈ రకంగా కళాకారులు తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఒక సంవత్సరంలో జరిగిన మార్పు కాదని కాలం తో పాటు క్రమంగా సంక్రమించిందని కళాకారుల మాటలను బట్టి అర్థమవుతున్నది. వీరముష్టిల ఆచారాలు కూడా చాలా ప్రాచీనమైనవిగా కనిపిస్తాయి. పాల్కురికి సోమనాథుడు రచి ంచిన పండితారాధ్య చరిత్ర పురాతన ప్రకరణం లోని సకలేశ్వరం మాది రాజయ్య కథలో మాది రాజయ్య మిక్కిలి భక్తితో లింగార్చన చేసే వీర శైవ భక్తుడు. ఇతని అనుచరుడు చిక్క మాదరసు నిత్యం మాది రాజయ్యను కొలుస్తూ కొంతకాలానికి మరణించగా, అతన్ని తన భార్య గుంజకు కట్టేసి శరీరమంతా విభూది అలంకరించి బొంద పెడుతుంది. వీర శైవ భక్తుల ఆచారాలలో వారి ప్రాచీనత గొప్పదనం. వీరి ఇంటిపేర్లలో ఆగుళ్ల, కడారి, మహంకాళి, బాణాలలో, మాల్యాల, మి రియాల, శివ కొయ్య, మెట్టపల్లి ,చెవ మొదలైనవి ఉంటాయి. వీరికి గోత్రాలు కూడా రుద్రాక్ష , విభూది, వీరభద్ర వంటి పేర్లు కలిగి ఉంటాయి.

నేటి స్థితి:
సాక్షాత్తు వీరభద్రుని అంశతో పుట్టిన వీర ముష్టి (వీరభద్రీయులు) పూర్వం వీరశైవులుగా ,పూజారులుగా దాతృ కులం దగ్గర గౌరవమైన స్థానాన్ని పొందారు .కానీ కాలనుక్రమంగా మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల పోషక కులం కళాకారులను ఆదరించే పరిస్థితి లేకపోవడంతో వీరికి కన్యకా పురాణం కథా గానం చేసే సంస్కృతి అంతరించిపోయింది . ప్రస్తుతం వీరభద్రులు, భద్రకాళి అమ్మవారి పూజలు చేసే పూజారులు గానే మిగిలిపోయారు . తమ కులం పేరు కూడా వీర ముష్టి అని ఉండటంతో మానసికంగా అనేక ఇబ్బందులు వచ్చాయని, అందుకే ఆ పేరు మార్పు కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వ రికార్డుల్లో వీరభద్రీయులు గా మార్పు చేసుకున్నారు. తమ మూల సంస్కృతిలో ఒక భాగమైన కథా గానం చేసే సంస్కృతి అంతరించి పోయినప్పటికీ,కొందరు కళాకారులు వీరభద్రుని దండకాలు వేస్తూ ,పూజలు చేస్తూ ,జేగంట వాయిస్తూ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం కళాకారులు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వృత్తి చేసే కళాకారులు తక్కువగా ఉన్నారు. సంప్రదాయమైన వృత్తికి ఆదరణ లేకపోవడంతో కొందరు కళాకారులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వీరిని ఎంబీసీ జాబితా లో చేర్చి న్యాయం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వృత్తి చేసే కళాకారులను గుర్తించి కళాకారుల పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

-డా.బాసని సురేష్(తెలుగు యూనివర్శిటీ), 99894 17299  

The Complete Telugu Story about Saiva Kalakarulu