Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సర్వసాక్షి కథనం ‘కాలనాళిక’

ఆ రోజు 3జూలై 1947. చండ్రరాజేశ్వరరావు గారు చిక్కడపల్లి డెన్‌లో జరుగుతున్న దేశరాజకీయాల్ని వివరిస్తున్నారు. మౌంట్‌బ్యాటెన్ ప్రతిపాదనల్ని చెబుతున్నారు. అప్పుడు అంటాడు రచయిత-అది ‘చేటలో తౌడుపోసి కుక్కలకు పంచాయితీ పెట్టి చోద్యాన్ని చూడ్డం’ అని. అద్భుతమైన వ్యక్తీకరణ. అల్పాక్షరాల్లో అనంతార్థాల్ని స్ఫురింపజేసే రచనా నైపుణ్యమంటే ఇదే మరి!
బైరాన్‌పల్లిపై నూరుమందికి పైగా రజాకార్ల మూడవదాడి సందర్భం. దాన్ని తిప్పికొట్టటానికి పార్టీ సూచనల ప్రకారం ముందు జాగ్రత్తచర్యగా ఆత్మరక్షణ దళాలు ఏర్పాటైనాయి. ఒక సెంట్రల్ ఏరియా కమాండ్, పక్కనున్న నాలుగు గ్రామాల నాలుగు దళాలు. ఇవి సమన్వయంతో నడవాల్సిన వ్యూహాత్మక దాడి పద్ధతీ, క్రమశిక్షణతో పాటించవలసిన పరిస్థితి. ఇక్కడ రామాచంద్రమౌళి వ్యాఖ్య: ‘పిల్లి కోడిపిల్లను తన్నుకుపోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా తల్లికోడి, పిల్లల కదలికలను ముందుగా పసిగట్టి…. రహస్యంగా మాటువేసి నాచుపెట్టి అకస్మాత్తుగా మెరుపు దాడి చేస్తుంది!’ అని! బీభత్సాన్ని చూపటం మాత్రమే కాక, ఆ బీభత్సంలో మనుషుల జీవన ‘లాలస’నీ, జీవన సంఘర్షణలో ‘చావో రేవో’ తేల్చుకోవాలనే తెగింపునీ ఇలాంటి వ్యాఖ్య ల ద్వారా అందజేశారు రచయిత. ఈ నవలా శిల్పమే రచనని ఉన్నతోన్నతం చేసింది.
‘1949 డిసెంబర్ 1న జనరల్ చౌదరి పాలన రద్దయింది. ఎం.కె.వెల్లోడి ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వమేర్పడింది. మొట్టమొదటిసారిగా ‘పైరవీ’ అనే రాజకీయ ‘కేన్సర్’ కణం అప్పుడు అంకురించి విస్తరించడం ప్రారంభించింది. ఈ దేశంలో భజనపరుల సంస్కృతి కళ్ళు తెరిచింది ఆ క్షణమే’ అంటూ ఇక్కడ రాసిన వాక్యాలు చూడండి : ‘…అరెరె.. ఎందరెందరో… వానాకాలంలో ఆరుద్ర పురుగులవలె పుట్టుకొచ్చి కాచుకు కూర్చోవడం మొదలైంది… హైదరాబాద్ రాజకీయ రణరంగం చింతచెట్ల తోపుల్లో కోతుల సయ్యాటయ్యింది…!’
ఇదీ రచయితగా రామా చంద్రమౌళి సాధించుకున్న ‘కథన మూలకాల’జ్ఞానం. ఆ జ్ఞానంలో లోకజ్ఞతది తొలి పంక్తి. సృజనాత్మకతది రెండవ పంక్తి. నవలా నిర్మాణ శిల్పశాస్త్ర ప్రజ్ఞ మూడవపంక్తి. బహుశ ఈ తరం తెలుగు రచయితల్లో ఇంతగా సర్వ మూ ఆకళించుకున్న శక్తీ, ప్రకటనలో స్థిమితతత్వం, భావా ల అభివ్యక్తిలో, వాక్య సముచ్చయాల్ని గుప్పించటంలో ఉన్న రచయిత మరొకరు లేరంటే ఎవ్వరూ బుజాలు తడుముకోనక్కర్లేదు. తడుముకుంటే ‘కాలనాళిక’ని ఏ పొరలూ లేని కన్నులతో అక్షరం అక్షరం జాగ్రత్తగా చదువుకు తీరాలి!
నవలలో అక్కడక్కడా వెన్నెల్లో రంగుగోలీల్లా రామా చంద్రమౌళి రువ్విన లోకోక్తులు, సామెతలు, జాతీయాలు, సూక్తులు, పద్యా లు, పాటలు అతను సాధించుకున్న లోకవృత్త పరిశీలనకూ, సాహిత్య అధ్యయన భూమికకూ అద్దం పడుతున్నాయి. ‘అనగననగ రాగమతిశయిల్లుచునుండు…’‘నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు…’ ‘శరీరంలో లేచే గడ్డ ఎప్పుడో ఒకప్పుడు పగిలి చీమూ, నెత్తురే చిమ్మాల్సిందే’ ‘మనిషికి మనిషే శత్రువు’ ‘చీమల్లాంటి జనం చిరుతపులులౌతరు’ ‘తూముల్లో నుండి నీళ్ళలా చొచ్చుకొచ్చారు’ ‘బోనులో పులి’,‘మేడిపండు మంత్రాం గం’ ‘సంధించవలసిన బ్రహ్మాస్త్రాలు’ ‘ఒక్కొక్కటే చీమ దండైతది…’‘బండెనక బండి కట్టి… ’పాటలు, కాళోజీ కవిత ‘కాలంబు రాగానె కాటేసి తీరాలె…’‘మహిషాసురుణ్ణి చంపిన తర్వాతి జగజ్జనని మొహం…’‘…స్వేచ్ఛ ఎవరికీ లొంగని గాలి…’ ‘సమరన్యాయం, యుద్ధనీతీ ఉంటాయి’ – ఇలా ఎన్నె న్నో….
చరిత్రని ఉల్లేఖించేటప్పుడు ‘అంతా నిజమే చెబుతాను’ అనే నిబద్ధత ఒక అసిధారావ్రతం. అది రచయితని నిప్పులగుండంలో నిలబెడుతుంది. ఆ మంటని తట్టుకుని నిలబడ్డాడు రామాచంద్రమౌళి. ఎన్నెన్ని ఘటనలూ, తారీఖులూ, దస్తావేజులూ! వాటిలో నిక్షిప్తమైన సమాచారమూ, నిక్షిప్తం కాని కటికనిజాలూ.. వీటన్నిటినీ పట్టుకొచ్చి, పరిశోధనతో తన ముందు పరచుక్కూచుని పరీక్షించి, పరిశీలించి, ‘మనిషి’ ‘అమానవీయతల్నీ, ఎంచుకొని ‘మానవతా స్పర్శ’నీ రచయితగా విజ్ఞతని నిలుపుకుని ఈ రచన చేశారు.
‘కాలనాళిక’ నవలంతా సర్వసాక్షి కథనంలో నడిచింది. అయితే సాధారణంగా మనస్తాత్విక చిత్రణలో మాత్రం పాత్ర పోషణకు చైతన్య స్రవంతి ‘టెక్నిక్’ని వాడుకుంటారు రచయితలు. ఆ పాత్ర మనన ధారనీ, గత సంభవాల పునశ్చరణనీ అనుసంధానిస్తూ ప్రధానంగా ఉత్తమ పురుషలో అతని ‘ఉనికి’/‘అస్తిత్వాన్ని’ రూపొందిస్తారు. అయితే ఈ కథన విధానంలో-ఉత్తమ పురుషలో సాగే ఆ పాత్ర మనోభావాల మధ్య, మనోవేదనల మధ్య-ప్రథమపురుషలో కొన్ని తాత్వికాంశాల్నీ, కొంతలోక విచికిత్సనీ మిశ్రీకరించి కొన్ని ‘మోనోలోగ్స్’ ని ఆవిష్కరించారు రామచంద్రమౌళి. ఈ టెక్నిక్ వలన పాత్ర మానసిక భావావరణం మాత్రమే కాక దానికావలి తీరంలోని ప్రాంగణాలు కూడా పఠితకు దృశ్యమానమవుతాయి.
అటు చరిత్రాంశాల్ని పొందుపరచే క్రమంలోనూ, ఇటు ఇతివృత్తాన్ని నడిపేటప్పుడూ కూడా-నవల ఆధార వేదిక మానవసంబంధాల కూర్పు, తీర్పే-రచయిత చేతిలోని శిల్ప మంత్రదండంగా మెరుస్తుంది. కైలాసం పాత్ర, అతని మరణం, భార్య వీరలక్ష్మి దాన్ని తెలుసుకున్న దుర్భర సన్నివేశం, ఆ తర్వాత ఆమె స్త్రీగా, వ్యక్తిగా తనను తాను పునర్ నిర్వచించుకుని లేచి నిలిచి, హోటల్ వోనరై అన్ననుండి పిల్లల్ని తెచ్చుకుని, తాను ఎదిగి, వారిని పెంచి పోషించి ఉన్నతులుగా తీర్చి దిద్దిన బతుకుపోరులో అడుగడుగునా మనకు మానవ సంబంధాల నిర్వహణలోని రాగవిరాగాల చిత్రణ ఎంతో ఔచిత్య భరితంగా కనిపిస్తుంది. అలాంటి పాత్రలే సీతాకుమారి, శివాజీ.
రచయితగా రామా చంద్రమౌళి గొప్ప దార్శనికుడు. తాను నిర్మిస్తున్న ఒక మహోన్నత, అపూర్వ నవల ద్వారా-కేవలం చరిత్రా, ఎవరో కొందరు మనుషుల కథ చెప్పటం మాత్రమే ధ్యేయం కాదు. -అది ప్రస్తుత వర్తమాన ప్రమేయం. దానితోపాటు, దాని తదనంతరం-భావిభారత పౌరుల అభ్యున్నతీ, అభ్యుదయం కూడా అంతకంత ముఖ్యమైన లక్ష్యాలు. ఈ కారణాన్నే నవలలో అతను వ్యక్తిత్వ వికాస పాఠాల్ని-ఎంతో‘సమయజ్ఞత’తో పొందుపరచా డు.వాటిని చదువుపట్ల చిత్తశుద్ధికల పాఠకులు అందుకోగలరు!
ఈ క్రమంలో అతను సాధించదలచుకున్న మరో లక్ష్యమూ ఇమిడి ఉన్నది. అది-పాఠకుల ఆలోచనా పరిధిని-అనవరతం అవిరామంగా విస్తరించుకుంటూ పోతున్న వర్తమాన ఆధునిక ప్రపంచ వృత్తంలోకి-ఈ తరాన్నీ భావితరాన్నీ ప్రవేశింపజేయటం! అంటే ఒక పెద్ద ప్రపంచ వృత్తంలో విభిన్న సమూహాల వృ త్తాలు, దానిలో వ్యక్తి (‘చిత్త’)వృత్తం.. వీటిని గోచరింపజేయటం! ఈ చిన్న వలయంలో ఒక సెగ్మెంట్‌లో కొన్ని డిగ్రీలపై నిలబడి ఉన్న మనిషి ఇతర సంబంధీకులతో సంఘర్షించటం లేదా సహకరించటం, కలిసి బతకటం… అలా ‘బతుకు, బతికించు, బతకనివ్వు’ అనే సూత్రాన్ని ధ్వనింపజేశారు. ఇక్కడే ఒక ప్రొఫెసర్‌గా రామచంద్రమౌళి తన జ్ఞానవిజ్ఞాన ప్రదర్శనకోసం కాక ఈ సందేశాన్ని తన సామాజిక బాధ్యతగా భావించి అమిత పారదర్శకంగా అత్యంత సంభావ్యతతో అందించారు.
ఎన్నడో మేనేజ్‌మెంట్ కురువృద్ధుడు పీటర్ డ్రకర్ ప్రవచించిన-జ్ఞానవంతమైన రాజకీయం, జ్ఞాన సమాజం, జ్ఞాన వ్యవస్థ, జ్ఞానవంతుడైన వ్యక్తి మాత్రమే భవిష్యత్తులో మనగలుగుతారనే సిద్ధాంతాన్ని తెలిసిన పాఠకులకి గుర్తుచేశారు. తెలియని వారికి తెలిపి ఆలోచించమన్నారు. మానవ మనుగడకే ఆవశ్యకమైన కనువిప్పు ఈ సిద్ధాంతం! జ్ఞానసముపార్జన ఆవశ్యకత గురించి ఇదీ రచయితకున్న నిబద్ధత, జీవనదార్శనికత! ఇక్కడ ఇంకొకమాట కూడా చెప్పాలి. రామాచంద్రమౌళి సంభావ్యతతో వీటిని నిర్వహించారు అన్నాను. ఎలా? అంటే ఒక మేధావిగా, ఒక చింతనశీలిగా అతనికి-ఈనాటి సమాజ జీవన పరిణామాల వేగాన్ని ఈనాటి సాహిత్యం అందుకోవటం లేదనే ‘సంవేదన’ ఉన్నది. కనుక, నవలలో పుష్ప, సుందర్, మురళి, ఉద్యమ వంటి కొన్ని యువతరం పాత్రల జీవితాన్ని సాహిత్యంగా మలచి చూపించాడు! ఈ విషయంలో అతను తన ఆచారణాత్మక విశ్వసనీయతనీ లాఘవంగా నిరూపించుకున్నారు.
రచనాపరంగా ‘కాలనాళిక’ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది నవలా నిర్మాణ శిల్పం కాగా,అందులో మరీ ప్రశంసార్హమైనవి- రామా చంద్రమౌళి శైలీ, భాషా. అతని శైలిలో వ్యర్థ పదం ఉండదు. సరళత దాని వన్నె. భాషలో లేశమాత్రం కూడా సంస్కారరాహిత్యం ఉండదు. నవలలో ఏ పేజీని అయినా చదివి ఈ అంశాల్ని నిర్ధారణ చేసుకోవచ్చు.
రామా చంద్రమౌళి ప్రాచీన అర్వాచీన శాస్త్రాల అధ్యయనం ఉన్నవారు. అలాగే ఎంతోమంది తత్త్వవేత్తల శాస్త్రవేత్తల సిద్ధాంతాల్నీ ఆకళింపు చేసుకున్నవారు. ఆధ్యాత్మికంగా అనేకుల ‘ధోరణుల్ని’ అవగతం చేసుకున్నవారు. ఇందువలన – అతను కొన్ని పాత్రల రూపకల్పనలో ఆ పాత్రలు మనోక్షేత్రంలోని (స్వంత ప్రపంచంలోని) గాలినీ, ధూళినీ ప్రోది చేయటంలో- ఒక్కొక్కప్పుడు ఉద్వేగంతో అతివిస్తరమైన చిత్రణ చేశారు.
అతి విస్తృతమైన చరిత్ర, ఇతివృత్తమూ కలిగి, ఎన్నెన్నో పాత్రల ప్రమేయం ఉన్న ఇంత పెద్ద నవలలో చిన్న చిన్న స్ఖాలిత్యాలు ఉండటం అనివార్యమేమో! వాటిని రచయితే పునర్ముద్రణలో సవరించుకుంటారు. అలాగే, 1970 తర్వాత, ప్రత్యేకించి 2001 తర్వాత- తెలంగాణ సమీప గత చరిత్రని స్థూలంగా చెప్పి, ఇతివృత్తాన్ని ముగింపుకు తేవటం మీద దృష్టిపెట్టారు రచయిత. ఈ ‘గ్యాప్’కి కూడా మలిముద్రణలో ‘బలుపు’నివ్వవచ్చు! ఈ ‘కాలనాళిక’ రచనలో రచయిత తాను outsider గా నిలిచి insider పాత్రని పోషించారు.
ప్రపంచ సాహిత్యంలో గొప్ప నవలాకారులంతా సాధించిన విజయం ఇదే! దీన్ని తానూ సాధించి రచనా శిఖరారోహణం చేశారు రామా చంద్రమౌళి! ‘కాలనాళిక’ నవలలో ‘అంకురం’తో మొదలెట్టి ‘పనిచేయడమే జీవితం’ వరకూ మొత్తం 65 అధ్యాయాలున్నాయి.
ఈ అధ్యాయాల శీర్షికలూ, వాటిలోని వస్తు వివరణ దృష్ట్యా సాధింపబడిన ప్రాసంగిత, సంభావ్యతా, అధ్యాయాల ముగింపులో ఒక జీవితమంతా ఆలోచిస్తూ కూర్చోవలసినట్లు రాసిన వాక్యాలూ… వీటన్నిటిమీదనే ఎవరైనా సాహిత్య విద్యార్థి ఒక ఎం.ఫిల్ చేయవచ్చు!!

విహారి
9848025600

Comments

comments