Home ఎడిటోరియల్ ఆత్మహత్యాయత్నానికి నేర విముక్తి

ఆత్మహత్యాయత్నానికి నేర విముక్తి

Sucide

ఆత్మహత్యకు ప్రయత్నించి బతికిన వ్యక్తులు శిక్షకు గురైన దాఖలాలు లేకపోయినప్పటికీ, అందుకు ప్రయత్నించినందుకు గాను కోర్టుల చుట్టూ తిరిగిన వారి సంఖ్య వేలల్లోనే ఉన్నది. ఆత్మహత్య నేరమా లేక పాపమా అనే చర్చ పక్కన బెడితే అసలు ఆ ప్రయత్నం చేసినందుకు చట్టం ముందు దోషిగా నిలబెట్టడం మానవత్వమేనా అనేది మనముందున్న ప్రశ్న. ఆత్మన్యూనతా భావంతో, నిస్సహాయస్థితిలో సరైన మార్గ నిర్దేశం లేక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులకు వెంటనే అందించాల్సింది మానసిక స్వాంతన మేమున్నామనే విశ్వాసం, సరైన వైద్య చికిత్స. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా ఆత్మహత్యా యత్నాలను మానసిక రుగ్మత కోణంలో కాకుండా చట్ట కోణంలోనే ఆలోచిస్తూ వచ్చాం. ఏదైతేనేం 30 సంవత్సరాల సుదీర్ఘ చర్చకు, న్యాయ పోరాటానికి తెరదించుతూ 2014 లో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 309 (ఆత్మహత్యాయత్నంనేరం)కు మంగళం పాడాలని నిర్ణయించడం హర్షణీయం. న్యాయస్థానాల తీర్పుల వల్లనైతేనేమి, లా కమీషన్ సిఫారసుల వలన అయితేనేమి వివిధ వేదికల ద్వారా మేధావులు చేసిన విజ్ఞాపనల వల్ల నైతేనేమి చివరకు ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రజలు ప్రజా సంఘాలు చేస్తున్న డిమాండ్ కు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం నిరాశ నిస్పృహలతో జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించే అభాగ్యుల పట్ల మానవతా దృక్పథంతో తీసుకున్నదని చెప్పవచ్చు.
లా కమిషన్ 1970సంవత్సరంలో తన 42వ రిపోర్టులోనే భారతీయ శిక్షాస్మృతి నుండి సెక్షన్ 309ను తీసివేయాలని సిఫారసు చేసినా 47 సంవత్సరాల తరువాత కూడా ఆ సిఫారసుకు రాజముద్ర పడకపోవడం దురదృష్టకరం. 1978లోనే నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభలో పాస్ అయినప్పటికీ దురదృష్టవశాత్తు లోక్ సభ రద్దు కావడం వలన మురిగిపోయింది. తిరిగి 1997 సంవత్సరంలో గియాన్ కౌర్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం, లా కమీషన్ తన 156 వ రిపోర్టులో సెక్షన్ 309ని తొలగించాలని పునరుద్ఘాటించడంతో వ్యవహారం తిరిగి తెరపైకి వచ్చింది. అదేవిధంగా లా కమీషన్ తన 210వ రిపోర్టులో ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులను శిక్షించడం కాదు, వారిపట్ల సానుభూతి చూపి చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి వక్కాణించడంతో ప్రభుత్వంలో కదలిక మొదలయ్యింది.
అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ , అంతర్జాతీయ ఆత్మహత్యల నిరోధక సంస్థ (ఫ్రాన్స్), యూరోప్, ఉత్తర అమెరికా దేశాల ఆత్మహత్యా విఫలుల పక్షపాత నిరోధక సంస్థ, భారతీయ మానసిక స్థితి విశ్లేషకుల సంస్థ తదితరుల అభిప్రాయం మేరకు లా కమిషన్ సెక్షన్ 309 ని తొలగించాలని సిఫారసు చేసినప్పటికీ, జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులో భాగమా కాదా అనే విషయమై ఉన్నత న్యాయస్థానాల్లో జరిగిన చర్చలు, భిన్న అభిప్రాయాలు కూడా ఒకరకంగా ప్రభుత్వ నిర్ణయం ఆలస్యంగా రావడానికి కారణమని చెప్పవచ్చు. మాట్లాడకుండా ఉండిపోవడం, ఏ పనిచేయకుండా ఉండిపోవడం, స్పందించకుండా ఉండిపోవడం లాగానే జీవించకుండా ఉండ టం (ఆత్మహత్య) కూడా ప్రాథమిక హక్కే అని వాదనలు వచ్చినప్పటికీ మరణం అనేది శాశ్వతమైనది, మిగతా వాటిలాగ తొలగించ తగినది కాదు కనుక ప్రాణంతీసుకోవడాన్ని ప్రాథమిక హక్కు కిందకు రాదని కోర్టులు అభిప్రాయపడ్డాయి. భారత సుప్రీం కోర్టు రాజ్యాంగం లోని ఆర్టికల్ 21లోని జీవించే హక్కును నిర్వచిస్తూ జీవించే హక్కు మనిషి సహజ హక్కు అందులో సహజ మరణం కూడా కలిసి ఉంటుంది, అసహజ మరణం, బలవన్మరణం జీవించే హక్కులో భాగం ఎంతమాత్రం కావు అన్నది. అదీకాకుండా జీవించే హక్కు అంటే మనిషి హుందాగా బతకడానికి అవసరమయ్యే పరిస్థితులను కోరుకోవడం, ఆ హక్కు ఎంత విశాలమైనది అంటే హుందాగా మరణాన్ని పొందగలగడం, అటువంటి పరిస్థితులను కోరుకోవడం కూడా జీవించే హక్కులో భాగమే, అటువంటప్పుడు అసహజ మరణాన్ని పౌరులు రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 లో భాగంగా పొందడం సాధ్యం కాదు.
ఆత్మహత్యా యత్నం నేరం కాదు అంటూ తీర్మానించిన ఈ సందర్భంలో వెంటనే చర్చకు వచ్చే మరో అంశం సానుభూతి హత్య (మెర్సీ కిల్లింగ్). తను ఆత్మహత్య చేసుకోలేని వ్యక్తి వైద్య సహాయంతో హత్యను కోరుకోవచ్చా అనేది ఈ సందర్భంగా వస్తున్న మరో వాదన. అయితే మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా జరిగే ఆత్మహత్యలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా జరుగలేని సానుభూతి హత్య ( మెర్సీ కిల్లింగ్ ) ఎంతమాత్రం ఒక్కటి కావు కనుక ఈ విషయమై భవిష్యత్తులో సవివరమైన ప్రత్యేక చర్చ జరగాల్సిందే.
2014 కేంద్రప్రభుత్వం సెక్షన్ 309ని భారతీయ శిక్షాస్మృతి నుండి దీనిని తొలగించాలని క్యాబినెట్ లో తీర్మానించినప్పటికీ ఇంతవరకు ఆ నిర్ణయం చట్టరూపం దాల్చలేదు. 2015 ఒకసారి 2016 సంవత్సరం లో మరోసారి బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు వచ్చినా అది చట్టరూపం దాల్చిన దాఖలాలు లేవు, ఒకవైపు నేరం పరిధి నుండి ఆత్మహత్యా యత్నాన్ని తొలగిస్తూనే ఆ సెక్షన్ కు అదనపు సవరణలు చేయాలనుకోవడమే ఆలస్యానికి కారణమై ఉండొచ్చు. ఆ సవరణలు పరిశీలిస్తే వివిధ ఉద్యమాల సమయంలో, నిరసనల సమయంలో వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరికలు చేయడం లాంటివి జరిగినప్పుడు పోలీసు ఉన్నతాధికారి స్థానిక న్యాయమూర్తి ఆదేశాలతో సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తి బతికిన సందర్భంలో ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రేరేపించిన వ్యక్తులు శిక్షార్హులు అనేవి ఆ సవరణలు.
2017లో ఆమోదం పొందిన మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం ఈ సమస్య పరిష్కారానికి దారులు వేసింది. ఆత్మహత్యకు సిద్దపడిన వ్యక్తులలో చాలావరకు మానసికంగా సమతుల్యం లేనివారు, అటువంటి వారికి తక్షణ చికిత్స, పర్యవేక్షణ అవసరం. వారికి చికిత్స అందించడం ప్రభుత్వాల విధి అనేది ఆ చట్టం యొక్క సారాంశం. ఇదే అభిప్రాయాన్ని అరుణా రామచంద్ర షాన్ బాఘ్ వర్సెస్ యునియన్ ఆఫ్ ఇండియా, ఇతరుల కేసులో సుప్రీం కోర్టు వ్యక్తపరిచింది. ఆ క్రమంలోనే చట్టం రూపుదాల్చింది. ప్రత్యక్షంగా సెక్షన్ 309 ని తొలగించనప్పటికీ పరోక్షంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలో సెక్షన్ 115 ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది. ఆ అనుకరణ ప్రకారం ప్రాథమికంగా ఆత్మహత్య కు ప్రయత్నించిన వ్యక్తులను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నవారిగా పరిగణించి, చికిత్సను అందించాలే గాని సెక్షన్ 309 క్రింద కేసు నమోదు చేయరాదు. ఏది ఏమైనా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రస్తుతం కోమాలోకి వెళ్ళిందనే చెప్పవచ్చు.