Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కొత్త పంచాయతీల దరఖాస్తులకు గడువు 25

hall

* కనీస జనాభా 500  *రెండు పంచాయతీల మధ్య దూరం 1.5 కిలోమీటర్లు  *జిల్లాలకు చేరిన మార్గదర్శకాలు 

మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్త పంచాయతీలపై ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేయడంతో ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25వ తేదీకల్లా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపాలని సిఎస్ స్పష్టం చేశారు. కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని, కొత్త పంచాయతీలకు ఉండాల్సిన అర్హతల న్నీ ఆ మార్గదర్శకాల్లో ఉన్నాయని నొక్కి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనలు ఈ నెల 25 కల్లా చేరాల్సిందేనని, అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న పంచాయతీల జనాభా కనీసంగా 500 ఉండాలని, ఇప్పటికే గ్రామ పంచాయతీగా ఉన్న గ్రామానికి ఒకటిన్నర కి.మీ. కంటే ఎక్కువ దూరం ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలన్నీ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, నిర్దిష్ట ఫార్మాట్‌లోనే పంపాలని స్పష్టం చేశారు. ప్రొఫార్మా కూడా అన్ని జిల్లాలకు పంపించినట్లు గుర్తుచేశా రు. కొత్త పంచాయతీల ప్రతిపాదనల్లో మార్గదర్శకాల్లో పేర్కొ న్న అంశాలతో పాటు భౌగోళిక హద్దులను సూచించే మ్యాప్ కూడా ఉండాలని వివరించారు. మెయిల్‌తో పాటు పోస్టు ద్వారా కూడా పంపాలని నొక్కిచెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పంచాయతీలకు పెట్టాల్సిన పేరుపై కూడా స్థానిక ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో చర్చించి ఏకాభిప్రాయం లేదా మెజారిటీ అభిప్రాయాన్ని పంపించాలని, ప్రజల అంగీకారం పొందాలని సిఎస్ స్పష్టం చేశారు. కొన్నిచోట్ల మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలకు సమీపంలో ఉండి పట్టణ లక్షణాలు ఉన్న గ్రామ పంచాయతీలను వాటిల్లో విలీనం చేయడానికి ఉన్న అవకాశాలను కూడా అందజేయాలని సూచించారు. మరికొన్ని చోట్ల నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన గ్రామ పంచాయతీలను గుర్తించాలని, ఇందుకోసం తగిన అవగాహన కల్పించడానికి తొమ్మిది మంది ప్రత్యేక అధికారులను మున్సిపల్ మంత్రిత్వశాఖ నుంచి నియమిస్తున్నట్లు సిఎస్ వివరించారు. వీరు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో చర్చిస్తారని, తగిన సలహాలు, సూచనలను ఇస్తారని తెలిపారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో విలీనం కావడానికి ఆస్కారం ఉన్న పంచాయతీలు, నగర పంచాయతీలుగా మారడానికి అర్హతలు కలిగినవాటికి సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సి వస్తే పట్టణీకరణ స్వభావం, ఆర్థిక వనరులు, విద్యారంగంలో ప్రగతి, సాంస్కృతిక సంస్థల ఏర్పాటు తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ వివరణ ఇస్తూ, అన్ని జిల్లాల కలెక్టర్లు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో విలీనం అయ్యే గ్రామ పంచాయతీలకు సంబంధించి 2006లో రూపొందించిన మున్సిపల్ నిబంధలను అధ్యయనం చేయాలని సూచించారు. పట్టణీకరణ, జనసాంద్రత, జనాభా, ఆర్థిక వ్యవహారాలు, వాణజ్య కార్యకలాపాలు, లేఔట్‌ల అభివృద్ధి, వ్యవసాయేతర కార్యకలాపాలు తదితరాలన్నింటినీ అధ్యయనం చేయాలని సూచించారు. సందేహాలను నివృత్తి చేయడానికి తమ శాఖలో నిపుణులైన అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Comments

comments