Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

విద్వేషంతో సంస్కృతి వినాశనం

ind

నాగ్‌పూర్ ఆర్‌ఎస్‌ఎస్ సభలో ప్రణబ్ ముఖర్జీ

నాగ్‌పూర్: విద్వేషం, అసహనం మన దేశ అస్థిత్వాన్ని దెబ్బతీస్తుందని , విభజన రేఖలు మన ఉనికికే సవాలుగా మారుతాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక్కడి ఆర్‌ఎస్‌ఎస్ సభలో హెచ్చరించారు. సంఘ్‌పరివార్ కార్యకర్తల శిక్షణ ముగింపు కార్యక్రమం వర్గ్‌లో మాజీ రాష్ట్రపతి గురువారం ప్రసంగించారు. ఆయన ఈ సభకు రావడం తీవ్రస్థాయిలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఒక్కరోజు ముందే నాగ్‌పూర్‌కు వచ్చిన ప్రణబ్ గురువారం తొలుత ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్‌కు నివాళులు అర్పించి సభకు తరలివచ్చారు. మతం పేరిటనో, సిద్ధాంతాల పేరిటనో దేశాన్ని నిర్వచించడం జరిగితే, ఇతర భావజాలాల పట్ల అసహనం వ్యక్తం చేస్తే భారతదేశానికి, భారతీయతకు ఉన్న తరతరాల అపూర్వ నిర్వచనం దెబ్బతింటుందని ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు అన్ని శ్రేణులను హెచ్చరించారు. మనం కీలకంగా ఎంచుకున్న విశ్వాసాలలో లౌకికత అత్యంత ప్రధానం అని ప్రణబ్ తెలిపారు. అసహనం మన సంస్కృతి కాదు. అసహనంతో దేనిని పొందలేం.. దేనిని జయించలేమని, అసహన భావజాలం చివరికి భారతదేశ జాతీయ గుర్తింపును నీరుగారుస్తుందని, విశిష్ట భారతీయ జాతియతకు సవాలుగా మారుతుందని తెలిపారు. విశ్వజనీనం, సహజీవనం, అందరినీ సమ్మిశ్రితం చేసుకుని వెళ్లే తత్వం ప్రాతిపదికన, సహనంలో నుంచి ఉద్భవించిన జాతీయవాదం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినరాదని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. “ భారతదేశంలో మన బలం మనకు సహనం నుంచి సిద్ధిస్తుంది. మనం బహుళత్వాన్ని ప్రాణంగా భావి స్తాం. మన వైవిధ్యతను గర్వ కారణంగా వ్యక్తపరుస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. తాను ఈ సభకు వచ్చింది ఈ దేశం, జాతీయత, మన దేశభక్తి గురించి తనకున్న అభిప్రాయాలను, అవగావహనను వ్యక్తం చేయడానికి, అందరితో పంచుకోవడానికి అని ప్రణబ్ తెలిపారు. మన దేశం అంటే భారత్ , దీనిని సార్థకం చేసే నిర్వచనానికి భంగం వాటిల్లరాదని ప్రణబ్ హితవు పలికారు. 2012 నుంచి 2017 వరకూ దేశ రాష్ట్రపతిగా ఉండి, అంతకు ముందు విశేష రాజకీయ పదవులు చేపట్టి, అపార సంక్లిష్ట రాజకీయ అనుభవం సంతరించుకున్న ప్రణబ్‌దా ఆర్‌ఎస్‌ఎస్ కీలక ప్రసంగం పట్ల ఆసేతుహిమాచలం ఆసక్తి రేకెత్తింది. రాజకీయ వర్గాలలో ఆద్యంతం ఉత్కంఠకు దారితీసింది. ఏ అంశంపై అయినా భయాందోళనలు లేని రీతిలో వ్యక్తీకరణకు అవకాశం ఉండి తీరాలని ప్రణబ్ స్పష్టం చేశారు. మన ప్రజా చర్చల స్రవంతి ఏ విధమైన భయానికి లోనుకాకుండా ఉండాలి. ప్రజల ఆలోచనా సంవిధానానికి హింసాత్మక బెదిరింపుల తాకిడి ఉండరాదని స్పష్టం చేశారు. మన భిన్నత్వంలో ఏకత్వపు విధానాన్ని మనం ప్రాణప్రదంగా భావిస్తామని, ఇది మనకు ఉత్తేజభరితంగా ఉత్సవ సమానితంగా ఉంటుందన్నారు. వివిధ రకాల గుర్తింపుల అడ్డుగోడలను పరిగణనలోకి తీసుకుంటే మన తరాల నాటి ఏకత్వపు గుర్తింపును దెబ్బతీసుకున్నట్లే అవుతుందని ప్రణబ్ చెప్పారు. దేశ చరిత్ర ఘనమైదని, బహుళత్వంలో నుంచే మనం బాహుబలులు అవుతూ వచ్చామని ఇది విశిష్టత అని తెలిపారు. శతాబ్దాల తరబడి అన్ని భావజాలాలను అంతర్లీనం చేసుకుంటూ , అనేకాలను మమేకం చేసుకుని ఏకం కావడమే మన విశిష్టత అంతకు మించిన విజ్ఞానత అని ప్రణబ్ తెలిపారు. భారతీయ ఆత్మ ఎక్కడో లేదని అది కేవలం బహుళత్వం, సహనంలోనే ఉందని తెలిపారు.
ఎన్నో విశిష్టతల దేశం మనది
భారతదేశానికి ఉన్న విశిష్టత ఏ దేశానికి లేదని నాగ్‌పూర్ ఆర్‌ఎస్‌స్ సభలో ప్రణబ్ చెప్పారు. జాతీయత, దేశభక్తి అంశాలను తెలియచేయడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు వివరించారు. ఈ అంశాలను దేశపు దృక్పథంలో ఏకరువు పెట్టడానికి వచ్చినట్లు తెలిపారు. ఎందరో విదేశీ యాత్రికులు భారతీయత గురించి స్పష్టత ఇచ్చారన్నారు. తక్షశిల, నలంద, విక్రమశిల భారతీయ విద్యావ్యాప్తికి తార్కాణంగా మారాయని అన్నారు. బౌద్ధమతం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకూ విస్తరించిందని, ఇందుకు భారత్ వేదిక అయిందని ప్రణబ్ తెలిపారు. జాతి జాతీయతా భావనలు ఐరోపా కన్నా ముందు భారత్‌లో ఉన్నాయని , వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు సూక్తులు విశాతతత్వానికి నిదర్శనంగా మారుతాయన్నారు. 1857 తరువాత దేశంలోతొలిసారి కేబినెట్ వ్యవస్థ ఏర్పాటు అయిందని , ఈ కేబినెట్ సమగ్రం, సవిస్తారితం అన్నారు. దేశం జాతీయత కేవలం ఒక వర్గం, కులం మతంకు పరిమితం కాదని, అందరికీ అతీతంగా అంతా తానేగా విస్తరించిందని ప్రశంసించారు. మన రాజ్యాంగం విశిష్టం, ఇది కేవలం మార్గదర్శకం కాదని, ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు ప్రతిరూపం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే కీలక పాత్ర కావాలన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని అంశాలపై హింసాద్వేషాలు పెరగడంపై ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి అంతకుమించిన సామరస్యం అవసరం అన్నారు. కౌటిల్యుడి మాట ప్రకారం ప్రజా సంక్షేమమే రాజుకు పరమావధి కావాలని, ప్రజల సంక్షేమమే రాజుల పరిపాలనకు గీటురాయి కావాలనే కౌటిల్యుని ఆదర్శం కలకాలం నిలవాలని పిలుపు నిచ్చారు.
బహుళ సంస్కృతుల, విశ్వాసాల సమ్మేళన యానం
భారతదేశ గమనం విశిష్టమైనదని, ఇది పలు సంస్కృతుల మేలుకలయిక, అన్నింటినీ జీర్ణించుకుని నిలిచిన అమృతం, వివిధ రకాల విశ్వాసాలు, భిన్న సంస్కృతులు మనకు విలువైన జాతీయతా గుర్తింపును తెచ్చిపెట్టాయని ప్రణబ్ చెప్పారు. బహుళ సంస్కృతుల సమ్మేళనం మనకు ప్రామాణికతను తెచ్చిపెట్టింది. వివిధ విశ్వాసాలు మన జాతీయతకు సముచిత ఉచ్వాసాన్ని అందించాయని తెలిపారు. ఇక లౌకికవాదం మనం నమ్మిన విశ్వాసాలలో కీలకం. నిజానికి లౌకికిత మనకు మన విశ్వాసపు ప్రాతిపదిక అని ప్రణబ్ తేల్చిచెప్పారు. శతకోటి ముప్పయి లక్షలకు చేరుతున్న భారతీయుల సార్వజనీనత అంతా ఇంతా కాదని, మన దేశంలో 122కి పైగా భాషలు ఉన్నాయని, 1600 మాండలికాలు, ఏడు ప్రధాన మతాల సంవిధానాల పాటింపు ఉందని ప్రణబ్ చెప్పారు. అయితే ఇంతటి బహుళత్వంలోనూ మనం ఒకే వ్యవస్థగా, ఒకే జెండా నీడలో భారతీయ గుర్తింపుతో జీవిస్తున్నామని మాజీ రాష్ట్రపతి తెలిపారు. భారతీయ సమాజంలో నిండుకున్న విస్తారిత బహుళత్వం జాతీయతకు విశిష్టతను ఆపాదించిందని తెలిపారు. భారతదేశ జాతీయత కేవలం ఒక్క భాషకు సంబంధించిది కాదని, మనకు ఒక్క మతం లేదని, మనకు ఒక్క శత్రువు లేడని వ్యాఖ్యానించారు.
పేదరికంపై పోరుసల్పాలి
మనం ఇప్పుడు పేదరికంపై ఉమ్మడి పోరు సాగించాలి. వ్యాధులపై తిరగబడాలి. స్వస్థత కోసం పరితపించాలని మాజీ రాష్ట్రపతి ఆకాంక్షించారు. మన సలక్షణ జాతీయతను వదులుకునే తత్వాన్ని దూరంగా నెట్టాలి అని ఆయన కోరారు. ప్రజలు ప్రభుత్వ కార్యకలాపాలలో కేంద్ర బిందువులు . వారిని విడదీసి పాలించే విధానాలు మనకొద్దు అని ప్రణబ్ స్పష్టం చేశారు. పేదరికం ఇతర రుగ్మతలపై ప్రజలంతా కలిసికట్టుగా పోరాడే దిశలో అధికార వ్యవస్థ పాటు పడాలి. ప్రజలను సమీకరించుకోవాలి అని పిలుపు నిచ్చారు.
నిరాసక్తతను పారదోలే దిశలో ప్రభుత్వాలు కృషి సల్పాల్సి ఉందన్నారు. అప్పుడే జాతీయతా స్వతహసిద్ధంగా స్రవంతిగా సాగుతుందన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు జాతీయత అనేది పరిమితం కాదు, దుందుడుకు స్వభావితం కాదు. విధ్వంసకరం కాదని ప్రణబ్ ఈ సందర్భంగా జాతిపిత వ్యాఖ్యలను ఉటంకించారు. ఆర్‌ఎస్‌ఎస్ సభలోనే మాజీ రాష్ట్రపతి తమ ప్రసంగంలో మాజీ ప్రధాని నెహ్రూ పుస్తకం డిస్కవరి ఆఫ్ ఇండియా గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకంలో భారత దేశ నేపథ్యంలో లౌకికత్వపు ప్రాధాన్యతపై ఆయన విశ్లేషణ గొప్పగా ఉందని ప్రశంసించారు. హిందువు, ముస్లిం, సిక్కు, దేశంలోని ఇతర వర్గాల సిద్ధాంత ఏకీకరణతోనే జాతీయత సంతరించుకుంటుందని తాను నమ్ముతున్నట్లు నెహ్రూజీ పేర్కొన్నారని ప్రణబ్ గుర్తు చేశారు.

సంఘ్ గుర్తింపు సంఘ్‌కు..ప్రణబ్ ఉనికి ప్రణబ్‌కు: భగవత్

సంఘ్ పరివార్‌కు ఎవరూ ఇతరులు కారని, అంతా తమవారేనని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మెహన్ భగవత్ స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సభకు రావడంపై తలెత్తిన వివాదంపై సభలో భగవత్ ప్రస్తావించారు. ఇతరులు అనే మాట ఆర్‌ఎస్‌ఎస్‌కు వర్తించదని, ముఖర్జీ ఇక్కడికి రావడం వల్ల ఆయన గుర్తింపు ఏదీ పోదని, ఆయన ఆయనలాగానే ఉంటారని, ఇక సంఘ్ సంఘ్‌లాగానే ఉంటుందని భగవత్ స్పష్టం చేశారు. ఇతరులు వేదికకు రావడం అనే వివాదానికి తావు లేదని, ఎవరూ సంస్థకు వేరు కాదని తేల్చిచెప్పారు.  ఎవరికైనా ఏ విషయం పై అయినా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చునని అయితే వారంతా భరతమాత ముద్దుబిడ్డలేని చెప్పారు. ప్రతి ఏటా సంఘ్ సభకు వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను పిలవడం ఆనవాయితీగా ఉందని తెలిపారు. ఇంతకు ముందు ఎందరో ప్రముఖులు ఆర్‌ఎస్‌ఎస్ కీలక సభలకు అతిథులుగా వచ్చారని గుర్తు చేశారు.

Comments

comments