Home మహబూబ్‌నగర్ కష్టాల ఖరీఫ్ పోయే.. సంతోషాల ఖరీఫ్ వచ్చే

కష్టాల ఖరీఫ్ పోయే.. సంతోషాల ఖరీఫ్ వచ్చే

The difficulty of kharif goes on .. happiness comes to kharif

ఏరువాక తర్వాత జోరందుకోనున్న ఖరీఫ్
నాడు కరువు, వలసలు
నేడు కోనసీమను తలపించే పచ్చని పొలాలు
పెరిగిన ఆయకట్టు స్థిరీకరణ
ఈ ఏడాది అదనంగా 30 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరుగుదల రైతులకు భరోసా నింపిన  రైతు బంధు పథకం

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్: ఒకప్పుడు కరువుకు,వలసలకు పెట్టింది పేరు పాలమూరు. ఎండిన చెరువులు, బీడువారిన పొలాలు. వ్యవసాయం పనులు లేక బక్కచిక్కిన రైతులు బతుకు జీవుడా అంటూ ముంబాయి, గుజరాత్,వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి. అనేక గ్రామాల్లో రైతులు లేక స్మశాన వాతావరణం తలపించే గ్రామాలు. ముసలి వాళ్లు, చిన్న పిల్లలే గ్రామాలకు దిక్కు. వలసలు వెళ్లిన కొడుకు కోడళ్లు తిరగి వస్తారన్న నమ్మకాలు లేని పరిస్ధితులు.చివరి చూపులు కోసం వృద్దుల ఎదురు చూపులు. ముంబాయి బస్సు ఎప్పడు వస్తుందా.. అందులో తమ వారు ఉన్నారా అంటూ ప్రతి రోజు ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితులు.అది ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పాలమూరు జీవన చిత్రం. కాని నేడు రాష్ట్ర విభజన తర్వాత టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో పాలమూరు ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది.నేడు పాలమూరు నుంచి వలసలు లేవు. ఇక్కడికే ఇతర రాష్ట్రాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. కరువులేదు. వలసలు లేవు.కోన సీమ తరహాలో పాలమూరు జిల్లా పచ్చగా మారుతోంది. జిల్లాను కరువు రక్కసి నుంచి పారదోలి పచ్చ పాలమూరుగా మార్చే వరకు నిద్రపోనని హామీ ఇచ్చిన ముఖ్యమ్రంతి తమ పట్టుదల కారణంగా పాలమూరు జిల్లా వ్యవసాయ రంగంలో పురోగాభివృద్ది వైపు పయనిస్తోంది. జిల్లాకు జీవనాడిగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో వేలాది ఎకరాల్లో సాగునీరు లభించే అవకాశాలు ఉన్నాయి. జూరాల, భీమా, నెట్టెంపాడు,కోయిల్‌సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండడంతో జిల్లా సాగునీటి ఆయికట్టు స్థీరీకరణ భారీగా పెరిగింది. తద్వార వలసలు వెళ్లిన రైతులు తిరిగి తమ వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇక్కడే ఉండి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. కొత్తకోట, దేవరకద్ర,మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా గత ఏడాది కంటే పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మిషన్ కాకతీయ వంటి మంచి పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వాటిల్లో నీళ్లు నింపుకునే ప్రయత్నం చేయడంతో అనేక చెరువులు నీటితో నిండి గత ఏడాది ఆయికట్టు కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో రైతుల్లో కరువు చీకట్లు కనుమరుగు అవుతున్నాయి.వ్యవసాయంలో ఉత్పాదకత శక్తిని పెంచి తద్వార లాభాల బాటలో రైతులు ఉండాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశాలు ఉన్నాయి.

ఖరీఫ్‌కు పండగ చేసుకోనున్న రైతన్న:
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం రైతుల జీవితాల్లో కొత్త భరోసాను నింపింది. గతంలో పెట్టుబడులకు డబ్బలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బ్యాంకులు సకాలంలో స్పందించక పోవడం,రుణాలు ఇవ్వక పోవడంతో ప్రవేట్ వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో నలిగిపోయే వారు. ప్రకృతి వైపరిత్యాలకు పంటలు చేతికి రాకపోగా, వచ్చిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా కుంగిపోయే వారు. అప్పలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా జిల్లాలో అనేకం. వ్యవసాయ జూదంలో ఓడిపోయిన రైతులే అధికం. పంటలు చేతికి రాక, పిల్లలు చదివించుకోలేక,ఆడపిల్లలకు వివాహాలు చేయలేక జిల్లా రైతాంగం తీవ్ర దుర్బిక్షంలో ఉండాల్సిన పరిస్ధితులు.ఇటీవల ముఖ్యమ్రంతి కెసిఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం రైతులు జీవితాల్లో కొత్త భరోసాను, ఆశలను రేకెత్తించింది. ఎకరాకు రూ. 4 వేలు పంటలకు పెట్టుబడులు ముందస్తుగానే రైతులకు ప్రభుత్వం ఉచితంగా రైతులకు అందించింది.అది కూడా మద్య దళారుల లేకుండా నేరుగా ఆయా రైతుల ఆకౌంట్లలో జమ అయ్యేలా చేసింది.దీంతో ఖరీఫ్‌కు సాగుకు రైతులు సిద్దమవుతున్నారు.గతంలో వడ్డీ వ్యాపారలు దగ్గరకు వెళ్లకుండా ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు డబ్బులు ఉండడంతో ధైర్యంగా వ్యవసాయానికి సిద్దమవుతున్నారు.

ఖరీఫ్‌కు అంతా సిద్ధ్దం:
ప్రస్తుతం జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటుండంతో రైతులు ఖరీఫ్ సాగును ఈ సారి పండుగలా చేసుకోనున్నారు. పకృతి కరుణిస్తే ఈ సారి ఖరీఫ్ రైతులకు లాభాలను చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది అన్ని పంటలు కలిసి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో పంటలు సాగు జరగగా, ఈ ఏడాది ఆయికట్టు పెరగడం, రైతు బంధు ద్వారా వ్యవసాయ సాగుకు డబ్బలు ఉండడంతో అదనంగా మరో 30 వేల ఎకరాల్లో ఆయికట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో లాగా విద్యుత్ కొరతలు, ఎరువుల కోసం ధర్నాలు ఉండేవి. నేడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. 17 వేల 85 వేల క్వింటాళ్లు విత్తనాలు,లక్షా 26 వేల 99 టన్నుల ఎరవులు ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది.అవి గోదాముల్లో సిద్దంగా ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రైతుల్లో అనందం వ్యక్తం అవుతోంది. ఒక వైపు విద్యుత్ సౌకర్యం ఉండడం, ఎరవులు,విత్తనాలు సిద్దంగా ఉండడంతో ఏరువాక పున్నమి తర్వాత ఖరీఫ్‌సాగు జోరుందుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు నకితీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా కఠిన చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుండడంతో నకిలీ కేటుగాళ్లు జంకుతున్నారు.
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపించే కార్యక్రమాలకు పాల్పడుతుండడంతో నకిలి విక్రేతలు భయపడుతున్నారు. నకిలీ విత్తనాలకు కేరాఫ్‌గా మారిన భూత్‌పూర్‌పై అధికారులు డేగ కన్ను పెట్టడంతో నకీలి చలామణి చాల వరకు అదుపులోకి వచ్చింది. దీంతో ఖరీఫ్ సాగు బహుబాగుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కన్నీళ్లు, కష్టాలతో వ్యవసాయ పనులు మొదులు పెడుతున్న రైతులు నేడు సుఖ సంతోషాలతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు.కన్నీళ్ల పాలమూరు పచ్చ పాలమూరుగా మారనుంది.